శ్రుతిమించిన ఈవ్‌టీజింగ్
- ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
బిట్రగుంట : ఈవ్ టీజింగ్ వ్యవహారం శ్రుతిమించడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బోగోలులో సోమవారం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలుకు చెందిన ఓ విద్యార్థిని కావలి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తుండగా, బోగోలుకు చెందిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి ఒకరు పరిచయం పెంచుకున్నాడు. అక్కా అంటూ సరదాగా మాట్లాడుతూ ఫోన్ ద్వారా స్నేహం చేశాడు. చివరకు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ వేధిస్తుండటంతో ఆందోళనకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది.
కుటుంబ సభ్యులు ఇంటర్ విద్యార్థి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. వివాదం పెద్దది కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే కావలిలోని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా నొప్పుల నివారణకు వాడే మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కావలిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.