
సినిమాల స్ఫూర్తితో చోరీలు
పోలీసులకు చిక్కిన ఎంబీఏ గ్రాడ్యుయేట్
చాంద్రాయణగుట్ట: సినిమాల్లో వచ్చే దొంగతనం సన్నివేశాలు చూసి చోరీల బాటపట్టాడో ఎంబీఏ పట్టభద్రుడు. సదరు ప్రబుద్ధుడిని హుస్సేనీఆలం పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శనివారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట నషీబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్ (34) ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సినిమాల్లో వచ్చే చోరీ సన్నివేశాలు, పత్రికలలో వచ్చే దొంగతనాల వార్తలు చూసి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
తనకున్న తెలివితో పోలీసులు తిరగని బస్తీలలో గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు దొంగతనాలు చేశాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న హుస్సేనీఆలం అదనపు ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ సాంకేతిక ఆధారాలతో అవేజ్‌ను పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి 10 తులాల బంగారం, రూ. 12,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా అవేజ్ దొంగతనం చేసే తీరును బట్టి భవిష్యత్‌లో గజదొంగ అయ్యేలా ఉన్నాడని, అలాంటి దొంగను ఆదిలోనే పట్టుకున్నందుకు అదనపు ఇన్‌స్పెక్టర్‌కు నగదు రివార్డును అందించనున్నామని డీసీపీ చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, హుస్సేనీఆలం ఇన్‌స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు పంపామన్నారు.