కుక్కమీద రాళ్లేస్తే మమ్మల్ని నిందిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి వీకె సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరియాణాలో దళిత కుటుంబంపై దాడి ఉదంతంపై ఆయన గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో కుక్క ను రాళ్లతో కొడితే దానికి ప్రభుత్వాన్నినిందించాల్సిన అవసరం లేదంటూ వివాదాన్ని రాజేశారు. దళిత చిన్నారుల సజీవ దహనంపై దేశవ్యాప్తంగా చెలరేగిన విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ అంటూ వీకె సింగ్ కొట్టి పారేశారు. ఆ గొడవ కాస్తా వేరే రూపం తీసుకుందని వ్యాఖ్యానించారు ఈ విషయంలో స్థానిక అధికారుల వైఫల్యం చెందితే అప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. దీంతో పాటు కుక్క మీద రాళ్లేస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.. కానీ ఇది జరగలేదన్నారు. స్థానిక గొడవలతో ప్రభుత్వానికి సంబంధం లేదని తెగేసి చెప్పారు. ప్రతి విషయానికి కేంద్రాన్ని నిందించడం తగదన్నారు.
ఓవైపు దేశంలో జరుగుతున్న మతఘర్షణలు చిన్నారుల సజీవ దహనం ఉదంతాలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంటే, బీజేపీ నేతల మాటలు మంటలు రాజేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. వీకే సింగ్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హరియాణా ప్రభుత్వం ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతార్ , పిల్లలను కోల్పోయి,ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు.