బీజేపీ నేత ఇంట్లో 45 కోట్ల పాత నోట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు బీజేపీ నేత దండపాణి ఇంటి నుంచి రూ.45 కోట్ల పాత కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దండపాణి రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇతని సోదరులు పోలీస్ శాఖలో పనిచేస్తూ ‘ఏవీ రామలింగం అండ్ కో’ అనే పేరున సినీరంగంలోని వారికి దుస్తులు సరఫరా చేస్తుంటారు.
50% కమీషన్‌పై పాతనోట్లను మార్చే లావాదేవీలు జరుపుతున్నట్లు తెలుసుకున్న కోడంబాక్కం పోలీసులు గురువారం దండపాణి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. పది పెట్టెల్లో దాచి ఉంచిన రూ.45 కోట్ల విలువైన రూ.500, రూ.1,000ల చెల్లని పాతనోట్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి. దండపాణితో పాటు జ్యువెలరీ షాపును నడిపే ఒక పారిశ్రామికవేత్తనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ ఎంపీ ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు
దావణగెరె: కర్ణాటకలో మాజీ కేంద్రమంత్రి, దావణగెరె బీజేపీ ఎంపీ జీఎం సిద్దేశ్వర్ నివాసం, కార్యాలయాలపై గురువారం ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు.