ఆరు లక్షలమందిలో ఒకరికిలా..
కోలకత్తా: కోలకత్తా వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడి కడుపులోంచి కాళ్లు, చేతులు, గోళ్లు, పూర్తిగా రూపుదిద్దుకోని తల భాగంతో ఉన్న మృత పిండాన్ని వైద్యులు వెలికి తీశారు.
వివరాల్లోకి వెళితే బిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్కిబంద్ గ్రామంలో నివసించే నాలుగేళ్ల బాలుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంటే తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అయితే ప్రాథమికంగా ఆ బాలుడిని పరిశీలించిన వైద్యులు అతడి కడుపులో ఏదో ట్యూమర్ ఉండొచ్చని అనుమానించారు.
నిర్ధారణ కోసం స్కాన్, సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆ బాలుడి పొట్టలో మృతపిండం ఉన్నట్టుగా నిర్ధారణ అయిందని డా. శ్రీషేందు గిని తెలిపారు. దీంతో అతడికి శస్త్రచికిత్స చేసి కాళ్లు, చేతులు గోళ్లు, పాక్షికంగా రూపుదిద్దుకున్న తల భాగాలతో కూడిన మృత పిండాన్ని తొలగించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.
వైద్యశాస్త్రం పరిభాషలో దీన్ని పిండంలో పిండం అని పిలుస్తామని డా. గిని తెలిపారు. సుమారు అయిదు నుండి ఆరు లక్షల మందిలో ఇలాంటి అరుదైన సంఘటన జరుగుతుందని పేర్కొన్నారు. గర్భంతో ఉన్నపుడు పిండదశలో జరిగే కొన్ని అవాంఛనీయ మార్పుల వల్ల ఇలా జరుగుతుందన్నారు. ముఖ్యంగా గర్భంలో కవల పిండాలు రూపుదిద్దుకునే క్రమంలో ఒక పిండంలోకి మరో పిండం చొరబడటం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు.