గోపీచంద్, అనుమోలుకు పద్మభూషణ్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
జాతీయం
గణతంత్ర అతిథి షింజో
భారత 65వ గణతంత్ర దినోత్సవాలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జపాన్‌కు చెందిన ఓ ప్రధాని భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఇదే ప్రథమం.
క్షమాభిక్ష జాప్యమైతే మరణశిక్షను తగ్గించొచ్చు: సుప్రీం
మరణశిక్ష పడిన నేరస్తుడికి క్షమాభిక్ష ప్రసాదించడంలో కారణాల్లేని జాప్యాన్ని ప్రదర్శిస్తే వారి శిక్షను జీవితఖైదుగా తగ్గించేందుకు ప్రాతిపదికగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు జనవరి 21న పేర్కొంది. మరణశిక్ష పడిన 15 మంది ఖైదీల పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న నేరస్తుల మరణశిక్షను కూడా వారి పరిస్థితి ఆధారంగా జీవిత ఖైదుకు తగ్గించవచ్చని కోర్టు పేర్కొంది. మరణశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వాధికారులకు మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది.
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ప్రారంభం
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్- ఎన్యూహెచ్ఎం) పథకాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ బెంగళూర్‌లో జనవరి 20న ప్రారంభించారు. పట్టణ పేద ప్రజలకు సమర్థంగా ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2015 మార్చి నాటికి 50 వేలకు పైగా జనాభా ఉండే 779 పట్టణాలకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 220 మిలియన్ల మందికి ఆరోగ్య సేవలు అందుతాయి.
2005 ముందునాటి నోట్లు ఉపసంహరణ
2005 సంవత్సరానికి ముందు ముద్రించిన అన్ని కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారత రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) జనవరి 22న ప్రకటించింది. రూ. 500, రూ. 1000 నోట్లతోపాటు అన్ని పాతనోట్లను ఏప్రిల్ 1 నుంచి ఉపసంహరిస్తారు. ప్రజలు పాతనోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. 2005 నుంచి నోట్ల వెనుకవైపు మధ్యలో, కింది భాగంలో సంవత్సరాన్ని ముద్రిస్తున్నారు. దీని ఆధారంగా 2005కు ముందున్న నోట్లను సులువుగా గుర్తించవచ్చు. నల్లధనం, నకిలీనోట్లను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ పాతనోట్లను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఖనిజ వనరులను గుర్తించే గరుడ వసుధ
భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్ గరుడ వసుధను బెంగళూరులో జనవరి 22న కేంద్ర గనుల శాఖమంత్రి దిన్హా పటేల్ జాతికి అంకితం చేశారు. ఇది అత్యాధునిక సెన్సార్లతో పనిచేస్తుంది. ఈ హెలికాప్టర్‌ను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వినియోగిస్తుంది. ధృవ్ తరహాకు చెందిన ఈ హెలికాప్టర్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించింది.
ఢిల్లీలో నవకల్పన కేంద్రం
జాతీయ నవకల్పన మండలి (నేషనల్ ఇన్నోవేటివ్ కౌన్సిల్- ఎన్ఐసీ)ని జనవరి 23న ఎన్ఐసీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి సలహాదారుడు శ్యామ్ పిట్రోడా ప్రారంభించారు. దేశంలో ఇది మూడో ఎన్ఐసీ కేంద్రం. ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.
అండమాన్‌లో పడవ మునక
అండమాన్ తీరం వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ 2014, జనవరి 26న ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయింది. రోస్ దీవి నుంచి ఉత్తర అఖాతంవైపు ప్రయాణిస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఆక్వా మెరైన్ అనే ఈ పడవలో 25 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుండగా, మితిమీరిన సంఖ్యలో ప్రయాణికులను ఓవర్‌లోడ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అంతర్జాతీయం
సీఏఆర్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ‘సాంబా’
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్) తాత్కాలిక అధ్యక్షురాలిగా కేథరిన్ సాంబా పాంజా జనవరి 20 న ఎన్నికయ్యారు. ఆమె 2011లో ఆ దేశ రాజధాని నగరం బాంగ్యుకు మేయర్‌గా వ్యవహరించారు.
