మద్దతు శ్రేణి 26,750-26,670
మార్కెట్ పంచాంగం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేస్తుందన్న అంచనాలు బలంగా ఏర్పడటం, చైనా మార్కెట్ నిలదొక్కుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, లోహాల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో కమోడిటీ షేర్లు ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ సాగిస్తున్నందున, అన్ని దేశాల మార్కెట్ సూచీలు గతవారం వేగంగా కోలుకున్నాయి.
ఈ ట్రెండ్‌లో భాగంగా భారత్ మార్కెట్లో ఆయిల్, మెటల్ షేర్ల ర్యాలీ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఆరువారాల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ తరుణంలో కార్పొరేట్ ఫలితాల సీజన్ వచ్చేసింది. ఇక నుంచి ఆయా కంపెనీల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
అక్టోబర్ 9తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26,200 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపి, చివరకు 859 పాయింట్ల భారీ లాభంతో 27,080 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 30,025 పాయింట్ల నుంచి సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ జరిగిన 5,192 పాయింట్ల నష్టంలో 38.2 శాతం ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్‌మెంట్ ర్యాలీలో పూడ్చుకోగలిగింది. అలాగే ఆగస్టు 24 నాటి గ్యాప్ డౌన్ శ్రేణిని కూడా గత శుక్రవారం పూడ్చుకున్నది.
కానీ ఆ లోపున ముగిసినందున, ఈ వారం సెన్సెక్స్ 27,130 పాయింట్లపైన స్థిరపడితేనే తదుపరి ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. అలా స్థిరపడితే 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 27,429 స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 200 డీఎంఏ అయిన 27,686 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం హఠాత్తుగా క్షీణత మొదలైతే 26,750-26,670 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 26,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 26,050-25,900 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు.
నిఫ్టీ మద్దతు శ్రేణి 8,130-8,095
ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో సూచించిన రీతిలో సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన తర్వాత క్రమేపీ ర్యాలీ సాగించి కీలకమైన 8,225 పాయింట్ల స్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 239 పాయింట్ల లాభంతో 8,190 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం వారం గరిష్టస్థాయి అయిన 8,230 పాయింట్లను తాకడం ద్వారా ఆగస్టు 24నాటి భారీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్‌ను నిఫ్టీ పూడ్చగలిగింది. ఈ కారణంగా సమీప భవిష్యత్తులో ఈ స్థాయిపైన స్థిరపడితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది.
ఈ స్థాయిపైన క్రమేపీ 8,329 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన కీలకమైన 200 డీఎంఏ స్థాయి అయిన 8,382 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం 8,230 స్థాయిపైన నిలదొక్కుకోలేకపోతే 8,130-8,095 పాయింట్ల శ్రేణి మధ్య నిఫ్టీకి తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 8,005 స్థాయికి క్షీణించవచ్చు. ఆ లోపున అమ్మకాల ఒత్తిడికి లోనైతే 7,925-7,875 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావొచ్చు.
- పి. సత్యప్రసాద్