dasari narayanarao passed away
-
దాసరి మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
హైదరాబాద్: దర్శక రత్న దాసరి నారాయణ రావు చనిపోవడంపట్ల ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ప్రస్తుతం చైనాలో ఉన్న ఆయన సంతాప సందేశాన్ని, దాసరితో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ‘దర్శకరత్న దాసరిగారి అకాల మరణం వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్యగారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతుల మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడాను. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను. ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ అనీర్వచనీయం. ఇప్పటి వరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాను’ అని చిరంజీవి అన్నారు. అలాగే, దాసరితో తాను పనిచేసిన రోజులు అత్యుత్తమమైనవని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ అన్నారు. కే బాలచందర్‌కు దాసరి గొప్ప అభిమాని అని చెప్పారు. అంతటి సినీ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం దొరకడం తన అదృష్టం అని చెప్పారు. -
‘సినిమా రంగ అంబేద్కర్ దాసరి’
హైదరాబాద్: క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్లుగా దాసరికి ముందు, దాసరి తర్వాత అని చెప్పుకోవాల్సిందేనని, అంత గొప్పస్థానానికి దాసరి నారాయణరావు ఎదిగారని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో దర్శక రత్న దాసరి నారాయణ రావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన పార్ధీవ దేహాన్ని కిమ్స్ ఆస్పత్రిలో చూసిన అనంతరం నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ కుల,మత, లింగ, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి సినిమా రంగంలో జీవితాన్నిచ్చిన గొప్పవ్యక్తి దాసరి నారాయణరావు అని అన్నారు. సినిమా రంగంలో దాసరి ఒక అంబేద్కర్లాంటివారని చెప్పారు. -
దర్శకత్వంలో తొలి ప్రపంచ రికార్డు దాసరిదే
హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం కారణంగా కన్నుమూసిన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ప్రపంచ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి 100 సినిమాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. అలాగే, 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 1974లో తాతా మనవడు సినిమాతో.. వెండితెరకు పరిచయం అయినా దాసరి తొలి సినిమాకే నంది అవార్డు అందుకొని రికార్డు సృష్టించారు. ఆ తర్వాత తీసిన స్వర్గం-నరకం సినిమాకు, 1983లో మేఘ సందేశం, 1992లో మామగారు సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. దాసరి నారాయణరావు ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మేఘ సందేశం, శివరంజని, గోరింటాకు, ఏడంతస్థుల మేడ, స్వయంవరం, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, తాండ్ర పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు, మజ్ను, ఓసేయ్ రాములమ్మ, అమ్మ రాజీనామా, మామగారు వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఎర్రబస్సు. దాదాపు 53 సినిమాలు నిర్మించిన దాసరి 250కి పైగా చిత్రాలకు డైలాగ్ రైటర్ కూడా పనిచేశారు. దాసరి 1986లో ఏయూ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. -
దాసరి సినిమాలే ఎన్టీఆర్‌ని సీఎం చేశాయి!
హైదరాబాద్: దర్శక రత్న దాసరి నారాయణరావు తన 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. చరిత్రలో నిలిచిపోయే భారీ బ్లాక్ బస్టర్లను అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో ఆయన చేసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపరాయుడులాంటి సినిమాలే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించాయనడంలో అతిషయోక్తి కాదు. అలాగే ఏ ఎన్నార్ హీరోగా ఆయన తెరకెక్కించిన మేఘసందేశం సినిమా భారీ సక్సెస్ సాధించటంతోపాటు ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మలాంటి సినిమాలతో సమాజంలోని సమస్యలను ఎత్తి చూపించారు.. మేస్త్రీ, ఎమ్మెల్యే ఏడుకొండలులాంటి సినిమాలతో రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దాదాపు తెలుగు ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దాసరి.. నటుడిగానూ స్టార్ అనిపించుకున్నారు. మామగారు, మేస్త్రీలాంటి సినిమాలకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకొని మహానటుల సరసన నిలిచారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ దాసరి సత్తా చాటారు. దాదాపు దక్షిణాది భాషలన్నింటితోపాటు హిందీలోనూ సినిమాలను తెరకెక్కించారు. అంతేకాదు దర్శకుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని పరిచయం చేసిన తొలి దర్శకుడు కూడా దాసరి గారే. ఆయన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆయనకు పద్దెనిమిదివేల అభిమానుల సంఘాలు ఉండేవి. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే సామాజిక సమస్యలు ఇతివృత్తాలుగా సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన సినిమాలన్ని స్త్రీ సమస్యల కథాంశాలుగా తెరకెక్కాయి. సినిమా రంగంలో జరుగుతున్న అన్యాయలపై కూడా ఆయన తనదైన అస్త్రాన్ని ప్రయోగించారు. వెండితెర వెనుక చీకటి కోణాల్ని అద్దాల మేడ, శివరంజని సినిమాలతో ప్రపంచానికి తెలిసేలా చేశారు. తరువాత బుల్లితెర మీద కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. విశ్వమిత్ర అనే హిందీ సిరీయల్తో బుల్లితెర దర్శకుడిగా కూడా మారారు.ఆయన నిర్మాణ సంస్థ ద్వారా అనేక సీరియల్స్ నిర్మించారు. సినీరంగంలో మంచి స్థానంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా తరువాత కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. తెలుగు సినీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన దాసరి మరణం సినీరంగానికే కాదు.. తెలుగు ప్రజలకే తీరని లోటు. -
ఆ ఒక్కదానికే తలవంచిన ‘దర్శక’ శిఖరం
దాసరి... ఓ దార్శనికుడు. నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న శ్రామికుడు. సమాజంలో సమస్యలపై సినిమాల ద్వారా బాణాలు సంధించిన సైనికుడు. మాటలతో మనకు మంచి బోధించిన మార్గదర్శకుడు. ఎందరో (ఏకలవ్య) శిష్యులు, దర్శకులకు గురువుగా నిలిచిన నిలువెత్తు శిఖరం. ప్రతిభావంతులు ఎందరికో నీడ ఇచ్చిన ‘దర్శక’ శిఖరం. దాసరి ప్రయాణం నవతరం దర్శకులకు పాఠం. ఆయన దర్శకుడు మాత్రమే కాదు మాటల రచయిత, పాటల రచయిత కూడా. 150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి సుమారు 250 చిత్రాలకు మాటలు, అనేక సినిమాల్లో పాటలు రాశారు. దాసరి ప్రతిభ అంత వరకేనా? కాదండోయ్! ఆయన నటుడు, నిర్మాత కూడా. తెలుగుకు మాత్రమే దాసరి పరిమితం కాలేదు. హిందీలోనూ దర్శకునిగా సత్తా చాటారు. తమిళ, కన్నడ సినిమాల్లో నటునిగా మెరిశారు. దాసరిది ఘనచరిత్ర... ప్రతిభకు చేయూత ఇచ్చిన చరిత. శిఖరం దేనికీ తలొంచి ఎరగదు. కానీ ‘దర్శక’ శిఖరం దాసరి ఒక్కదాని ముందు ఎప్పుడూ తలొంచారు. దర్శకునిగా ప్రయాణం ప్రారంభించినప్పట్నుంచి ఆ ఒక్కదాని ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ ఒక్కటి... కథ, సినిమా కథ. తాను రాసిన కథ ఎవర్ని కోరితే వాళ్లతోనే సినిమాలు తీసిన దర్శకుడు దాసరి నారాయణరావు. తొలి సినిమా ‘తాతా మనవడు’ నుంచి మొదలుపెడితే తాజా ‘ఎర్ర బస్సు’ వరకు ఆయన దారి మార్చుకోలేదు. రెండు తరాల అగ్ర నటులతో, హీరోలతో పని చేశారాయన. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణలతో పాటు తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో సినిమాలు తీశారు. స్టార్ దర్శకునిగా పేరొచ్చిన తర్వాత కొత్త నటీనటులతో, తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమాలు తీయడానికి వెనుకాడలేదు. కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు. తొలి సినిమా ‘తాతా మనవడు’లో ‘అనుబంధం అత్మీయత అంతా ఓ బూటకం’ అంటూ కన్నకొడుకు నిరాదరణకు గురైన తల్లిదండ్రల ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారు. స్వర్గం–నరకం, మేఘ సందేశం, కంటే కూతుర్నే కను వంటి సినిమాల్లో ప్రేక్షకుల హృదయపు లోతుల్లో తడిని తట్టి లేపారు. దాసరి ఫ్యామిలీ సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ‘తాండ్ర పాపారాయుడు‘, ‘బొబ్బిలి పులి‘, ‘సర్దార్ పాపారాయుడు‘ వంటి కమర్షియల్ సినిమాలతో గర్జించారు. ‘ప్రేమాభిషేకం‘, ‘మజ్ను‘ సినిమాల్లో ప్రేమను ప్రేక్షకులకు చూపారు. ‘ఒసేయ్ రాములమ్మ’లో సమాజంలో అసమానతలను ఎత్తి చూపారు. ఈ సినిమాలు దాసరి తీసిన ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’ ఇలా ఎన్నో ఎన్నెన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారాయన. ఆయన ప్రతిభకు మెచ్చి పలు అవార్డులు సలాం చేశాయి. రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దాసరి అందుకున్నారు. నేపథ్యం: ‘దర్శకరత్న’ దాసరి 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. బి.ఎ. చదివారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల పోటీల్లో పాల్గొన్నారు. బహుమతులు గెలుచుకున్నారు. అత్యధిక చిత్రాల దర్శకునిగా దాసరి లిమ్కా వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. మేఘ సందేశం (1983), తాండ్ర పాపారాయుడు (1986), సూరిగాడు (1992), కంటే కూతుర్నే కను (2000) వంటి చిత్రాలు దర్శకుడిగా దాసరికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఆశాజ్యోతి’, ‘ఆజ్ కా ఎమ్మెల్యే’, ‘రామ్ అవతార్’ చిత్రాలలో రాజేశ్ ఖన్నాను దాసరి విలక్షణమైన భిన్న పాత్రల్లో చూపించారు. నటులు మోహన్‌బాబు, ఆర్.నారాయణమూర్తి, దర్శకులు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి ఇంకా పలువురు సాంకేతిక నిపుణుల్ని దాసరే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. రాజకీయాలు: దాసరి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ’సాక్షి’ ఎక్సలెన్సీ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది దర్శకరత్న దాసరికి ‘తెలుగు శిఖరం’అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో దాసరి మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి ’సాక్షి’ సంతాపం తెలిపింది.