మరుగుజ్జు ఆస్టరాయిడ్ సిరీస్‌పై నీటిఆవిరి
ఆస్టరాయిడ్ బెల్ట్‌లోని సిరీస్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదవులతోన్నట్లు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) శాస్త్రవేత్తలు జనవరి 23న ప్రకటించారు. సిరీస్ సూర్యుడికి దగ్గరవుతున్నప్పుడు వేడెక్కి నీటి ఆవిరి విడుదలకావడాన్ని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు హెర్షెల్ స్పేస్ టెలి స్కోప్ సహాయంతో కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య గ్రహశకలాలు తిరిగే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో అతిపెద్ద వస్తువు సిరీస్. దీని పరిమాణం 950 కి.మీ. ఆస్టరాయిడ్కు ఎక్కువ, గ్రహానికి తక్కువ కావడంతో దీన్ని మరుగుజ్జు గ్రహంగా వ్యవహరిస్తున్నారు. ఆస్టరాయిడ్ బెల్టులో వస్తువుపై నీటిని కనుగొనడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది భారత వృద్ధి 5.3 శాతం: ఐరాస
భారత్ వృద్ధి 2014లో 5.35 శాతంగా నమోదుకాగలదని ఐక్యరాజ్యసమితి-2014 ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు పేరుతో వెల్లడైన నివేదిక పేర్కొంది. 2015లో ఈ వృద్ధిరేటు 5.7 శాతానికి చేరుకోవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.
దావోస్‌లో 44వ ప్రపంచ ఆర్థిక ఫోరమ్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) 44వ ప్రపంచ ఆర్థిక సదస్సు జనవరి 21 నుంచి 25 వరకు ఐదురోజుల పాటు జరిగింది. మారుతున్న ప్రపంచం, సమాజం, రాజకీయాలు, వ్యాపా రం ప్రధాన అంశంగా ఈ సదస్సు సాగింది. ఇందులో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డెరైక్టర్ జనరల్ రొబర్టో అజవెడో హాజరయ్యారు. మన దేశం నుంచి ఆర్థికమంత్రి చిదంబరం, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్) ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు.
అవార్డులు
పద్మ అవార్డులు
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ పురస్కారాల్లో రెండు పద్మవిభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారు.. డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర). ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వివరాలు: పద్మభూషణ్- దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్).
పద్మశ్రీ- మొహ్మద్ అలీ బేగ్ (ఆర్ట్-థియేటర్), డాక్టర్ రామారావు అనుమోలు (సోషల్ వర్క్) డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (సైన్స్, ఇంజనీరింగ్), డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (సైన్స్, ఇంజనీరింగ్) , రవికుమార్ నర్ర (ట్రేడ్ ఇండస్ట్రీ), డాక్టర్ సరబేశ్వర్ సహార్య (వైద్యం, సర్జరీ), ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ (సాహిత్యం, విద్య). పద్మభూషణ్ అవార్డు లభించిన ఇతర ప్రముఖుల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్, దివంగత న్యాయమూర్తి జె.ఎస్.వర్మ, ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయని బేగం పర్వీన్ సుల్తానా, సాహితీవేత్త రస్కిన్ బాండ్, తమిళ రచయిత వైరముత్తు తదితరులున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, సీనియర్ నటుడు పరేశ్‌రావల్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ రంగానికి చెందిన సంతోష్ శివన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. తదితరులను పద్మశ్రీ వరించింది. ప్రవాసాంధ్రుడు డాక్టర్ వంశీ మూట (మెడిసిన్- బయోమెడికల్ రీసెర్చ్)కు ఎన్ఆర్ఐ విభాగంలో పద్మశ్రీ లభించింది.
59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (2013)
విజేతల వివరాలు: ఉత్తమ నటుడు: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్); ఉత్తమ నటి: దీపికా పదుకొణే (గలియోంకా రాస్లీలా రామ్‌లీలా); ఉత్తమ దర్శకుడు: రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా (భాగ్ మిల్కా భాగ్); జీవితసాఫల్య అవార్డు: తనూజ; ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (తుమ్హీ హో-ఆషిఖీ-2); ఉత్తమ గాయని: మోనాలీ ఠాకూర్ (సావర్‌లూన్- లుటేరా); ఉత్తమ గీతం: ప్రశూన్ జోషి (జిందా- భాగ్ మిల్కా భాగ్)
ఇన్స్పెక్టర్ ప్రసాద్‌బాబుకు అశోకచక్ర
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్ ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్‌బాబుకు 65వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరణానంతరం అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అశోకచక్రతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసాద్‌బాబు తండ్రి కె.వెంకటరమణకు అందించారు. 2013 ఏప్రిల్ 16న ఆంధ్ర-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రసాద్‌బాబుతో పాటు 9 మంది మావోయిస్టులు మరణించారు.
బయోకాన్ ఎండీ కిరణ్ షాకు ఆథ్‌మర్ గోల్డ్ మెడల్
బయోకాన్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ కిరణ్ మజుందార్‌షా 2014 ఆథ్‌మర్ గోల్డ్‌మెడల్ పురస్కారానికి ఎంపిక య్యారు. అమెరికాకు చెందిన కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అత్యున్నత అవార్డును అందజేస్తుంది.
సి.ఎస్.ఎస్.ఎస్‌కు జాతీయ మత సామరస్య అవార్డు
ముంబైలోని ‘ సెంటర్ ఫర్‌స్టడీ ఆఫ్ సొసైటీఅండ్ సెక్యులరిజమ్’ (సి.ఎస్.ఎస్.ఎస్) సంస్థల కేటగిరీలో 2013 సంవత్సరానికి జాతీయ మత సామరస్యఅవార్డుకు ఎంపికైంది. వ్యక్తులకేటగిరీలో ఢిల్లీకి చెందిన మొహిందర్ సింగ్, కేరళకు చెందిన ఎన్.రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. డాక్టర్ మొహిందర్‌సింగ్ మైనారిటీ విద్యాసంస్థల జాతీయకమిషన్ సభ్యులు. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రముఖ విద్యావేత్త, గాంధేయవాది. కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖకు చెందిన మతసామరస్య జాతీయ ఫౌండేషన్ 1996లో జాతీయ మతసామరస్య అవార్డులనుఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతోపాటు వ్యక్తులకైతే రూ. 5లక్షలు, సంస్థలకైతే రూ. 10 లక్షలు బహుకరిస్తారు. సి.ఎస్.ఎస్.ఎస్.ను ముంబేలో 1996లో ఏర్పాటు చేశారు.
క్రీడలు
2014 ఆస్ట్రేలియన్ ఓపెన్
పురుషుల సింగిల్స్:స్టానిస్లాస్ వావ్రింకా(స్విట్జర్లాండ్) రన్న రప్: రఫెల్ నాదల్, ఇది వావ్రింకాకు తొలి గ్రాండ్‌స్లామ్
మహిళల సింగిల్స్: నాలీ (చైనా), రన్నరప్: డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా), నాలికి ఇది రెండో గ్రాండ్‌స్లామ్
పురుషుల డబుల్స్: లుకాష్కుబోట్ (పోలెండ్), రొబర్డ్ లిండ్ స్టెడ్ (స్వీడన్)
మహిళల డబుల్స్: సారా ఎర్రాని,రాబెర్టా విన్నీ (ఇటలీ)
మిక్స్డ్ డబుల్స్: క్రిస్టినా మ్లడోవిక్, డానియల్ నెస్టర్
రన్నరప్: సానియామీర్జా,హోరియా టెకావ్
సైనాకు ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్టోర్నీ
లక్నోలో జరిగిన సయ్యద్మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత నంబర్ వన్ షట్లర్ సైనానె హ్వాల్ గెలుచుకుంది. 2014, జనవరి 26న తలపడిన తుది పోరులో సహచర హైదరాబాద్ క్రీడాకారిణి పీవీ సింధుపై ఆమె గెలిచి ైటె టిల్ సొంతం చేసుకుంది. కాగా పురుషుల విభాగంలో చైనా ఆటగాడు జు సంగ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కి డాంబి శ్రీకాంత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు.
వార్తల్లో వ్యక్తులు
అక్కినేని అస్తమయం
ప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) హైదరాబాద్‌లో జనవరి 22న మరణించారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీరంగ జీవితంలో 256 చిత్రాల్లో నటించారు. అక్కినేని 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. కళారంగంలో చేసిన కృషికిగాను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లతో కేంద్ర ప్రభుత్వం అక్కినేనిని సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1989లో రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. 1991లో దాదాసాహెబ్ఫాల్కే పురస్కారం ఆయనకు దక్కింది. 1996లో ఎన్టీరామారావు పేరిట ఏర్పాటు చేసిన అవార్డు మొదట నాగేశ్వరరావుకే ప్రదానం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం నుంచి అన్నా, కలైమామిణి పురస్కారాలు అందుకున్నారు. తన పేరుమీద 2005లో జాతీయ స్థాయి అవార్డును ఏర్పాటు చేశారు.