cs rangarajan
-
దేవుళ్లకు జాతులు, కులాలు ఉండవు!
మల్లెపల్లి లక్ష్మయ్యగారి వ్యాసాన్ని బాధతో చదివాను. ఆయన మేధావి. జ్ఞానసంపన్నుడు. కాలానుగుణ మార్పులను సూక్ష్మంగా చూస్తున్నవారు. అలాంటి వ్యక్తి ‘దేవుడికీ తప్పని కులవివక్ష’ అనే వ్యాసం రాయడాన్ని (సాక్షి 29–08–2019) సున్నితంగా తిరస్కరిస్తున్నాను. వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క కాలంలో సద్గురు రవిదాస్ మహరాజ్ లాంటి అవతార పురుషులు పుడుతూనే ఉన్నారు. వారిని సమాజం గుర్తిం చింది. వారి సందేశాలను భక్తితో స్వీకరించాయి. సాధువుల జాతి, పుట్టుక అడుగకు, వారి జ్ఞానాన్ని స్వీకరించు. ఒరను పట్టించుకోకు కత్తి పదునును చూడు. సంత్ రవిదాస్ జయంతి సమావేశాల్లో చాలాసార్లు నేను పాల్గొన్నాను. ఢిల్లీలో సంత్ రవిదాస్ దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు ముందుగా స్పందించిన వాణ్ణి నేనే.. సంత్ రవిదాస్ దళితులకే కాదు.. మానవజాతికే గురుతుల్యులు. 2018 ఏప్రిల్ 16 సాయంత్రం 4 గంటలకు ఒక దళిత శ్రీ వైష్ణవ భక్తుడిని నా భుజాలపై కూర్చోబెట్టుకుని జియాగూడ శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనికి మేళతాళాలతో భక్త బృందం వెంటరాగా తీసుకువెళ్లాను. భక్తుల గోవింద నామ స్మరణ, తిరుప్పాణాళ్వారు రచించిన ‘అమలనాది పిరాన్ పాశురగానం,’ అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అనే గానాల మధ్య దేవుడిముందు అందరూ సమానమే అని మరోమారు నిజం చేస్తూ, మునివాహన ఉత్సవం బ్రహ్మాండంగా నిర్వహించాం. భగవద్రామానుజులవారి 1000వ జయంతి సంవత్సరంలో ఈ ఉత్సవం జరగడం విశేషం. వైష్ణవాచార్య గురుపరంపరలో నమ్మాళ్వారు ప్రథమాచార్యులు. నమ్మాళ్వారు శూద్రజాతిలో జన్మించారు. శ్రీవైష్ణవులు పన్నెండుగురు ఆళ్వారులను భక్తితో పూజిస్తారు. పన్నెండు మంది ఆళ్వారులు వివిధ వర్ణాలలో జన్మించి పూజలందుకుంటున్నారు. వీరిలో తిరుప్పాణ్ ఆళ్వార్ దళిత కులానికి చెందినవారు. ఈ పరమ భక్తుడు శ్రీరంగనాథునికి తన జీవితాన్ని అంకితం చేసి శాస్త్రబద్ధ జీవనం చేస్తూ శ్రీరంగంలోని ఆలయం వెలుపలి నుండే రంగనాథుని గుణగానం చేస్తూ ఉండేవారు. పరమ భక్తుడైన ఈ ఆళ్వారుని, ఆలయ అర్చకులైన శ్రీలోక సారంగముని గుర్తించారు. శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం శ్రీలోకసారంగముని తిరుప్పాణాళ్వారుని కలుసుకుని, ఆ భక్తాగ్రేసరుని తన భుజాలపై కూర్చుండబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించమని తనను స్వామి ఆదేశించారని తెలి పారు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక ఆళ్వారు అంగీకరించారు. ఈ విధంగా ‘మునివాహనునికి’ సంతోషకరమైన స్వామి దర్శనం లభించింది. ఈ సంఘటన దాదాపు 2,700 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మన సమాజంలో కులాల మధ్య వివక్ష, అగౌరవం అధికంగా కనిపిస్తున్నాయి. కులాల నడుమ చెలరేగుతున్న అగౌరవం, వివక్షతలు తొలగాలనీ, అందరినీ సమానంగా గౌరవించాలన్న సందే శం ఇచ్చే విధంగా, నేను మునివాహన సేవను నిర్వహించాను. ఒక దళిత భక్తుని తిరుప్పాణాళ్వారు వలె నా భుజాలపై కూర్చుండబెట్టుకుని అమలనాది పిరాన్ పఠిస్తూ ఆలయ ప్రవేశం చేశాను. సమాజంలో ఎస్సీ, ఎస్టీ సోదరులపట్ల చూపుతున్న దుర్వ్యవహారం ఆపివేసి, ప్రజ లకు వారిపట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది. నేను 2018వ సంవత్సరం జూన్ నెలలో గుంటూరులో, జూలై నెలలో నెల్లూరులో ఈ ఉత్సవాన్ని నిర్వహిం చాను. నేను చేసిన ప్రయత్నాలు తప్పుగా మా ధర్మ శాస్త్రజ్ఞులు పరిగణించలేదు. మనువాదులుగా మీరు నిందించిన వారెవరూ నన్ను దూషించలేదు. మల్లెపల్లి లక్ష్మయ్యగారు తమ వ్యాసంలో పేర్కొన్న అంశాలు సనాతన ధర్మం కానీ, రామానుజ సాంప్రదాయం కానీ ఎన్నటికీ ఒప్పుకోవు. కొంతమంది చేసే దుశ్చర్యలకు మొత్తం సమాజాన్ని నిందించే పని చేయడం సబబు కాదు. మనమందరం కలిసి మంచి సమసమాజ స్పృహను, చైతన్యాన్ని లోకంలో ఆవిష్కరిద్దాం. లక్ష్మయ్యగారూ.. మీరూ రండి. ఇదే మా ఆహ్వానం. వ్యాసకర్త: సీఎస్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు csranga@gmail.com -
పౌరాణిక స్ఫూర్తి దాత
జస్టిస్ కోదండరా మయ్య నివాసంలో ఎందరో న్యాయవాదులు తయారయ్యారు. అలాగే మన పురాణాలపై అవగా హన పెంచడం గురించి, సనాతన ధర్మం కోసం కృషిచేసే వీరాభిమా నులూ తయారయ్యారు. ఇటీవల అస్తమించిన ఈ విశిష్ట న్యాయమూర్తి.. ఆధ్యాత్మిక సైన్యంలా మన ధర్మాన్ని ఆచరింపజేయగల యువతరం నేడు ఏర్పడాలని కాంక్షిస్తూ ఉండేవారు. కొన్నేళ్ల క్రితం నేను ఆయన నివాసానికి వెళ్లాను. మన ఇతిహాసాలను, పురాణాల గురించి తెలు సుకోవాలనే తపనతో అడుగుపెట్టిన ఒక యువ న్యాయవాదిగా నేను అడిగిన ఎన్నో ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానమిస్తూ ఆధ్యాత్మిక విలు వలను కాపాడే ప్రయత్నం చేశారు జస్టిస్. నా వ్యక్తిత్వాన్ని నాలాంటి వేలాదిమందిని తీర్చిదిద్దిన మహానుభావుల్లో జస్టిస్ కోదండరామయ్య చాలా ముఖ్యులు. రామాయణం, మహాభారతం చదివితే ఏమి లాభం? మహర్షి వాల్మీకి సాక్షాత్తూ వేదాన్నే కావ్యంగా రూపొందించారు. శ్రీ మహా భారతం 5వ వేదంగా వేదసారాన్ని తనలో నింపుకొన్న వేద వ్యాఖ్యాన గ్రంథంగా ప్రసిద్ధికెక్కింది. ఆ విధంగా ఈ రెండు మహాగ్రంథాలూ కేవలం ప్రాచీన చరిత్రను మాత్రమే కాక నిర్దిష్టమైన సందేశాన్ని మానవజాతికి ఇస్తు న్నాయి. రామాయణం అర్ధకామాలను గూర్చి విస్పష్టంగా, ధర్మాన్ని గురించి విస్తృతంగా వక్కాణి స్తుంది. వేదాల అర్థాలను వివరించి చెప్పటం రామా యణం లక్ష్యం. మన ఇతిహాసాలు కనుమరుగయ్యే స్థితికి కారణం? ఎందుకంటే ఈ గ్రంథాలు రెండూ మత పర మైనవి అనే ముద్రపడింది. అలాగే ధర్మ భావన కూడా మతపరమైనదే