అర్చకులపైనా మీ ప్రతాపం?! | Your power poitics on the priests ? | Sakshi
Sakshi News home page

అర్చకులపైనా మీ ప్రతాపం?!

Published Sat, Aug 19 2017 1:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

అర్చకులపైనా మీ ప్రతాపం?!

అర్చకులపైనా మీ ప్రతాపం?!

సందర్భం
అఖిలపక్ష సమావేశం 2007లో సెలక్ట్‌ కమిటీ నివేదిక ప్రాతిపదికన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని సవరించింది. అంతే... ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం... ఇప్పటికి 9  సంవత్సరాలు గడిచినా సవరించిన ఆ చట్టాన్ని అమలుపరిచే చర్యలు మాత్రం శూన్యం.


మన దేశంలో సమస్యలెన్ని ఉన్నాయో, కమిటీలు కూడా అన్ని ఉన్నాయి. మలమూత్ర శాలల నుంచి రైతుల, విద్యార్థుల వరకు... సవాలక్ష సమస్యలపై లక్షల పేజీల నివేదికలను ఈ కమిటీలు సమర్పిస్తుంటాయి. వీటిలో వెలుగు చూడనివి కొన్ని అయితే, ఎక్కువ భాగం అమలుకు నోచుకోనివే. ఒక ప్రభుత్వం పోయి, ఇంకో ప్రభుత్వం వస్తుంటుంది. ప్రజా స్వామ్యాన్ని ఇవి ఎంతగా గౌరవిస్తాయంటే సమాధానం దొరకని ప్రతి సమస్యకు కమిటీ ఏర్పాటే పరిష్కారంగా భావిస్తాయి. తీరా కమిటీలు, నివేదికలు అన్నీ అయి సిఫార్సులు చేతికందే సమయానికి పాత్రధారులు మరో పాత్రలతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అమూల్యమైన డబ్బూ, కాలాన్ని వెచ్చించి కమిటీలు మల్లగుల్లాలుపడి అందించిన నివేదికలు, సిఫార్సులు, విశ్లేషణలు.. అధి కారుల బల్లలమీద అతి సహజంగా మరణిస్తుంటాయి.

ఈ మధ్య అర్చకుల జీతాలలో కోతలు విధిస్తూ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం హేయమైనది, హాస్యాస్పదమైనది. ఇలాంటి ఆదే శాలు, హెచ్చరికలు ఎన్ని జారీ అయినా చట్టంలో అసంబద్ధత, అస్పష్టత, అసమగ్రత కొనసాగినంతకాలం మన సనాతన ఆలయ వ్యవస్థ స్ఫూర్తికి ఈ పాశవిక చట్టం కోరల్లోని విష వాయువులు సోకుతూనే ఉంటాయి.

దీని వెనుక ఉన్న విషాదగాథ 1987 నాటిది. గుళ్లలో అర్చకత్వం చేసి, ఇతరత్రా సేవలు చేసి అర్ధాకలితో బొటాబొటీ జీవితాలు గడిపే అర్భకుల కథ ఇది. సుప్రీంకోర్టు గడపలు కూడా తొక్కిన తరువాత రెండు కమిటీలను కోర్టు నియమించింది. వేతన స్కేళ్ల కమిటీ, అర్చకుల సంక్షేమ కమిటీ. వీటి నివేదికలను కూడా ప్రభుత్వం ఆమోదించి కోర్టు ముందుంచింది. కోర్టువారు కూడా సంతోషించి 1997లోనే వాటి అమ లుకు ఆదేశించారు. అంతే! ఆ తరువాత అదేమీ ఎరగనట్లు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు.

1987లో చల్లా కొండయ్య కమిషన్‌ సిఫార్సుల్ని గుడ్డిగా నమ్మి అత్యంత ఆర్భాటంగా, హడావుడిగా, ఆగమేఘాలమీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టం (30/87) 30 ఏళ్ల కాలంలో ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పలు కింది కోర్టుల్లో పిటిషన్‌లు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో లిటిగేషన్‌లు, తాత్కా లిక ఇంజెంక్షన్‌లు, కొన్ని సమర్థనలు, కొన్ని రద్దులు, కోర్టు నుంచి కొత్త ఆదేశాలు, ఎండోమెంట్‌ కమిషనర్‌ల అత్యుత్సాహభరిత సర్క్యులర్‌లు.. ఇవన్నీ చవిచూస్తూనే ఈ చట్టం– దేవాలయ వ్యవస్థలో కీలకమైన అర్చక వ్యవస్థకి మాత్రం భయంకరమైన చేదు అనుభవాన్ని చవిచూపించింది.

ప్రసాదాలు, హారతిపళ్లెంలో వాటాలు సహా అన్ని వాటాలకు అర్చ కులు ‘చట్టప్రకారం అనర్హులు.. అనర్హులు’ అని ఎత్తిచూపుతూ, వారిని నిస్సహాయుల్ని చేసే, దౌర్జన్యాలు జరిగాయి. స్వార్థంతో అనర్హుల్ని అర్చ కులుగా చేసే ప్రయత్నంలో వృద్ధ పూజారుల్ని సైతం దుర్భాషలతో అవ మానపరిచిన దుర్ఘటనలు జరిగాయి. అర్చకుల శ్రమను సొంత ప్రయోజ నాల కోసం దోచుకునే దుస్సాహసాలు జరిగాయి. ఎక్కడ్నుంచి ఎక్కడి కైనా బదిలీ చేసెయ్యొచ్చునంటూ అర్చక కుటుంబాల్ని భయోత్పాతానికి గురిచేసే కుయుక్తులు ప్రయోగించారు. తమ అక్రమార్జనలకి సహకరించే దుష్ట శక్తుల్ని ధర్మకర్తలుగా నియమింపజేసే దురాగతాలు జరిగాయి. అవమానభారంతో, ఆకలి బాధతో, కళ్లలోంచి రక్తం చిమ్మేటంతటి ఆక్రో శంతో ఒకరిద్దరు అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

చల్లా కొండయ్య కమిషన్‌ నివేదిక ఆధారంగా–ఆలయ వ్యవస్థకి జీవగర్రలాంటి అర్చక కుటుంబాల మీద గత పదహారేళ్లుగా సాగిన, ఇంకా సాగుతున్న ఈ దాడితో శారీరక, మానసిక క్షోభకి గురవుతున్న నిస్సహాయ అర్చక కుటుంబాల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపేం దుకు వైఎస్సార్‌ చిత్తశుద్ధితో ప్రయత్నించారు. 2004లో వైఎస్సార్‌ ప్రభుత్వం కొలువుదీరింది. అఖిలపక్ష సమావేశం 2007లో వైఎస్సార్‌ ప్రభుత్వం సెలక్ట్‌ కమిటీ నివేదికతో చివరకు దేవాదాయ చట్టాన్ని సవ రించారు. అంతే. ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం.. ఇప్పటికి 9 ఏళ్లు గడిచినా చట్టాన్ని అమలుపరిచే చర్యలు శూన్యం.

కడుపుకాలిన బాధితులు 2010లో సమ్మె చేయక తప్పలేదు. ఇంతకూ వీరు అడుగుతున్నది దేవ రహస్యం కాదు. పీఆర్సీ ప్రకారం జీతాలివ్వండని అర్చకులు, దేవాలయ సిబ్బంది కోరుతున్నారు. సీని యర్లేమో పింఛను కూడా అడుగుతున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు క్రమ బద్ధీకరణను, మరికొందరు కారుణ్య నియామకాల్ని కోరుకుంటున్నారు.

విజయవాడ కనకదుర్గమ్మ గుడి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, యాదగిరి గుట్ట, ద్వారకా తిరుమల, బాసర, వేములవాడ, భద్రాచలం దేవాలయాలకు చెందిన అర్చకులు, ఆలయ సిబ్బంది అంతా సమ్మె చేయడంతో ప్రభుత్వం అక్టోబర్‌ 24, 2010న ఒక కమిటీని నియమిస్తూ జీఓ (జీవో ఎంఎస్‌ నం. 1395) కూడా జారీ చేసింది. ఈ కమిటీ జనవరి 5, 2011న నివేదిక కూడా ఇచ్చేసింది. ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఆల యాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లకు (ఈఓలకు) ఇతర ఉద్యోగులకు పీఆర్సీ స్కేళ్లు వర్తింపజేస్తూ జీఓ కూడా జారీ చేసేసింది.

తమాషా ఏమిటంటే.. భక్తుల దక్షిణలే గుళ్లకు ఏకైక ఆదాయవనరు. భక్తులిచ్చే విరాళాల్లో 21.5 శాతం ప్రభుత్వమే గుంజేసుకుంటుంది. దేవా దాయ శాఖ కమిషనర్, ఉద్యోగులు, కార్యనిర్వాహక సిబ్బంది జీతాలన్నీ ఈ నిధుల నుండే చెల్లిస్తారు. ఈ సోకులు అనుభవిస్తున్న వారంతా ప్రభు త్వానికి చెందిన ‘వైట్‌కాలర్‌’ ఉద్యోగులు కాగా, గుడి సిబ్బంది మాత్రం దిక్కూ మొక్కూ లేని ద్వితీయ శ్రేణి పౌరులు. జనవరి 5, 2011 నాటి నివేదికను ప్రభుత్వం ఆమోదించినా అమలు చేసే నాథుడేలేడు. కడుపు చించుకుంటూ దాదాపు 20వేల మంది ఆలయ సిబ్బంది మరో మారు సమ్మెతో రోడ్డెక్కారు. అంతే, మరో కమిటీ సాక్షాత్కరించింది. ఇప్పుడు ఆ కమిటీ ఎక్కడుందో, ఏమైందో పత్తాలేదు.

అర్చక కుటుంబాల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు సూచించిన సమీ కృత పథకాన్ని అమలు చేయకుండా, వాళ్ల అర్చక స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ, అర్చక కుటుంబాల ఆక్రోశాల మధ్య వారిని శాశ్వతంగా ఆలయా ల్నుంచి తరిమివేసేలా– తద్వారా ఆలయ సంస్కృతి అంతరించిపో యేలా చేస్తున్న కొంతమంది స్వార్థపరులైన అధికారులు చెప్పే విధంగా ప్రభుత్వం నడవకూడదు. ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావా లను గౌరవించి దేవాలయాలను, అర్చక వ్యవస్థను పరిరక్షించే లక్ష్యంతో పనిచేయాలి. ఈ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసే ప్రభుత్వం మాత్రమే పది కాలాలపాటు వర్ధిల్లాలని ఆలయ సంస్కృతీ పరిరక్షణాభిలాషులందరం ఆశిద్దాం. అలాంటి సంకల్పం ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందా?! ఆ పర మాత్మకే ఎరుక!!

వ్యాసకర్త చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు : సీఎస్‌ రంగరాజన్‌
మొబైల్‌ : 98851 00614

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement