ఆ ప్రతిపాదనలను ఆమోదించొద్దు
ప్రభుత్వ శాఖలకు సీఎస్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో గల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి షీలాభిడే కమిటీ చేసిన ప్రతిపాదనలను ఆమోదించవద్దని, వాటిని అమలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాశారు.
ఇటీవల విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన 1,253మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ ఉద్యోగులను వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం సూచించినా తెలంగాణ సర్కారు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఉద్యోగుల పంపిణీ తేలే వరకు ఈ సంస్థల్లో ఆస్తులు, అప్పుల పంపిణీని చేయరాదంటూ షీలాభిడే కమిటీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీని కొనసాగింపుగా ఇప్పటికే ఆస్తులు, అప్పులు పంపిణీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయరాదని, తిరిగి షీలాభిడే కమిటీకి పంపించేయాలని అన్ని శాఖలను సీఎస్ ఆదేశించారు.