Dasarathi rangacarya
-
తెలంగాణ జీవధాతువు
పొడి మట్టితో మట్టిపాత్ర తయారుచేయడం లాంటిదే రచన కూడా! ఆ ప్రాంతపు మట్టిని అక్కడి నీటితోనే కలిపి అద్భుతంగా కుండ తయారుచేస్తారు పనితనం గలవారు. అలాంటి పనితనం గల నవలారచయిత దాశరథి రంగాచార్య. ఇక్కడి మట్టితో ఆయన సృష్టించిన మొదటి సాహిత్య భాండం ‘చిల్లర దేవుళ్లు’. ఆయన నవలలన్నింటిలో తెలంగాణ మట్టి వాసన ఉంటుంది. సామాన్య జనుల ఉఛ్వాస నిశ్వాసాలుంటాయి. జీవన గతులూ శ్రుతులూ ఉంటాయి. కల్పనలే కాని, నిజాలుంటాయి. నిజాలే కానీ, కొంత అనుభవం రంగరించి ఉంటాయి. తెలంగాణ పోరాటం కేంద్ర బిందువుగా ఎదిగి, వ్యాపించి, తృష్ణతో, అభిలాషతో చుట్టూ సాహిత్య వ్యాసాన్ని గీసుకున్న రచయిత ఆయన. ఈ గుండ్రటి వ్యాసం విశాల విశ్వానికి సంకేతం. చెప్పింది ఒక ప్రాంతపు చరిత్రే అయినా, అందులో విశ్వమానవ జన సంఘర్షణలూ, సామాజిక జీవన స్థితిగతులూ చోటు చేసుకున్నాయి. రాసింది తెలంగాణ గురించే అయినా, ఫ్యూడల్ వ్యవస్థ ఎలా ఉంటుందో, అంతకన్నా నికృష్టమైన జాగిర్దారీ వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఎంత దిగజారిపోయామో సామాజికంగా తెలియజేశారు తప్ప, ఆయన తన నవలల్లో ఏ ఒక్క సిద్ధాంతాన్నో చొప్పించడానికి ప్రయత్నించలేదు. అయితే అన్నింట్లో అభ్యుదయకరమైన అంశాలు తప్పకుండా ఉన్నాయి. ఆయన వామపక్షవాదని, ప్రజాపక్షపాతని, ఆశావాది అని స్పష్టంగా చెబుతాయి. రచన ఉద్యమానికి ఊపునిస్తుంది తప్ప, రచనే ఉద్యమాన్ని సృష్టించదు. ఏ రచనైనా ఉన్నఫళాన సమాజాన్ని మార్చేసిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. అక్టోబర్ విప్లవానికి లెనిన్ కారకుడయ్యాడు కాని, గోర్కీ కాలేడు. అందువల్ల రంగాచార్య విప్లవోన్ముఖుడై నవలలు రాయలేదు. అంతర్ముఖుడై అంతరంగ మథనాన్ని వినిపించారు. అభ్యుదయ కాముకుడై నిజమైన అనుభవాల్ని నిజాయితీగా అక్షరబద్ధం చేశారు. ‘చిల్లర దేవుళ్ల’కు ముందే తెలంగాణ ప్రజల భాషలో వట్టికోట ఆళ్వారుస్వామి నవలలొచ్చాయి. వెల్దుర్తి మాణిక్యరావు, సురమౌళి, గూడూరు సీతారాం, భాగి నారాయణమూర్తి మొదలైన రచయితల కథలొచ్చాయి. అయితే తెలంగాణ మాండలికంలో రాయాలన్న ప్రత్యేకమైన ఉద్దేశంలో ఆళ్వారుస్వామి నవలలు రాయలేదు. ఆయన సహజంగా మాట్లాడే భాషనే రచనకు వాడుకున్నారు. కాని, ‘చిల్లర దేవుళ్లు’ అలా వచ్చింది కాదు. తెలంగాణకు పరిమితమై కొన్ని ప్రత్యేకమైన సామాజిక స్థితిగతుల్ని తేటతెల్లం చేయడానికి, క్రూరమైన మత ప్రవర్తనను బట్టబయలు చేయడానికి రచయిత చేసిన ఒక తపస్సు. ఈ నవల తెలంగాణవారికి మాత్రమే కాక, తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి రాసింది కనుక, రచన వ్యవహారిక భాషలో ఉండగా పాత్రల సంభాషణ మాత్రం సొంపైన తెలంగాణ మాండలికంలో సాగుతుంది. తెలంగాణ ప్రజలు, వారి భాష, వారి యాసలో మాట్లాడేందుకు జంకుతున్న తరుణంలో ఆ భాషలోనే నవల