లెక్సస్ బ్రాండ్ రాకకు మళ్లీ బ్రేక్
ముంబై : టయోటా కొత్త బ్రాండు లెక్సస్ ఆవిష్కరణకు భారత్‌లో మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. లెక్సస్, డాయ్ హాట్సూ బ్రాండులను భారత్‌లో ఇప్పట్లో ప్రవేశపెట్టకూడదని టయోటా నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతంలో డీజిల్ వెహికిల్స్‌పై నిషేధం నేపథ్యంలో టయోటా తాజా నిర్ణయం తీసుకుందని, ఈ బ్రాండ్ల రాకకు మరికొంత కాలం ఆలస్యం కావొచ్చని లోకల్ యూనిట్ వైస్ చైర్మన్ చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు క్లియర్ అయ్యేంత వరకు భారత్‌లో కొత్త పెట్టుబడులేమీ కూడా పెట్టకూడదని టయోటా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే గత ఐదేళ్లలో ఇప్పటికీ మూడుసార్లు భారత్‌లోకి ప్రవేశించబోయి ఆగిపోయిన లెక్సస్ బ్రాండ్, టయోటా తాజా నిర్ణయంతో మరోమారు ఈ బ్రాండ్ భారత్‌లో ప్రవేశానికి నోచుకోవడం లేదు.
లగ్జరీ లెక్సస్ బ్రాండ్‌ను 2017 మొదట్లో, ఫెస్టివల్ సీజన్లో డాయ్హాట్సూలను భారత రోడ్లపై పరుగులు పెట్టించాలని టయోటా నిర్ణయించింది. కానీ న్యూఢిల్లీలో పెద్ద డీజిల్ వాహనాలపై నిషేధం ఈ బ్రాండుల ప్రవేశానికి ఆటంకంగా మారిందని కంపెనీకి చెందిన ప్రతినిధులు చెప్పారు. ఫైనల్ కోర్టు ఆర్డర్లపై ఆటోమొబైల్ ఇండస్ట్రి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
డీజిల్ వాహనాల వల్ల వస్తున్న కాలుష్య ముప్పు సమస్యతో నేషనల్ రాజధాని ప్రాంతంలో పెద్ద డీజిల్ వాహన అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 10ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలకు డీ-రిజిస్ట్రర్ చేయాలని ఎన్జీటీ గత నెలే ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే ప్యాసెంజర్ వాహన అమ్మకాల్లో ఎన్సీఆర్ కనీసం 12శాతం నమోదుచేస్తోంది. ఈ ప్రాంతంలో డీజిల్ వెహికిల్స్ మొత్తం అమ్మకాలు 25-30 శాతంగా రికార్డు అవుతున్నాయి. డీజిల్ వాహన విక్రయంలో టాప్ సెల్లింగ్ మోడల్స్ గా ఉంటున్న టయోటా.. ఈ ఆదేశాలతో ఎక్కువగా నష్టపోతోంది.