
దాసరి సినిమాలే ఎన్టీఆర్‌ని సీఎం చేశాయి!
హైదరాబాద్: దర్శక రత్న దాసరి నారాయణరావు తన 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. చరిత్రలో నిలిచిపోయే భారీ బ్లాక్ బస్టర్‌లను అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో ఆయన చేసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపరాయుడులాంటి సినిమాలే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించాయనడంలో అతిషయోక్తి కాదు. అలాగే ఏ ఎన్నార్ హీరోగా ఆయన తెరకెక్కించిన మేఘసందేశం సినిమా భారీ సక్సెస్ సాధించటంతోపాటు ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడింది.
కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మలాంటి సినిమాలతో సమాజంలోని సమస్యలను ఎత్తి చూపించారు.. మేస్త్రీ, ఎమ్మెల్యే ఏడుకొండలులాంటి సినిమాలతో రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దాదాపు తెలుగు ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దాసరి.. నటుడిగానూ స్టార్ అనిపించుకున్నారు. మామగారు, మేస్త్రీలాంటి సినిమాలకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకొని మహానటుల సరసన నిలిచారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ దాసరి సత్తా చాటారు. దాదాపు దక్షిణాది భాషలన్నింటితోపాటు హిందీలోనూ సినిమాలను తెరకెక్కించారు.
అంతేకాదు దర్శకుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని పరిచయం చేసిన తొలి దర్శకుడు కూడా దాసరి గారే. ఆయన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆయనకు పద్దెనిమిదివేల అభిమానుల సంఘాలు ఉండేవి. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే సామాజిక సమస్యలు ఇతివృత్తాలుగా సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన సినిమాలన్ని స్త్రీ సమస్యల కథాంశాలుగా తెరకెక్కాయి. సినిమా రంగంలో జరుగుతున్న అన్యాయలపై కూడా ఆయన తనదైన అస్త్రాన్ని ప్రయోగించారు.
వెండితెర వెనుక చీకటి కోణాల్ని అద్దాల మేడ, శివరంజని సినిమాలతో ప్రపంచానికి తెలిసేలా చేశారు. తరువాత బుల్లితెర మీద కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. విశ్వమిత్ర అనే హిందీ సిరీయల్‌తో బుల్లితెర దర్శకుడిగా కూడా మారారు.ఆయన నిర్మాణ సంస్థ ద్వారా అనేక సీరియల్స్ నిర్మించారు. సినీరంగంలో మంచి స్థానంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా తరువాత కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. తెలుగు సినీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన దాసరి మరణం సినీరంగానికే కాదు.. తెలుగు ప్రజలకే తీరని లోటు.