ప్రభుత్వం పత్తిరైతును ఆదుకోవాలి: పొంగులేటి
హైదరాబాద్: పత్తి కొనుగోలు చేయకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు 17 లక్షల ఎకరాలు ఉందని, కాని పత్తి కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ప్రారంభించలేదని పొంగులేటి అన్నారు. కనీస మద్దతు ధర 4050 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.
దళారులు 3 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పత్తి క్వింటాలకు 7200 రూపాయలకు కొనుగోలు చేసిందనే విషయాన్ని పొంగులేటి మీడియా దృష్టికి తీసుకువచ్చారు. నేడు కనీస మద్దతు ధర కూడా గిట్టుబాటు కావడం లేదన్నారు. పత్తి రైతును ఆదుకోవడానికి సీసీఐ, ఇతర సంస్థల ద్వారా కొనుగోలు చేపట్టాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో హుదూద్ ప్రళయం విషాదానే మిగిల్సిందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో కలిపిన ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదికనందిస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.