నాలుగు పాదాల అధర్మం
తమిళనాడులోని కీల్వెన్మణి, ఆంధ్రప్రదేశ్‌లోని చుండూరు, పదిరికుప్పం వగైరా గ్రామ సీమల్లో దళితులు, దళిత కుటుంబాలు ఎదుర్కొన్న హత్యలు, వివక్ష, దుండగాల మొదలు, నేటి ‘ఉనా’, దేశంలోని తదితర ప్రాంతాలలోని దళితులపై సాగుతున్న వేధింపులు, దురా గతాల వరకూ సాగుతున్న ‘నరమేధ’ పాపం పాలకులు ఎన్ని అశ్వమేధయాగాలు చేసినా తొలగేది కాదు, కాదు. ఎందుకంటే, ఏ కఠిన చర్యను గౌరవ న్యాయస్థానం ప్రతిపాదించినా దాన్ని ధనికవర్గ పాలనా వ్యవస్థ పరిపూర్తిగా అమలు జరుపుతుందన్న పూచీ లేదు.
‘స్వాతంత్య్రం వచ్చి డెబ్బైయ్యేళ్లు గడిచిపోయినా దళితులపై కొనసాగు తున్న దాడులకు ముగింపు లేకపోతోంది. ఈ చర్యలు సాంఘిక దుర్మార్గం. ఈ దాడులు బీజేపీ పాలనలో జరిగినా, కాంగ్రెస్ హయాంలో జరిగినా మనం అందరం కలసికట్టుగా ఎదుర్కొనవలసిందే.’
అబ్బో! ఈ నీతివాక్యాలు వల్లించడానికి సాహసించిన వారెవరు? ఆ నంగనాచితనం ఎవరికి సాధ్యం? ఏ మిషపైన, ఎవరివల్ల గుజరాత్ సహా, దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో దళిత బహుజనుల మీద దాడులూ, హత్యాకాండా పెచ్చరిల్లిపోవడానికి కారణం ఏమిటి? షెడ్యూల్డ్ కులాలు, తరగతుల మీద అత్యాచారాల నిరోధక చట్టం వచ్చి ఏళ్లూపూళ్లూ గడిచింది. అయినా వారి దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం దగ్గర నుంచి ప్రారంభ మైన అగ్రవర్ణాల అహంకార ప్రదర్శన నేడు అనుమానాస్పద గోవధ పేరుతో దళితుల ఉనికికే ప్రాణ సంకటంగా మారింది. ఈ అంశం గురించే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (జూలై 20, లోక్‌సభ) చేసిన ప్రకటనలోని వాక్యాలనే పైన పేర్కొనడం జరిగింది.
దళితులపై జరుగుతున్న అత్యాచారా లకు స్పందిస్తూ ప్రసిద్ధ కవయిత్రి స్వరూపరాణి ‘యజ్ఞం’ శీర్షికతో రాసిన కవిత ఇక్కడ గుర్తుకు వస్తుంది. ‘యజ్ఞం జరుగుతూనే ఉంది/ అక్కడెవరో యూపస్తంభం మీద/ ఒక ప్రాణిని నిలబెట్టారు/ అది బిక్కుబిక్కు మంటూ ఉంది నాలాగే!/ భగవద్గీత చేత్తో పుచ్చుకుని/ మళ్లీ నన్ను ఊలెలపటికి తరు ముకొస్తుంది/..... దారి పొడువనా మనువులు, యాజ్ఞవల్క్యులు/ పరాశ రులు, ఆదిశంకరులు కాపుకాసి/ నా అడుగులను నా మాటలను తూనిక రాళ్లతో కొలుస్తున్నారు/...నా పవిత్రగ్రంథం/ రాజ్యాంగానికి ఆ కన్నాలే మిటి? ఇలా పాత ప్రశ్నలకు కొత్త జవాబులు వెతకాలి/ యజ్ఞం మాత్రం జరు గుతూనే ఉంది!’
దళితుల మీద పెరిగిన నేరాలు
గుజరాత్, యూపీ, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాలలో దళితులపై సాగుతున్న అత్యాచారాలు కాంగ్రెస్ హయాంలో కన్నా, బీజేపీ హయాంలోనే మరింత ఎక్కువయ్యాయని షెడ్యూల్డ్ కులాల జాతీయ స్థాయి కమిషన్ 2013, 2014, 2015 సంవత్సరాలలో జరిగిన ఘటనలకు సంబం దించిన తాజా నివేదిక వెల్లడిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావించే ‘అభివృద్ధి’ మార్గంలో ఉన్న గుజరాత్లో దళితులపై తలపెట్టిన నేరాలలో ఏ స్థాయిలో అభివృద్ధిని నమోదు చేశాయో ఈ నివేదిక తేటతెల్లం చేస్తున్నది. దళితులపై నేరాలు 2014లో 1130 నమోదు కాగా, 2015లో అవి 6655కు పెరిగాయి. 2001-02 కాలంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఊచకోతకు గురైన దాదాపు 2000 మంది మైనారిటీలను మినహాయించి చెప్పిన వివరాలు ఇవి.
2014లో బీజేపీ-ఎన్డీఏ బ్రూట్ మెజారిటీతో అధికారం చేపట్టిన తరువాత ‘గోవు’ రాజకీయం స్వైరవిహారం చేస్తోంది. దళిత, మైనారిటీ వర్గాలను పావులుగా చేసుకుని ఎన్నికలలో విజ యావకాశాలు మెరుగుపరుచుకుంటున్న గెలుపు రాజకీయవేత్తలు తరువాత రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని న్యాయస్థానాలు శిక్షించాలే తప్ప, ధనికవర్గ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న పాలకవర్గాలు పట్టించుకోవు. ఇందుకు కారణం స్వార్థ రాజకీయంతోపాటు, మతం కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నది.
ఏ సమాజానికైనా మతం మత్తుమందేనన్న నిర్వచనంలో ఎంతో అర్థం ఉంది. అందుకే ‘నా శరీరాన్ని ఎవరో పోట్లు పొడిచి పురుష సూక్తంలో దొర్లించార’న్న దళితకవి ఆవేదన ఇవాళ్టిది కాదు. 3,500 ఏళ్ల నాటిది. మనువును భారతీయ కుల, వర్ణ వ్యవస్థ వినాశపురుషునిగా కాకుండా, వికాసపురుషునిగా; విరాట్ పురుషునిగా భావించిన ఆర్యులు అనాదిగా స్థిరపడిన పెక్కు జాతులను అనార్యులుగా, అనాగరికులుగా చిత్రించి వేదంలో పురుషసూక్తం చొప్పించారు. భిన్న తెగలతో, జాతులతో కూడిన భారతీయ సమాజంలో విభజించి పాలించే వ్యవస్థకు పురుడుపోసిందే పురుషసూక్తం. దాని ప్రకారం విరాట్ పురుషుని నాలుగు ముఖాలు తొడి గారు.
ఆ పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణ్యం, మతగురువు పుట్టుకొస్తే; చేతుల నుంచి రాజు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడయిన శ్రమజీవి వచ్చారట. అయితే ఇది తదనంతర కాలంలో వేదంలో చేరిందని కొందరి భావన. ఒక్క అద్వైత వేదాంతంలో తప్ప, వేదవేదాంగాలలో, రామా యణ మహాభారతాలలో, ఉపనిషత్తులలో గుర్తు తెలియని, రూపం లేని ఈ విరాట్ పురుషుడికి స్థానం దక్కింది. ఈ దారుణ భావననే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పలు కోణాల నుంచి తూర్పార పట్టారు. ఇప్పుడు ఆయన చిత్రపటం మాటునే కుల, వర్గ వ్యవస్థలను యథాతథంగా కాపాడుకోవాలని పాలకవర్గాలు యత్నిస్తున్నాయి. అలాంటి చిట్కాతోనే సెక్యులరిజం, సోష లిజం వ్యవస్థాపనా లక్ష్యాన్ని చెరిపివేసే యత్నంలో కూడా ఆ వర్గాలు ఉన్నాయి. గాంధీజీ హత్యకు కారకులు ఎవరో వారికి ఇప్పటికీ కొమ్ముకాసే యత్నంలో ఉన్నారు. ఏనాడూ భగత్‌సింగ్‌ను స్మరించనివారు ఇప్పుడు ఆయన బొమ్మను ఉపయోగించుకోవడానికి వెనుకాడటం లేదు.
ఆఖరికి రుజువులు లేని చోట కల్పనా చాతుర్యంతో లేని ఘటనలకు (ఆహార అల వాట్లపై దాడి పేరిట) మసిపూసి మారేడు కాయ అన్నట్లు చిత్రిస్తూ దళితు లను, మైనారిటీలను వేధిస్తున్న ఉదాహరణలు చూస్తున్నాం. వర్ణవివక్ష, వర్గ వివక్ష ఎక్కడో కాదు మన కళ్లముందే తాండవిస్తున్నాయి. చివరికి ప్రపంచ సర్వమత సమ్మేళనంలో (చికాగో-అమెరికా) ప్రబోధించిన లౌకిక వ్యవస్థ నిర్మాణానికి విరుద్ధమైన సంస్కృతికి, ఎన్నికలలో ఓట్ల కోసం, అధికారం కోసం పాలక పక్షాలు అలవాటుపడి సమాజ శాంతిని, శ్రేయస్సును ధ్వంసం చేస్తున్నాయి.
సర్వమత శాంతి సౌమనస్యాలకు పునాదులు వేసిన బౌద్ధం వర్ధిల్లిన దేశంలో రామానుజులు, కబీర్, మధ్వ, గురునానక్, రాజా రామ్మోహన్రాయ్, గాంధీ, వివేకానంద, ఆధునిక ప్రవక్తలుగా తిరుగాడిన దేశంలో - ఎన్నెన్నో సంస్కరణోద్యమాలు ప్రభావిల్లిన దేశంలో వర్ణ, మత, రాజకీయ కక్షలకు, వివక్షలకు చోటు ఉండటానికి వీల్లేదు. ‘గోరక్షణ’ గురించి ఎంతో వేదన చెందుతున్నట్లు నటిస్తున్న రాజకీయులూ, వారి అనుబంధ మత సంస్థలూ, పాలక శక్తులూ గోవుల రక్షణకు, పశుగణాలకు ఇంత మేత, ఇంత గడ్డీ సర్వకాల సర్వావస్థలలోనూ అందించడం ద్వారా, బక్కచిక్కి పోషణ లేక అవసానదశలో ‘కబేళా’లకు చేరే దుస్థితిని తప్పించగల్గాలిగానీ రాజకీయాల కోసం ఏ ‘గడ్డి’ కరవడానికైనా సిద్ధపడటం తగదు.
మాంసభక్ష కులు కాకపోయినా, మానవ భక్షకులుగా ఏ రాజకీయ సంస్థా, నాయకులూ మారకూడదు. గుజరాత్లో ‘ఉనా’ దుర్ఘటన తరువాత జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ ఛైర్మన్ పి.ఎల్. పునియా ‘గోరక్షణ’ పేరిట అవత రించిన కమిటీల అరాచక చర్యలను ప్రస్తావించి ‘వీళ్లు గోరక్షకులు కారు, దళిత భక్షకులు, గూండాలు, వీరిని నిషేధించాలి’ అని కోరారు. లేదూ, బీజేపీ పాలనలో, ఎగుమతుల వ్యాపారంలో లాభసాటి బేరానికి కీలకపాత్ర వహి స్తున్న పాదరక్షల ఉత్పత్తిని నిషేధించగల్గడం సాధ్యమా? పాదరక్షలను విడిచే సుకు తిరిగే పాలక ‘మునుల’ కోసం మనం ఎదురుతెన్నులు చూద్దాం.
ఈ పాపం తొలగేది కాదు!
తమిళనాడులోని కీల్వెన్మణి, ఆంధ్రప్రదేశ్‌లోని చుండూరు, పదిరికుప్పం వగైరా గ్రామసీమల్లో దళితులు, దళిత కుటుంబాలు ఎదుర్కొన్న హత్యలు, వివక్ష, దుండగాల మొదలు, నేటి ‘ఉనా’(గుజరాత్), దేశంలోని తదితర ప్రాంతాలలోని దళితులపై సాగుతున్న వేధింపులు, దురాగతాల వరకూ సాగుతున్న ‘నరమేధ’ పాపం పాలకులు ఎన్నిరకాల అశ్వమేధయాగాలు చేసినా తొలగేది కాదు, కాదు. ఎందుకంటే, ఏ కఠిన చర్యను గౌరవ న్యాయ స్థానం ప్రతిపాదించినా దాన్ని ధనికవర్గ పాలనా వ్యవస్థ పరిపూర్తిగా అమలు జరుపుతుందన్న పూచీ లేదు. ఎందుకని? తమ నిర్ణయాలలో న్యాయ వ్యవస్థ జోక్యాన్ని ప్రభుత్వం సహించదు కాబట్టి. ఆ మేరకు న్యాయ వ్యవస్థ చేతలు కట్టుబడి పోతుంటాయి. కాగా ప్రభుత్వ జోక్యాన్ని సహించలేని న్యాయ వ్యవస్థ శాసనవేదికలు తమ పాలనా పరిధులను కాపాడుకోవడానికి ప్రయ త్నిస్తున్నాయి.
ఫలితం, దేశంలో సామాన్య ప్రజాబాహుళ్య సమస్యలు అపరి ష్కృతంగా ఉండిపోతున్నాయి. ఆ చట్రాన్ని మూలమట్టుగా మార్చగల చైత న్యవంతమైన పౌర సమాజం ఉధృత రూపం దాల్చడం వల్లనే దేశంలో నూతన వ్యవస్థా నిర్మాణం సాధ్యం. దళితుల సంపూర్ణ విమోచనం అందు లోనే సాధ్యమని గుర్తించాలి. అదే వర్గ, వర్ణ వివక్ష లేని సమాన వ్యవస్థ. దేశానికి భద్రతా రాహిత్యం ఎక్కడో లేదు, మన చేతల్లోనే, మన చేతుల్లోనే ఉందని గమనించాలి.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in