కస్టమ్స్ ఏజెంట్ రాత పరీక్షకు 22 మంది హాజరు
విజయవాడ బ్యూరో: విజయవాడ ఏపీ కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ రాత పరీక్షకు 22 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి 25 మంది దరకాస్తు చేయగా ముగ్గురు అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కస్టమ్స్శాఖలో ఉద్యోగ విరమణ చేసిన అడిషనల్ కమిషనర్లు, సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో పాటు సీఏ చదివిన అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరయ్యారు. ఏడాది కోసారి మాత్రమే జరిగే ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే రోజు జరుగుతుంది. ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్ పరీక్ష నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాత పరీక్షలో పాసైన వారు ఫిజికల్ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉందనీ, అక్కడ కూడా పాసైతే కస్టమ్స్ లెసైన్సు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ లెసైన్సు ఉన్న వారు మాత్రమే పోర్టులు, ఎయిర్కార్గోలు, ఇన్లాండ్ కంటైనర్ డిపోల్లోకి ప్రవేశించి ఎగుమతులు, దిగుమతులను పర్యవేక్షించే అధికారం ఉంటుందన్నారు. ఈ రాత పరీక్షను కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ శంకరన్ రాజు, సూపరింటెండెంట్లు కేఎస్వీడీ రాజు, విజయపాల్, మస్తాన్, గుమ్మడి సీతారామయ్యలు పర్యవేక్షించారు.