రాయడానికి పూనుకోవడం గొప్ప సాహసం. అయితే కాలక్రమేణా తెలంగాణ ప్రాంతంలో మారుతూ వస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, భాష... వీరు ఇతర నవలల్లో నమోదు చేస్తూ వచ్చారు. ‘మోదుగు పూలు’, ‘జనపదం’, ‘మాయ జలతారు’ వంటి పీరియాడిక్ నవలలు ఇందుకోసం పరిశీలించవచ్చు. దాశరథి కృష్ణమాచార్య వీరి సోదరులు. సహజంగా ఆవేశపరుడు గనుక, ఆయన జీవితం ఆయనను కవిగా నిలబెట్టింది. దాశరథి రంగాచార్య జీవితం వేరు. ఆవేశపరుడైనా, నిదానం ఎక్కువ. జీవితంలోనూ, రచనలోనూ ‘హి ఈజ్ మోర్ ప్రాక్టికల్’. పసి ప్రాయంలోనే కుటుంబ భారాన్ని మోయడం, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా కుగ్రామాల్లో జన జీవితాన్ని అధ్యయనం చేయడం మొదలైనవాటితో ఆయనకు జీవితంలో సునిశిత పరిశీలన అబ్బింది. అందువల్ల ఈయనకు కవిత్వం పనికిరాలేదు. పీడిత తెలంగాణ జన జీవిత పరిధి పెద్దది. అందులోని కరకు నిజాల్ని వెల్లడించడానికి కవిత్వం కన్నా వచనమే సరైందని తేలింది. క్యాపిటలిస్టు సమాజంలో యాంత్రిక యుగంలో వచనానికి ప్రాధాన్యత ఉంటుందని గ్రహించిన ఆయన, నవలా ప్రక్రియను ఎన్నుకున్నారు. ఈ యుగం కవిత్వాన్ని కూడా వచనం చేసిన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ అనంత జీవన గమనంలో స్థలం, కాలం, కారణం ఎంతో విలువైనవి. బాహ్యంగా ఈ మూడు వేరువేరుగా అనిపించినా ఈ మూడింటికీ అంతర్గతంగా విడదీయరాని సంబంధం ఉంది. ప్రతి స్థలం కొన్ని చారిత్రాత్మక సంఘటనలకు చోటిస్తుంది. అయితే అవి కాలానికీ, కారణానికీ సంబంధం లేకుండా జరగవు. ఏ పోరాటమైనా, ఏ ఉద్యమమైనా ఈ మూడింటి కలయికే (స్పేసియో టెంపరేనియస్ క్యాజువాలిటీ). ఇదొక త్రిభుజం. ఇది తెలంగాణకు అన్వయిస్తే - నిజాం ప్రభువు ఆగడాలు భరించలేక పోవడమే ఇక్కడి బలీయమైన కారణం. రైతులు తిరగబడి, కాలానికి ఎదురొడ్డి, సాయుధంగా పోరాడటమే ఈ గడ్డమీద జరిగిన గొప్ప చారిత్రాత్మక ఘటన. మరొక త్రిభుజం కూడా ఉంది. నిజాం ఒక కోణం, బ్రిటీష్ ప్రభుత్వం మరొక కోణం. ఈ రెండింటి మధ్య ఘర్షించిన మూడో కోణం (త్రిలింగ) ప్రజలు. ఈ ప్రజల్లో ఒకరైన ఈ రచయిత, వ్యక్తిగా కొన్ని బాధ్యతలు నిర్వహించారు. అందువల్ల ఆ తర్వాత రచయితగా ఆనాటి స్థల, కాల, కారణాలకు ఒక రూపం ఇవ్వగలిగారు. తెలంగాణ జీవితంపై దాశరథి రంగాచార్య నవలలు, ఇంకా మరికొందరి కొద్ది నవలలు తప్ప రాలేదు. ఇక రావేమో కూడా! తరం తర్వాత తరం మారిపోతున్నది. ప్రజలు పాత గాయాలు, పోరాటాలు మరిచిపోతున్నారు. వాటి స్థానంలో కొత్త గాయాలు, కొత్త పోరాటాలు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకీ సంక్లిష్టమైపోతున్న జీవన విధానంలో వచ్చిన ఈ వేగం... గతాన్ని మరిచిపోవడంలో కూడా వేగాన్ని పెంచింది. ఎంతోమంది కవులూ కళాకారులూ ఈ వేగంలో కొట్టుకుపోతున్నప్పటికీ, అతికొద్ది మంది మాత్రం మైలురాళ్లలా నిలబడతారు. తెలంగాణ సాహిత్య ప్రపంచంలో నవలా రచయిత దాశరథి రంగాచార్య ఒక మైలురాయి! విశ్వ సాహిత్యంలోని ఒక మాగ్జిమ్ గోర్కీ, ఒక ప్రేమ్ చంద్, ఒక సాదత్ హసన్ మంటోల స్థాయిని తెలుగు నుండి, తెలంగాణ నుండి ఎవరైనా అందుకోగలిగారంటే నిస్సందేహంగా అది దాశరథి రంగాచార్యే! దాశరథి రంగాచార్య జీవితం వేరు. ఆవేశపరుడైనా, నిదానం ఎక్కువ. జీవితంలోనూ, రచనలోనూ ‘ హి ఈజ్ మోర్ ప్రాక్టికల్’. అందువల్ల కవిత్వం పనికిరాలేదు. పీడిత తెలంగాణ జన జీవిత పరిధి పెద్దది. అందులోని కరకు నిజాల్ని వెల్లడించడానికి కవిత్వం కన్నా వచనమే సరైందని తేలింది. -
ఏడుపదుల జీవనవేదం
డా.దాశరథి రంగాచార్య నివాసం సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి. వారింట్లోకి అడుగు పెట్టగానే... ఎనభై ఆరేళ్ల రంగాచార్య మంచం మీద నుంచి లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తుండగా, ఆయన అర్ధాంగి, ఎనభై ఏళ్ల కమల ఆయన్ను బిడ్డలా తన రెండు చేతుల్లో పొదువుకొని, జాగ్రత్తగా కూర్చోబెట్టారు. ‘‘మూడేళ్లక్రితం మమ్మల్ని కలుసుకోవడానికి ఒకమ్మాయి వచ్చింది. ఆమె భర్త అమెరికాలో, తను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామని చెప్పింది. ‘దాంపత్యాన్ని మించిన ఆస్తి ఏదీ అవసరం లేదు... కుటుంబంలో ఎవరో ఒకరు సంపాదిస్తే చాలు’ అని హితవు చెప్పాం. ఆ అమ్మాయి భర్త దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు ఇద్దరూ పిల్లాపాపలతో ఆనందంగా ఉన్నారు’’ అని సంతోషంగా వారు గుర్తు చేసుకుంటుంటే... అన్యోన్యంగా ఉన్న దంపతుల మాటలు అందరూ ఆచరణలో పెడతారనిపిం చింది. సంసారంలో ఘర్షణకు తావివ్వవద్దని, ఘర్షణ ఉంటే సంసారం ఛిద్రమైపోతుందంటూ... ఇదే విష యాన్ని తమ మనవలకు చెబుతూ ఉంటామని, తమ సూచనలతో వారు జీవితాలను చక్కబరుచుకుని, ఆనందంగా ఉన్నారని తెలిపారు. బాధ్యతల పంపకాలు... భద్రాచల వాస్తవ్యులైన రంగాచార్య తమ చిన్ననాటి పరిస్థితులు, సామాజికాంశాల గురించి మాట్లాడుతూ- ‘‘పెళ్లప్పుడు కమల వయసు ఆరు. నా వయసు 12. శారదా చట్టం ప్రకారం బాల్యవివాహం నేరంగా పరిగణించే రోజులు. పోలీసులొస్తే గుమ్మం దగ్గరే ఆపి, ఏదో పూజ అని చెప్పి, మా పెళ్లి చేశారు పెద్దలు. తర్వాత పదహారేళ్ల వయసులో కమల మా ఇంట అడుగుపెట్టింది. అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమాలలో విస్తృతంగా పాల్గొనడం, జైలుకు వెళ్లడం... అన్నీ జరిగాయి’’ అంటూ డెభ్బైఏళ్ల క్రితం తమ పెళ్లినాటి రోజులను గుర్తుచేసుకున్నారు. కమల తమ కాపురం తొలినాటి స్థితులను చెబుతూ - ‘‘అత్తింట ఆర్థికస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. కొన్నిరోజుల్లోనే ఇంటి పరిస్థితులు అర్థం చేసుకున్నాను. ఈయనకు చదువంటే అమితమైన ఇష్టం. తెల్లవార్లూ దీపం వెలుతురులో చదువుకునేవారు. టీచర్ ఉద్యోగమైతే ఇంకా బాగా చదువుకోవచ్చని మెట్రిక్యులేషన్ పాసై, ఆ ఉద్యోగం తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా నాలుగైదు ఊర్లు మారాం. బి.ఎ చేసిన తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో, నగరానికి వచ్చాం. అప్పటి నుంచి పగలంతా ఉద్యోగం, సాయంత్రాలు రాసుకోవడం ఈయన పని. ఇంటిపనులు, పిల్లలను చక్కదిద్దుకోవడం నా వంతు... ఇలాగే మా సంసార నావ నడిచింది’’ అని చెబుతున్న ఆమె మాటల్లో భార్యాభర్తలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలనే భావం ధ్వనించింది. కష్టాలలో తోడు నీడ... జీవితంలో కాలం అత్యంత విషాదాన్ని నింపినవి, వాటినుంచి ఒకరికొకరు ఓదార్పుగా మారిన క్షణాలను గుర్తుచేసుకుంటూ రంగాచార్య... ‘‘మొదటి కాన్పు సమయంలో, డెలివరీకని బెజవాడ ఆసుపత్రికి బయల్దేరాం. దారిలో ట్రెయిన్లో బిడ్డ పుడుతూనే చనిపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఈమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో వేరే మార్గం కనిపించక, ఆ బిడ్డ కాయాన్ని మూటగట్టి కృష్ణానదిలో వదిలేయాల్సి వచ్చింది. అప్పటి ఆ బాధ వర్ణించలేనిది’’ అంటూ గద్గద స్వరంతో దాశరథి చెబుతుండగా ‘‘నేను ఎన్నిసార్లు అడిగినా మూడురోజుల వరకు బిడ్డ బతికుందనే చెప్పారు. నా ఆరోగ్యం పర్వాలేదనుకున్నాక అసలు విషయం చెప్పి ఎంతో బాధపడ్డారు’’ అంటూ కమల భర్త చేతిపై తన చేయుంచారు. ఆ స్పర్శలో బాధను దూరం చేసే ఓదార్పు కనిపించింది. ఉద్యోగరీత్యా నగరానికి వచ్చాక ఇల్లు కట్టుకోవడంలో పడిన కష్టాన్ని రంగాచార్య గుర్తుచేసుకుంటూ- ‘‘యాభై ఏళ్ల క్రితం ఇప్పుడున్న ఈ ఇల్లు కట్టాలని నిశ్చయించుకున్నాం. అయితే ఇల్లు గోడల వరకు లేచి ఆగిపోయింది. పై కప్పు వేయడానికి పైకం లేదు. పిల్లలు చిన్నవారు. నిలవనీడ లేదు. ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లు కట్టడానికి పోసిన ఇసుకలో కూర్చొని కన్నీరు పెట్టుకున్నాం. జీవితంలో దుఃఖపూరితమైన సంఘటనలు ఏవేవో వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలోనే ఆలుమగలు ఒకరికొకరు ఓదార్చు కోవాలి. పంచుకునే హృదయం తోడుంటే ఎంతటి కష్టమైనా తట్టుకొని నిలబడవచ్చని ఎన్నో కష్టాల ద్వారా అవగతమైంది’’ అన్నారు. ఆమెకు షష్టిపూర్తి... అరవై ఏళ్ల దాంపత్యంలో అపురూపంగా అనిపించిన, ఒకరినొకరు ఆనందపరుచుకున్న క్షణాలను గుర్తుచేసుకుంటూ -‘‘మాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఉద్యోగం, రచనలు... అంటూ నా పనిలో నేను ఉండేవాణ్ణి. పిల్లల చదువులు, మా తోబుట్టువుల పెళ్లిళ్లు, కూతుళ్ల పెళ్లిళ్లు... వారి బారసాలలు.. అన్నీ కమల స్వయంగా చూసుకునేది. కుటుంబం కోసం ఇంత కష్టపడిన నా భార్యకు ఏమివ్వగలను అనిపించేది’’ అని రంగాచార్య చెబుతుంటే -‘‘ఈయన షష్టిపూర్తి అయిన ఆరేళ్లకు నాకు అరవై ఏళ్లు వచ్చాయి. ఆ సందర్భంగా ఎవరూ చేయని విధంగా ‘మా ఆవిడకు షష్టిపూర్తి’ అని పెద్ద ఎత్తున వేడుక చేశారు. ‘అదేమిటి ఆవిడకు షష్టిపూర్తి?’