అని కొందరు అనుకుంటు న్నారు. అది రాజకీయ ఊహాగానాలతో ముడిపడి ఉంది. జాతి ప్రయోజనం దృష్టితో మనం దీనిని పరీ క్షించాలి. ఇందులో పాశ్చాత్యుల ప్రమేయం ఎంత సార్? పాశ్చాత్యులు వారి నిఘంటువులలో ఇలాంటి కావ్యాన్ని ‘ఎపిక్’ అని నిర్వచించారు. వారి నిర్వ చనం ప్రకారం ఎపిక్ అంటే దీర్ఘమైన కావ్యం. పూర్వులైన వీరుల చరిత్రను వర్ణించేది. కానీ అది మైథాలజీ (మిథ్) అనగా ఇది నిజమైన విషయం కాకున్నా, నిజంగా భావించి ప్రజలు దానిని నమ్ము తారు. ఈ ఎపిక్‌ను లెజండరీ కథగా చెప్తారు. అనగా నిజంగా జరగనిది. కానీ ప్రజలందరూ నమ్ముతారు. నిజము కానప్పటికీ అని వారి నిర్వచనము. వర్డ్స్ వర్త్ ఎన్సైక్లోపీడియాలో ఈ ఎపిక్ దీర్ఘమైన కావ్యం. అది కాస్మోలాజికల్– మనుష్యులకు, దేవతలకు సంబంధించిన కావ్యం. అలాంటి ఎపిక్స్ అన్ని జాతులకు లేవు. గ్రీకు దేశస్తుడు హోమర్ రచించిన ఇలియడ్ ఒడిస్సీ అతిముఖ్యమైన ప్రఖ్యాతి చెందిన ఎపిక్. అలాగే మన రామాయణ భారతాలు కూడా ఎపిక్స్‌గా గుర్తింపు పొందాయి. ఆ నిర్వచనం ప్రకారం ఈ ఎపిక్ జాతికి ఆధారభూతమైనది లేదా జాతీయ భావాన్ని సమకూర్చేది, మత విషయమై నది కావచ్చు లేక దివికి భువికి చెందిన కథ కావచ్చు. పాశ్చాత్యుల ‘ఎపిక్’ మన పురాణాలకు లేవా? మన రామాయణం, భారతం దివికి భువికి చెందిన కావ్యాలు కనుక పాశ్చాత్యులు వర్ణించిన ఎపిక్ లక్షణాలు ఈ కావ్యాలకు కూడా ఉన్నాయి. కానీ మన దేశపు ఈ రెండు కావ్యాలు పాశ్చాత్యులు వర్ణించే దివికి చెందిన విషయాలు మాత్రమే కాక, ఇవి ఇతిహాసాలు. ఇతిహాసం అంటే ఇతి హ ఆస – ‘ఇట్లు జరిగినది’ అని అర్థం. ఈ దేశస్థులు ఎవరూ రామాయణం, భారతంలోని వీరులు కల్పనగా అబ ద్ధంతో వర్ణించారని ఎన్నటికీ తలవరు. కారణం వాటిలోని అవతారమూర్తులైన రాముడు, కృష్ణుడే కాక అంతకుముందు మన దేశస్థులు అవతారమూ ర్తుల అవతరణ ఎరిగి వారిని ఆరాధించిన మహ నీయులు. ఈ కావ్యములలోని వివిధ వర్ణనలు కల్ప నలుగా ఎప్పుడూ తలవరు. ప్రస్తుతం ఆంగ్ల విద్య చదివి యువతరం వారు, ప్రభుత్వాధికారులు రామా యణ భారతాలను ఎపిక్‌గా మాత్రమే భావించినం దువలన సేతు ప్రస్తావన విషయంలో అధికారులు కూడా రాముడు పుట్టినట్లు ఆధారము లేదని చెబు తున్నారు. దీనికి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇందుకు కారణం మన పాఠ్య ప్రణాళికల్లో ఈ మహా కావ్యాలను పూర్తిగా పరిహరించడమే. సీఎస్ రంగరాజన్ వ్యాసకర్త వంశపారంపర్య ధర్మకర్త, ప్రధాన అర్చకులు, చిలకూరు బాలాజీ దేవాలయం -
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
-
