darmapuri srinivas
-
పోరాడు, భయపడకు అని నేర్పింది నాన్నే: ఎంపీ అర్వింద్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు.కాగా, తన తండ్రి మరణంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా అర్వింద్ తన తండ్రిని తలుచుకుంటూ బావోద్వేగానికి లోనయ్యారు.ఈ క్రమంలో అర్వింద్ సోషల్ మీడియా వేదికగా.. ‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
డీఎస్‌తో ఈటల భేటీ, రెండు గంటలపాటు చర్చలు!
సాక్షి, నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలు, మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటల తన రాజకీయ వ్యూహరచనలో నిమగ్నం అయ్యారు. తాజాగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌తో బుధవారం భేటీ అయ్యారు. డీఎస్ నివాసంలో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్ టీఆర్ఎస్ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఈటల మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా భేటీ కావాలని ఈటల యోచిస్తున్నట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల ఇటీవల పలు సందర్భాల్లో పేర్కొన్నారు. చదవండి: ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం -
అమిత్‌షాను కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?
సాక్షి, నిజామాబాద్: బీజేపీలో చేరికపై స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతానని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోకి చేరమని ఆహ్వానాలు వస్తున్నాయన్నారు. తన కొడుకు అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా గెలుపొందినందుకు ఓ తండ్రిగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఎవరి రాజకీయాలు వారికే ఉన్నాయన్నారు. ‘అమిత్‌షాను పార్లమెంట్లో కలిశాను. దేశ హోంమంత్రితో చాలా విషయాలు చర్చించాను. హోంమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీలో చేరతానని అనుకుంటే ఎలా? ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను టీఆర్ఎస్లోకి తీసుకురావటానికి చాలా కష్టపడ్డారు. ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది.. రాజకీయంగా ఎంతో గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టడమే ఆశ్చర్యకరమైన చర్య. ప్రత్యేక పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింద’ని డీఎస్ వెల్లడించారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళతారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని పేర్కొన్నారు. తనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత, నిజామాబాద్ నేతలు రాసిన లేఖపై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేస్తే చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే తనపై ఆరోపణల లేఖను ఉపసంహరణ చేసుకోవాలన్నారు. ఏడాదిన్నర అవుతున్నా టీఆర్ఎస్ అధిష్టానం నుంచి స్పందన కరువైందని.. ప్రజలు అన్ని విషయాలను, అందరినీ గమనిస్తున్నారని తెలిపారు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా వారికి తెలుసన్నారు. ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో రాజకీయమంతా ఆసక్తికరంగా ఉందన్నారు. బీజేపీ నేతలు తెలంగాణను టార్గెట్ చేశారని.. ఎవరు విజయవంతం అవుతారనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మంత్రిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ నాశనం అవుతోందని.. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేదని విమర్శించారు. అండర్ గ్రౌండ్ డ్రేనేజీ వ్వవస్థను తన హయంలోనే మంజూరు చేయించానని గుర్తుచేశారు. ఒక ఎంపీగా తన వంతు అభివృద్ధి చేస్తానని డీఎస్ పేర్కొన్నారు. -
సమన్వయంతో పనిచేసిన అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: భారీ వర్షం కారణంగా తలెత్తిన సమస్యలను సమన్వయంతో అధిగమించిన అధికారులను ప్రభుత్వ సలహాదారు, ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ప్రశంసిం చారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందించదగ్గ విషయమన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలతో నగరంలో సమారు 3700 గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చి వేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నగర వాసులు మంచినీటిని వేడి చేసి చల్లార్చి త్రాగాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ బొంతురామ్మోహన్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.