సాఫీగా హైదరాబాదీల రిటైర్మెంట్ జీవనం
డీబీఎస్ వెల్నెస్ నివేదికలో వెల్లడి
పదవీ విరమణ తర్వాత కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా జీవితాన్ని కొనసాగించడంలో హైదరాబాదీలు ముందంజలో ఉన్నారట. పదవీ విరమణ తర్వాత కూడా మునుపటిలానే చక్కని జీవితాన్ని కొనసాగిస్తున్న వారిలో ఢిల్లీతో పాటు హైదరాబాదీలు కూడా ప్రధానంగా నిలుస్తున్నట్లు ‘డీబీఎస్’ రిటైర్మెంట్ వెల్నెస్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక మేరకు... పదవీ విరమణ తర్వాత జీవితాన్ని గడపడం కోసం వీరు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా సర్వే విశేషాలేంటంటే...
* 73% మంది రిటైర్మెంట్ తర్వాత ఇతర కుటుంబ సభ్యుల సహకారం లేకుండానే ఆర్థిక స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
* 59% మందైతే రిటైర్మెంట్ ప్రణాళిక గురించి నిపుణుల సహాయం కోసం కూడా చూడటం లేదు.
* భారతీయుల్లో చాలామంది 40 ఏళ్లు వచ్చే వరకు రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించడమే లేదు.
* 16% మంది అసలు రిటైర్మెంట్ గురించి ఎలాంటి ఆర్థిక ప్రణాళికలూ తయారు చేసుకోవడం లేదు.
* ఉద్యోగ సమయంలో పొదుపు చేసుకున్న మొత్తం రిటైర్మెంట్ తర్వాత 15 ఏళ్లపాటు జీవించడానికే సరిపోతోందని 57 శాతం మంది చెప్పారు. సగటున వీరు జీతంలో 26 శాతాన్ని రిటైర్మెంట్ నిధి కోసం కేటాయిస్తున్నారు.
* రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా జీవనం సాగించడానికి నెలకు కనీసం రూ.32,937 అవసరమవుతాయని సర్వేలో పాల్గొన్నవారు చెప్పినట్లు డీబీఎస్ వెల్నెస్ నివేదిక పేర్కొంది.