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య పరాశ్రీకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆయనను రంగరాజన్ భుజస్కంధాలపై ఎత్తుకొని మండపం నుండి ప్రధాన ధ్వజస్థంభం వరకు తీసుకెళ్లారు. ప్రదక్షిణ అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. శిరస్సుపై శఠగోపం ధరింపచేసి ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సమావేశంలో రంగరాజన్ మాట్లాడుతూ 2,700 ఏళ్ల నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కుల ఆధారిత సమాజంలో దళితులు నేటికీ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ఇది అంకురార్పణ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ ప్రతిగుడిలో దళితులకు ప్రవేశం కల్పించడంతోపాటు వారిని అన్ని విధాల జాగృతిపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి కారెంపుడి లక్ష్మీనరసింహా మాట్లాడుతూ నగరంలో మొదటిసారి చేపట్టిన మునివాహన సేవా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆధిత్య పరాశ్రీ మాట్లాడుతూ దళితులు ఆలయ ప్రవేశం చేయడంతోపాటు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తిరుపావై కోకిల మంజులశ్రీ, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ వంశీతిలక్, రంగనాథస్వామి దేవాలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్టీ చార్యులు, శేషాచార్యులు, సుందర రాజన్, రాధామనోహర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
అర్చకులపైనా మీ ప్రతాపం?!
సందర్భం అఖిలపక్ష సమావేశం 2007లో సెలక్ట్ కమిటీ నివేదిక ప్రాతిపదికన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని సవరించింది. అంతే... ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం... ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచినా సవరించిన ఆ చట్టాన్ని అమలుపరిచే చర్యలు మాత్రం శూన్యం. మన దేశంలో సమస్యలెన్ని ఉన్నాయో, కమిటీలు కూడా అన్ని ఉన్నాయి. మలమూత్ర శాలల నుంచి రైతుల, విద్యార్థుల వరకు... సవాలక్ష సమస్యలపై లక్షల పేజీల నివేదికలను ఈ కమిటీలు సమర్పిస్తుంటాయి. వీటిలో వెలుగు చూడనివి కొన్ని అయితే, ఎక్కువ భాగం అమలుకు నోచుకోనివే. ఒక ప్రభుత్వం పోయి, ఇంకో ప్రభుత్వం వస్తుంటుంది. ప్రజా స్వామ్యాన్ని ఇవి ఎంతగా గౌరవిస్తాయంటే సమాధానం దొరకని ప్రతి సమస్యకు కమిటీ ఏర్పాటే పరిష్కారంగా భావిస్తాయి. తీరా కమిటీలు, నివేదికలు అన్నీ అయి సిఫార్సులు చేతికందే సమయానికి పాత్రధారులు మరో పాత్రలతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అమూల్యమైన డబ్బూ, కాలాన్ని వెచ్చించి కమిటీలు మల్లగుల్లాలుపడి అందించిన నివేదికలు, సిఫార్సులు, విశ్లేషణలు.. అధి కారుల బల్లలమీద అతి సహజంగా మరణిస్తుంటాయి. ఈ మధ్య అర్చకుల జీతాలలో కోతలు విధిస్తూ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం హేయమైనది, హాస్యాస్పదమైనది. ఇలాంటి ఆదే శాలు, హెచ్చరికలు ఎన్ని జారీ అయినా చట్టంలో అసంబద్ధత, అస్పష్టత, అసమగ్రత కొనసాగినంతకాలం మన సనాతన ఆలయ వ్యవస్థ స్ఫూర్తికి ఈ పాశవిక చట్టం కోరల్లోని విష వాయువులు సోకుతూనే ఉంటాయి. దీని వెనుక ఉన్న విషాదగాథ 1987 నాటిది. గుళ్లలో అర్చకత్వం చేసి, ఇతరత్రా సేవలు చేసి అర్ధాకలితో బొటాబొటీ జీవితాలు గడిపే అర్భకుల కథ ఇది. సుప్రీంకోర్టు గడపలు కూడా తొక్కిన తరువాత రెండు కమిటీలను కోర్టు నియమించింది. వేతన స్కేళ్ల కమిటీ, అర్చకుల సంక్షేమ కమిటీ. వీటి నివేదికలను కూడా ప్రభుత్వం ఆమోదించి కోర్టు ముందుంచింది. కోర్టువారు కూడా సంతోషించి 1997లోనే వాటి అమ లుకు ఆదేశించారు. అంతే! ఆ తరువాత అదేమీ ఎరగనట్లు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. 1987లో చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల్ని గుడ్డిగా నమ్మి అత్యంత ఆర్భాటంగా, హడావుడిగా, ఆగమేఘాలమీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టం (30/87) 30 ఏళ్ల కాలంలో ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పలు కింది కోర్టుల్లో పిటిషన్లు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో లిటిగేషన్లు, తాత్కా లిక ఇంజెంక్షన్లు, కొన్ని సమర్థనలు, కొన్ని రద్దులు, కోర్టు నుంచి కొత్త ఆదేశాలు, ఎండోమెంట్ కమిషనర్ల అత్యుత్సాహభరిత సర్క్యులర్లు.. ఇవన్నీ చవిచూస్తూనే ఈ చట్టం– దేవాలయ వ్యవస్థలో కీలకమైన అర్చక వ్యవస్థకి మాత్రం భయంకరమైన చేదు అనుభవాన్ని చవిచూపించింది. ప్రసాదాలు, హారతిపళ్లెంలో వాటాలు సహా అన్ని వాటాలకు అర్చ కులు ‘చట్టప్రకారం అనర్హులు.. అనర్హులు’ అని ఎత్తిచూపుతూ, వారిని నిస్సహాయుల్ని చేసే, దౌర్జన్యాలు జరిగాయి. స్వార్థంతో అనర్హుల్ని అర్చ కులుగా చేసే ప్రయత్నంలో వృద్ధ పూజారుల్ని సైతం దుర్భాషలతో అవ మానపరిచిన దుర్ఘటనలు జరిగాయి. అర్చకుల శ్రమను సొంత ప్రయోజ నాల కోసం దోచుకునే దుస్సాహసాలు జరిగాయి. ఎక్కడ్నుంచి ఎక్కడి కైనా బదిలీ చేసెయ్యొచ్చునంటూ అర్చక కుటుంబాల్ని భయోత్పాతానికి గురిచేసే కుయుక్తులు ప్రయోగించారు. తమ అక్రమార్జనలకి సహకరించే దుష్ట శక్తుల్ని ధర్మకర్తలుగా నియమింపజేసే దురాగతాలు జరిగాయి. అవమానభారంతో, ఆకలి బాధతో, కళ్లలోంచి రక్తం చిమ్మేటంతటి ఆక్రో శంతో ఒకరిద్దరు అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చల్లా కొండయ్య కమిషన్ నివేదిక ఆధారంగా–ఆలయ వ్యవస్థకి జీవగర్రలాంటి అర్చక కుటుంబాల మీద గత పదహారేళ్లుగా సాగిన, ఇంకా సాగుతున్న ఈ దాడితో శారీరక, మానసిక క్షోభకి గురవుతున్న నిస్సహాయ అర్చక కుటుంబాల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపేం దుకు వైఎస్సార్ చిత్తశుద్ధితో ప్రయత్నించారు. 2004లో వైఎస్సార్ ప్రభుత్వం కొలువుదీరింది. అఖిలపక్ష సమావేశం 2007లో వైఎస్సార్ ప్రభుత్వం సెలక్ట్ కమిటీ నివేదికతో చివరకు దేవాదాయ చట్టాన్ని సవ రించారు. అంతే. ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం.. ఇప్పటికి 9 ఏళ్లు గడిచినా చట్టాన్ని అమలుపరిచే చర్యలు శూన్యం. కడుపుకాలిన బాధితులు 2010లో సమ్మె చేయక తప్పలేదు. ఇంతకూ వీరు అడుగుతున్నది దేవ రహస్యం కాదు. పీఆర్సీ ప్రకారం జీతాలివ్వండని అర్చకులు, దేవాలయ సిబ్బంది కోరుతున్నారు. సీని యర్లేమో పింఛను కూడా అడుగుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమ బద్ధీకరణను, మరికొందరు కారుణ్య నియామకాల్ని కోరుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, యాదగిరి గుట్ట, ద్వారకా తిరుమల, బాసర, వేములవాడ, భద్రాచలం దేవాలయాలకు చెందిన అర్చకులు, ఆలయ సిబ్బంది అంతా సమ్మె చేయడంతో ప్రభుత్వం అక్టోబర్ 24, 2010న ఒక కమిటీని నియమిస్తూ జీఓ (జీవో ఎంఎస్ నం. 1395) కూడా జారీ చేసింది. ఈ కమిటీ జనవరి 5, 2011న నివేదిక కూడా ఇచ్చేసింది. ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఆల యాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు (ఈఓలకు) ఇతర ఉద్యోగులకు పీఆర్సీ స్కేళ్లు వర్తింపజేస్తూ జీఓ కూడా జారీ చేసేసింది. తమాషా ఏమిటంటే.. భక్తుల దక్షిణలే గుళ్లకు ఏకైక ఆదాయవనరు. భక్తులిచ్చే విరాళాల్లో 21.5 శాతం ప్రభుత్వమే గుంజేసుకుంటుంది. దేవా దాయ శాఖ కమిషనర్, ఉద్యోగులు, కార్యనిర్వాహక సిబ్బంది జీతాలన్నీ ఈ నిధుల నుండే చెల్లిస్తారు. ఈ సోకులు అనుభవిస్తున్న వారంతా ప్రభు త్వానికి చెందిన ‘వైట్‌కాలర్’ ఉద్యోగులు కాగా, గుడి సిబ్బంది మాత్రం దిక్కూ మొక్కూ లేని ద్వితీయ శ్రేణి పౌరులు. జనవరి 5, 2011 నాటి నివేదికను ప్రభుత్వం ఆమోదించినా అమలు చేసే నాథుడేలేడు. కడుపు చించుకుంటూ దాదాపు 20వేల మంది ఆలయ సిబ్బంది మరో మారు సమ్మెతో రోడ్డెక్కారు. అంతే, మరో కమిటీ సాక్షాత్కరించింది. ఇప్పుడు ఆ కమిటీ ఎక్కడుందో, ఏమైందో పత్తాలేదు. అర్చక కుటుంబాల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు సూచించిన సమీ కృత పథకాన్ని అమలు చేయకుండా, వాళ్ల అర్చక స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ, అర్చక కుటుంబాల ఆక్రోశాల మధ్య వారిని శాశ్వతంగా ఆలయా ల్నుంచి తరిమివేసేలా– తద్వారా ఆలయ సంస్కృతి అంతరించిపో యేలా చేస్తున్న కొంతమంది స్వార్థపరులైన అధికారులు చెప్పే విధంగా ప్రభుత్వం నడవకూడదు. ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావా లను గౌరవించి దేవాలయాలను, అర్చక వ్యవస్థను పరిరక్షించే లక్ష్యంతో పనిచేయాలి. ఈ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసే ప్రభుత్వం మాత్రమే పది కాలాలపాటు వర్ధిల్లాలని ఆలయ సంస్కృతీ పరిరక్షణాభిలాషులందరం ఆశిద్దాం. అలాంటి సంకల్పం ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందా?! ఆ పర మాత్మకే ఎరుక!! వ్యాసకర్త చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు : సీఎస్ రంగరాజన్ మొబైల్ : 98851 00614