మంత్రగత్తె నెపంతో జాతీయ క్రీడాకారిణిపై దాడి
దిపూ(అసోం): జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ మహిళపై మంత్రగత్తె అనే అనుమానంతో దాడి చేసిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. కర్బి అంగోలా జిల్లా చేరేకులిలో కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
జావలిన్ త్రోలో జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన దేబజాని బోరాను నిందితులు బుధవారం సాయంత్రం కట్టేసి చితకబాదినట్లు ఎస్పీ ఎంజే మహంతా తెలిపారు. గ్రామంలో సమస్యలకు ఆమే కారణమనే అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గాయపడి స్పృహ కోల్పోయిన దేబజానిని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. దీనికి సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.