సేవకు ప్రాధాన్యమివ్వండి
♦ మహిళలు టీవీ సీరియళ్లు చూడటం.. పురుషులు కల్తీకల్లు తాగడాన్ని పక్కనపెట్టాలి
♦ ‘గ్రామజ్యోతి’లో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలి
♦ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి
శామీర్‌పేట్ : గ్రామజ్యోతి కార్యక్రమంలో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని, అప్పుడే పల్లెసీమలు ప్రగతిపథాన పయనిస్తాయని జెడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు టీవీ సీరియళ్లు చూడటాన్ని, పురుషులు కల్తీకల్లు తాగడాన్ని పక్కనపెట్టి సేవ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని ఆమె సూచించారు. శుక్రవారం మండలంలోని లాల్‌గడిమలక్‌పేట్‌లో సునీతారెడ్డి పర్యటించారు. స్థానిక సర్పంచ్ బీర్కురి వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ ఉన్నతపాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను పరిశీలించారు.
గ్రామపంచాయతీ వద్ద బాదం మొక్క నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో సునీతారెడ్డి పసంగించారు. ప్రతి అధికారి, స్వచ్ఛంద సంస్థలు గ్రామాలను దత్తత తీసుకుని సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేయాలని సూచించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. లాల్గడిమలక్పేట్ను దత్తత తీసుకున్న బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాన్ని మరింత అభివృద్ధిపథంలో తీసుకేళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు బాలేష్, ఎంపీడీఓ శోభారాణి, గ్రామజ్యోతి మండల ఇన్చార్జి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సుభాషిణి, ఉప సర్పంచ్ జగదీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.