
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం మరింతగా ముదురుతుండటం.. వాణిజ్య బ్యాంకులకు వరంగా మారొచ్చని సింగపూర్‌కి చెందిన బ్రోకింగ్ సంస్థ డీబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. దీన్ని అవకాశంగా మల్చుకుని బ్యాంకులు మళ్లీ కార్పొరేట్ల రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల రుణ అవసరాలు తీర్చేందుకు బ్యాంకులే ప్రధాన వనరుగా మారవచ్చని వివరించింది.
మొండిబాకీల సమస్యలతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆర్‌బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇది సాధ్యమేనని డీబీఎస్ పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార సంస్థలకు రుణాల్లో బ్యాంకుల మార్కెట్ వాటా 55 శాతంగా ఉండగా.. 2017 ఆర్థిక సంవత్సరంలో 34 శాతానికి తగ్గింది. మళ్లీ 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి చేరిందని డీబీఎస్ వివరించింది.