ఇద్దరు చైన్ స్నాచర్లకు రిమాండ్
అంబర్‌పేట(హైదరాబాద్): మహిళల మెడల్లో నుంచి గొలుసులు లాక్కు పోతున్న ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి పంపారు. సోమవారం డీసీపీ డాక్టర్ డి.రవీందర్, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించిన వివరాలివీ.. పహాడీషరీఫ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జహంగీర్ అలియాస్ పర్వేజ్ బాబా(30) కొంత కాలంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం హబ్సిగూడలో తనిఖీలు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు జహంగీర్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
అతన్ని విచారించగా ఘరానా చైన్ స్నాచర్ అని తెలింది. అతని నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 28.25 తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అలాగే, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వి.విష్ణువర్ధన్ అనే స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.