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించినవారూ ఉన్నారు. అన్నేళ్లయినా మా మధ్య అనురాగం పదిలంగా ఉందని చెప్పడానికి జీవితంలో అపురూపంగా నిలిచిపోయింది ఆ వేడుక. ఇన్నేళ్ల జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తోంది’’ అన్నారు సంతోషం నిండిన హృదయంతో కమల. ఇదే అసలైన జీవితం... సుదీర్ఘ ప్రయాణం తర్వాత విరామం దొరికితే.. ఈ విషయం గురించే రంగాచార్య ప్రసావిస్తూ ‘‘ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. ఆరోగ్య సమస్యల మూలంగా వీల్‌చెయిర్‌కే పరిమితం అయ్యాను. ఈవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే! అయినా నా ఆరోగ్యం కోసం తహతహలాడుతుంది. ఈ వయసులో అంతకుమించిన బాంధవ్యం ఎవరిద్వారా లభిస్తుంది. ఒక్క భార్య మాత్రమే అండగా ఉండగలదు’’ అంటుంటే - ‘‘సంసారం నడపడానికి ఎన్నో పరుగులు తీశాం. ఇప్పుడు ఇద్దరమూ పిల్లలకు సంబంధించిన విషయాలు, రచనలు, సమకాలీన పరిస్థితుల గురించి... ముచ్చటించుకుంటూ ఉంటాం. ఇన్నేళ్లు ఎక్కడికైనా కలిసే ప్రయాణం చేశాం. ఇప్పుడు... గతం తాలూకు జ్ఞాపకాలను కలబోసుకోవడంలో ఆనందాన్ని పొందుతుంటాం. మొదటినుంచి ఇప్పటివరకు ఏ విషయంలోనైనా ఈయన ఏది చెప్పినా నేను ‘సరే’ అనే అన్నాను. ఆయన కూడా అంతే. అందుకే ఇన్నేళ్లలో ఒకరి మీద ఒకరం విసుక్కున్నది లేదు. కోపమన్నదే ఎరగం’’ అన్నారు కమల తమ దాంపత్యంలోని అసలు కిటుకు చెబుతూ! జీవితాన్ని కాచి వడబోసిన ఈ దంపతుల సూచనలు నేటితరం ఆచరణలో పెట్టి తమ బంధాలను పదిలం చేసుకోవాలని కోరుకుందాం. అక్షరవాచస్పతి, సాహితీవేత్త, కమ్యూనిస్టు, నిజాముకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు, కవి డాక్టర్ దాశరథి రంగాచార్య. రచనలు: శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేద సంహిత శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహిత శ్రీమదాంధ్ర వచన అథర్వవేద సంహిత (నాలుగు వేదాలు 9 సంపుటాలు); శ్రీమదాంధ్ర వచన అమృత ఉపనిషత్తులు వేదం- జీవననాదం సీతాచరితం శ్రీమద్రామాయణము శ్రీ మహాభారతము శ్రీమద్భాగవతము ఇతర రచనలు: చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, మానవత, శరతల్పం, దేహదాసు ఉత్తరాలు, జనపదం, మాయజలతారు, పావని, రానున్నది ఏది నిజం?, నల్లనాగు కథలు, జీవనయానం. నా రచనా వ్యాసంగానికి ఎలాంటి అడ్డంకి రానివ్వని నా భార్య కమల వల్లనే నాకు పేరుప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందాయి. - దాశరథి రంగాచార్య భర్తకు వచ్చే పేరును బట్టే భార్యకూ ఆ గౌరవమర్యాదలు అందుతాయి. ఆ గౌరవం అన్నివిధాలా నాకూ దక్కడానికి కారణం ఈయన ఎనలేని కృషి. - శ్రీమతి కమల - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: శివ మల్లాల