సరుకులు చేరవేస్తుంది నాశనమైపోతుంది!
మిషన్ ఇంపాజిబుల్ –2 చూశారా మీరు? ఈ సినిమా మొదట్లో ఓ సీన్ ఉంటుంది. హీరో ఓ కళ్లజోడు పెట్టుకోగానే తాను చేయాల్సిన పనికి సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ తరువాత కళ్లజోడు తీసి పారేసిన వెంటనే అది నాశనమైపోతుంది. ఇప్పుడు పక్క ఫొటోలో ఉన్నదాన్ని చూడండి. పైన ఉన్న ‘డాక్టర్ గుర్తు’ గురించి తరువాత చెప్పుకుందాం. ముందుగా ఇదేమిటో తెలుసుకుందాం. మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మాదిరిగానే ఇది కూడా తన పని అయిపోగానే నాశనమైపోయే డ్రోన్.
అమెరికా రక్షణ పరిశోధన సంస్థ (డార్పా) తరఫున అదర్ల్యాబ్స్ అనే సంస్థ కార్డ్‌బోర్డుతో తయారు చేసింది. ఊహూ... ఇది కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు కాదు. కీలకమైన టెక్నాలజీలు, ఎలక్టాన్రిక్ పరికరాలు శత్రువుల చేతుల్లో పడి వారికి ఉపయోగపడేలా మారకూడదన్న లక్ష్యంతో డార్పా రెండేళ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రోన్ ఇది. ప్రస్తుతానికి దీన్ని మారుమూల ప్రాంతాల్లోకి మందులు సరఫరా చేసేందుకు ఉపయోగించాలన్నది అంచనా.
అందుకే దీని మీద డాక్టర్ గుర్తు ఉంది. విమానాల నుంచి ఒకసారికి కొన్ని వందల డ్రోన్లు ప్రయోగించవచ్చు. ఇంజిన్లు, ఇంధనం వంటివి ఏవీ లేకపోయినా ఇవి దాదాపు కిలో బరువున్న వస్తువులను మోసుకుని 88 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. పక్షిలా గాలివాటానికి అనుగుణంగా రెక్కల స్థానాన్ని మార్చుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అదర్ల్యాబ్స్ ప్రతినిధి సింప్సన్ అంటున్నారు. ఒకసారి లక్ష్యం చేరిన తరువాత ఇది కొన్ని రోజుల వ్యవధిలో తనంతట తానే నాశనమైపోతుంది. తాము ఇప్పటికే ఈ కార్డ్బోర్డ్ డ్రోన్లను విజయవంతంగా పరీక్షించి చూశామని సింప్సన్ తెలిపారు. పేదదేశాల్లో అరకొర రవాణా సౌకర్యాలు ఉన్న మారుమూల ప్రాంతాలకు మందులు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం వంటివాటిని సరఫరా చేసేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని అంచనా.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్