ఎలుగు దాడి నుంచి ఇద్దరిని కాపాడి.. చనిపోయిన కుక్కపిల్ల
అదో చిన్న కుక్కపిల్ల. డాషండ్ జాతికి చెందినది. బరువు గట్టిగా చూస్తే రెండు కేజీలు కూడా ఉండదు. దాని పేరు బ్రాడ్లీ. విశ్వాసానికి మారుపేరు. అందుకే.. యజమానిని కాపాడేందుకు ఏకంగా 181 కేజీల బరువున్న నల్లటి ఎలుగుబంటితో పోరాడి.. వాళ్లను రక్షించి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయింది!! అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో గల ఓస్కాడా కౌంటీలో ఈ సంఘటన జరిగింది. బ్రాడ్లీ అక్కడుండి ఎలుగుబంటితో పోరాడి ఉండకపోతే మాత్రం అది తప్పకుండా తమవాళ్లను చంపేసి ఉండేదని బ్రాడ్లీ యజమాని జాన్ ఫోర్స్ చెప్పారు.
జాన్ ఫోర్స్ ఇంటికి గత వారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లు అక్కడకు సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లారు. తమతో పాటు బ్రాడ్లీని కూడా తీసుకెళ్లారు. తీరా అక్కడ ఉన్నట్టుండి ఓ పెద్ద నల్లటి ఎలుగుబంటి వాళ్ల ముందుకు వచ్చింది. దాంతో ఇక తమపని అయిపోయిందనే అనుకున్నారు. కానీ కుక్కపిల్ల మాత్రం ఒక్కసారిగా ఎలుగుబంటి మీదకు దూకి.. దాంతో అరివీర భయంకరంగా పోరాడింది. అలా ఓ గంట పోరాడిన తర్వాత అది ప్రాణాలు కోల్పోయింది. కానీ ఎట్టకేలకు ఎలుగుబంటి కూడా వెనుదిరిగింది.