
దర్శకత్వంలో తొలి ప్రపంచ రికార్డు దాసరిదే
హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం కారణంగా కన్నుమూసిన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ప్రపంచ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి 100 సినిమాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. అలాగే, 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 1974లో తాతా మనవడు సినిమాతో.. వెండితెరకు పరిచయం అయినా దాసరి తొలి సినిమాకే నంది అవార్డు అందుకొని రికార్డు సృష్టించారు. ఆ తర్వాత తీసిన స్వర్గం-నరకం సినిమాకు, 1983లో మేఘ సందేశం, 1992లో మామగారు సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు.
దాసరి నారాయణరావు ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మేఘ సందేశం, శివరంజని, గోరింటాకు, ఏడంతస్థుల మేడ, స్వయంవరం, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, తాండ్ర పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు, మజ్ను, ఓసేయ్ రాములమ్మ, అమ్మ రాజీనామా, మామగారు వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఎర్రబస్సు. దాదాపు 53 సినిమాలు నిర్మించిన దాసరి 250కి పైగా చిత్రాలకు డైలాగ్ రైటర్ కూడా పనిచేశారు. దాసరి 1986లో ఏయూ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు.