ఓటరు నమోదుకు 17వరకు గడువు
ఏలూరు, న్యూస్‌లైన్:ఓటుహక్కు లేనివారంతా ఓటరుగా నమోదయ్యేందుకు భారత ఎన్నికల సంఘం ఈ నెల 17వరకు గడువు ఇచ్చిందని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో శనివార ం విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 8, 15 తేదీలలో జిల్లాలోని 3,308 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఓటుహక్కు పొందిన వారు జాబితాలో తమ పేర్లు ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవచ్చన్నారు. పేర్లు, చిరునామా, వయసు, ఇతర మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని సూచించారు.
ఓటు నమోదు కోసం ఫారం-6, ఓటరు జాబితాలో అభ్యంతరాలు లేదా పేరు తొలగించడానికి ఫారం-7, పేర్లు, చిరునామా సవరణలకు ఫారం-8, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి ఓటు మార్పు చేసుకోవడానికి ఫారం-8ఏలో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు విధిగా ఓటు హక్కు పొందేలా చూడాలని కోరుతూ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు మార్గదర్శకాలు ఇచ్చామని చెప్పారు. ఇంటి నంబర్లు లేని ఇళ్లకు వాటిని వేయాల్సిందిగా పంచాయతీ, మునిసిపల్ అధికారులకు ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు. ఓటరు కార్డులను పోగొట్టుకున్న వారు మీ సేవ కేంద్రంలో రూ.10 చెల్లించి డూప్లికేట్ కార్డులు పొందవచ్చన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.