మట్టిలో ‘మణి’క్యం
కడు పేద కుటుంబంలో పుట్టింది. చదువును మధ్యలోనే ఆపేసినా యాంకర్‌గా ఎదిగింది. స్టేజి షోలు ఇస్తూ సొంతంగా ఓ ఆర్కెస్ట్రాను ఆర్గనైజ్ చేస్తోంది. ఇలా పదిమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు యాంకర్ మణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
వీరవాసరం: ‘మా స్వగ్రామం తణుకు. భాష్యం స్కూల్ పక్కన చిన్న ఇంట్లో పుట్టాను. అమ్మ ఇండ్ల తులసి, నాన్న సత్యనారాయణ, అక్క శివ. చిన్నచిన్న పనులు చేస్తూ అమ్మానాన్న కుటుంబ పోషణ చేసేవారు. నేను మూడో తరగతి చదువుకునే సమయంలో అమ్మానాన్నల మధ్య కొద్దిపాటి వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అమ్మ వేరు పడింది. అప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరుగుతూ డ్యాన్స్‌పై ఇష్టం ఏర్పరచుకున్నాను. నా 12వ ఏటనే స్టేజీలపై స్టెప్పులేశాను. డ్యాన్స్ ట్రూపులతోనూ, సినీ సంగీత విభావరిలోనూ యాంకర్‌గా చేయడం ప్రారంభించాను.
టీవీల్లో వస్తున్న పాటలను చూసి..
ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండానే టీవీల్లో వస్తున్న పాటలను చూసి ఇంట్లోనే రిహార్సల్ చేసుకునేదాన్ని. ఏ స్టెప్పు చూసినా వెంటనే స్టేజిపై చేయడం నాకు ఛాలెంజింగ్‌గా ఉండేది. మావయ్య మూర్తి, అత్తయ్య ఆదిలక్ష్మి ప్రోత్సాహంతో డ్యాన్సర్‌తో పాటు యాంకర్‌గాను ప్రావీణ్యం సంపాదించాను. పదేళ్ల క్రితం భీమవరానికి చెందిన మధును వివాహం చేసుకున్నాను.
సరిగమ ఆర్కెస్ట్రా ప్రారంభించాం
సరిగమ ఆర్కెస్ట్రాను ప్రారంభించి డ్యాన్సర్గాను, యాంకర్‌గాను, డ్యాన్స్ బేబి డ్యాన్స్‌ల ప్రదర్శనలు ప్రారంభించాం. మా ఆయన మధు సహకారంతో భీమవరం, తణుకు, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్‌లతో పాటు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. మా సరిగమ ఆర్కెస్ట్రాలోకి జబర్దస్త్ టీం ఆది, భాస్కర్, సుధాకర్, రాజు, నరేష్ తదితరులతో పాటు సినీ సింగర్లు సునీత, గీతామాధురి, మాళవిక, ఝాన్సీలతోను ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. టీవీల్లో జరిగే సూపర్ డూప్స్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను. నాతో పాటు మరో 10 మందికి అవకాశాలు చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. డ్యాన్సర్‌గా, యాంకర్‌గా రాణిస్తుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.