పాతబస్తీలో ‘ఆపరేషన్ లేట్‌నైట్’
- 282 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్
చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో ఇటీవల జరిగిన స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడంతో పోలీసులు మేల్కొన్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి 10 ప్రత్యేక బృందాలు 17 పోలీస్స్టేషన్ల పరిధిలో ‘ఆపరేషన్ లేట్ నైట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అర్ధరాత్రి రోడ్లపై ఆవారాగా తిరిగే యువకులతో పాటు హుక్కా సెంటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, స్మోకింగ్ ఏరియాలు, టిఫిన్ సెంటర్లు, బస్తీ చబుత్రాల్లో మంతనాలు చేస్తున్న 282 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీగలకుంట, తలాబ్‌కట్ట, చాంద్రాయణగుట్ట, బాబానగర్, సంతోష్‌నగర్ బస్తీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు.
కాగా పట్టుబడిన వారిలో 30 మంది 16-17 ఏళ్ల వయసున్న మైనర్లు కాగా మిగతా వారు 18-25 ఏళ్ల వయసున్న వారు. వారి తల్లిదండ్రులను పిలిపించి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నెలలోపు పిల్లలు ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో మంచిగా మెలుగుతామని పట్టుబడిన యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
క్రమశిక్షణ అలవర్చేందుకే : డీసీపీ సత్యనారాయణ
ఆవారాగా తిరుగుతున్న యువకుల్లోక్రమశిక్షణ అలవర్చేందుకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశానుసారం ఆపరేషన్ లేట్‌నైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో స్ట్రీట్ ఫైట్ ఘటన జరిగి నబీల్ అనే విద్యార్థి మృతి చెందాడని అన్నారు. చాంద్రాయణగుట్ట పరిసరాల్లో అర్ధరాత్రి స్విమ్మింగ్ పూళ్ల వద్ద బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. కొందరు యువకులు రౌడీషీటర్లతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు.