ఎవరీ సత్యం ?
విజయనగరం క్రైం:దేశం పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక గందరగోళానికి తెరతీసింది. జిల్లా నాయకత్వానికే పెద్దగా తెలియని వ్యక్తి పేరు ప్రకటించడంతో ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టేసి, పెద్దగా ఎవరికీ పరిచయంలేని వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జిల్లా నుంచి అధిష్టానం ఖరారు చేసిందని, ఇది అన్యాయమని ఆ పార్టీ నేతలు మథనపడుతున్నారు. లాబీయింగ్కే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏ డాది కాలంగా ఎమ్మెల్సీ పదవికి కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ తెంటులక్ష్మునాయుడు, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కె.త్రిమూర్తులరాజు, సాలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్.పి భంజదేవ్లు ఎదురుచూస్తున్నారు. వీరంతా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గవర్నర్, స్థానిక సంస్థల కోటాలో వస్తుందని ఆశపడ్డారు. బుధవారం చంద్రబాబు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యం పేరును ప్రకటించడంతో వారంతా ఖంగుతిన్నారు.
జోరుగా చర్చ: జిల్లా నుంచి స్థానికసంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ సత్యం అనే పేరును ప్రకటించడం తో జిల్లాలో టీడీపీ నేతలు గందరగోళానికి గురయ్యారు. ఈ పేరు గల వ్యక్తి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ఎవరీ సత్యమంటూ ఆరా తీశారు. భో గాపురం మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ పేరును సత్యంగా ప్రకటించిరా..? లేదా మంత్రి నారాయణకు సన్నిహితుడైన సత్యం అనే వ్య క్తి విశాఖపట్నంలో ఉంటున్నారని, ఆయన పేరును ఇలా ప్రకటించారా అని కొందరు తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అనుంగ శిష్యుడు పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు పేరును అలా ప్రకటించి ఉంటారని మరి కొందరు చెబుతున్నారు.