Deevi subba rao
-
ఛాందోగ్య ఉపనిషత్
జ్యోతిర్మయం ఛాందోగ్య ఉపనిషత్ సామవేదానికి సంబంధించి నది. తాత్విక సిద్ధాంతాన్ని ఊరికే చెప్పకుండా చిన్న చిన్న కథలను జోడించి చెప్పటం చాలా ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. ఈ విషయంలో ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నన్ని కథలు మరేదాంట్లోనూ లేవు. వాటిల్లో రెండు కథలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. ఒకప్పుడు సత్యకాముడు అనే కుర్రవాడు తన తల్లిని అడిగాడు. ‘అమ్మా! నేను గురువుగారి దగ్గర ఉండి చదువుకుందామనుకుంటున్నాను. నా గోత్రమే మిటి? అందుకు సమాధానంగా ఆమె అన్నది. ‘నాయ నా నీ గోత్రమేమిటో నాకు తెలియదు. నేను వయసులో ఉండగా పరిచారికగా ఉన్నాను. ఆ కాలంలో నిన్ను నేను కన్నాను. అదట్లా అవటం వల్ల నీ గోత్రం ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను. అయినా గాని, నా పేరు జబాల. నీ పేరు సత్యకాముడు. కాబట్టి నిన్ను నీవు ‘సత్యకామ జాబాల’ అని చెప్పుకో’. ఆ కుర్రవాడు హారిద్రుమత గౌత ముని వద్దకు వెళ్లి ‘అయ్యా! మీ దగ్గర చదువుకోవాలని ఉంది. అనుమతి స్తారా? అని అడిగాడు. గౌతముడు, ‘ముందు నీ గోత్రం ఏమిటో చెప్పు’ అన్నాడు. ‘అయ్యా! నా గోత్రం ఏమిటో నాకు తెలియదు. నా తల్లిని అడిగితే ఇలా చెప్పింది’ అని చెప్పి చివరగా అన్నాడు ‘అందు వల్ల నేను సత్యకామ జాబాలిని’. అది విన్న గురువు గారు అన్నారు. ‘నిన్ను నేను శిష్యుడుగా అంగీకరిస్తు న్నాను. ఎందుకంటే నీవు సత్యం నుండి వైదొలగలేదు’. రెండో కథ: ఒకప్పుడు జానశృతి అనే రాజు ఉండే వాడు. అతడు ఎన్నో దానాలు చేశాడు. ఎందరికో ఆకలి తీర్చాడు. ఉండటానికి సత్రాలు కట్టించాడు. అతను అనుకొంటూ ఉండేవాడు, ‘అంతటా జనం నన్ను గురించే గొప్పగా చెప్పుకుంటారు’. ఓ రాత్రివేళ కొన్ని హంసలు పైన ఎగురుతూ వెళ్లాయి. వాటిల్లో ఒక హంస ఇంకో హంసతో అన్నది. ‘ఈ జానశృతి కీర్తి అనే తేజస్సు పట్టపగలు వెలిగినట్లు వెలుగుతోంది. దగ్గరగా బోకు, కాలిపోతావు’. ఆ ఇం కో హంస అన్నది, ‘‘ఇతను ఏమైనా బండి తోలుకొని జీవించే రైక్వుడా, అంతగా పొగుడుతున్నావు?’’ జాన శృతి ఈ మాటలు విన్నాడు. బండి తోలే రైక్వుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకు రమ్మని సేవకుణ్ణి పురమాయిం చాడు. సేవకుడు వెతికాడు కాని రైక్వుడు ఎక్కడ ఉం డేదీ కనిపెట్టలేకపోయాడు. జానశృతి చెప్పాడు, ‘బ్రహ్మ జ్ఞానిని ఎక్కడ వెతకాలో అక్కడ వెతుకు! సేవకుడు ఈ సారి వెతగ్గా రైక్వుడు బండి కింద కూర్చొని ఒంటి మీద పొక్కులు గోక్కుంటూ కనిపించాడు. జానశృతి చాలినన్ని బహుమతులు గురుదక్షిణగా పట్టుకెళ్లి, ప్రతిగా తాను కోరుకున్న బ్రహ్మజ్ఞానాన్ని బండి రైక్వుడి నుండి పొందినాడు. రెండు కథల్లోను పైకి కనిపించే అర్థం అంతము ఖ్యమైనది కాదు. అంతరార్థమే అసలు తెలుసుకోవల సింది. నాలుగు మహావాక్యాల్లో ఒకటైన ‘తత్త్వ మసి’ ఈ ఉపనిషత్తులోంచే గ్రహించబడింది. దీవి సుబ్బారావు -
మెహర్బాబా ‘గాడ్ స్పీక్స్’
హోలీ బుక్: సృష్టి గురించి దాని ప్రయోజనం గురించి తెలియజెప్పే గ్రంథాలు ఇటీవలి కాలంలో చాలా వచ్చినవిగాని ఇంగ్లిష్లో మెహర్బాబా రచించిన ‘గాడ్ స్పీక్స్’ గ్రంథం చెప్పినంత సాధికారికంగా, సమగ్రంగా మరే గ్రంథం చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. దీనిని చదువుతుంటే ప్రపంచంలోని గొప్ప మతాల్లో ఉన్న సిద్ధాంతాలు, బోధనలు అన్నీ కూడా ఒకే తీగకు గుచ్చబడిన పూసల్లా ఉన్నవని అనిపిస్తుంది. ఈ గ్రంథం స్థూలంగా ఆత్మ సుదీర్ఘ ప్రయాణాన్ని చెబుతుంది. ఆ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ‘నేనెవరు?’ అనే ప్రశ్న నుండి ‘నేను భగవంతుడను’ అనే సమాధానం వరకు. సృష్టి మొదలు అవటానికి ముందు ఉన్న స్థితి ఏమిటో ఎలాంటిదో ఎవరూ చెప్పలేరు. అలాంటి స్థితిలో పరమాత్మ తప్ప వేరే ఏమీ లేదు. ఆ స్థితిలో ఉన్న పరమాత్మకు తానెవరో తనకు తెలియదు. తానెవరో తెలుసుకోవాలనే ఒకానొక ఊహ పరమాత్మలో కలిగింది. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో గాలి వీస్తే కదలిక కలిగి ఎట్లా బుడగలు ఏర్పడతవో అట్లా ఆ ఊహ వల్ల సృష్టి ప్రారంభమైంది. ఆ ఊహే ఆత్మకు చైతన్యం కలిగించి అది పరిణామం చెందటానికి దోహదపడుతుంది. మానవరూపం పొందటానికి ముందు ఆత్మ- రాయి, లోహం, మొక్క, పురుగు, చేప, పక్షి, జంతువు- రూపాలను ఒకదాని తరువాత ఒకటి పొందుతూ ఉంటుంది. మానవరూపం వచ్చినాక ఆత్మకు సంపూర్ణ చైతన్యం కలుగుతుంది. అలా కలగటంతో ఆత్మ చేసే మొదటి ప్రయాణం ముగుస్తుంది. ఈ ప్రయాణాన్ని అధోముఖ ప్రయాణం అంటారు. అయితే ఈ ప్రయాణంలో ఆత్మకు సంస్కారాలు ఏర్పడి ఏ సంస్కారాలైతే తన చైతన్య పరిణామానికి దోహదపడ్డాయో ఆ సంస్కారాలే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆత్మ తనను తాను తెలుసుకోవడానికి ఆటంకంగా అడ్డు తెరలుగా నిలుస్తవి. ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికి ఆత్మ తదుపరి ప్రయాణం చేస్తుంది. అదే పునర్జన్మ. జీవాత్మ కచ్చితంగా ఎనభై నాలుగు లక్షల సార్లు మానవ రూపంలో పుడుతది. కొన్నిసార్లు స్త్రీగా, మరికొన్నిసార్లు పురుషుడుగా, అన్ని జాతుల్లో అన్ని దేశాల్లో. పరిణామ దశలో సంస్కారాలు బలపడి గట్టి బంధంగా ఏర్పడుతవి. పునర్జన్మ దశలో ఆ సంస్కారాలు బలహీనపడి వదులు అవుతవి. అనేక జన్మలు కలగటం వల్ల పేరుకు పోయిన వివిధ రకాల సంస్కారాలు అన్నింటిని అనుభవించటానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవైపు ఉన్న సంస్కారాలు అనుభవించడం ద్వారా ఖర్చు అవుతుంటే మరోవైపు కొత్త సంస్కారాలు ఏర్పడుతుంటవి. ఇలా కొత్తగా ఏర్పడిన సంస్కారాల్ని అనుభవించటానికి మళ్లీ జన్మ ఎత్త వలసి వస్తుంది. ఈ విధంగా జన్మ పరంపర కొనసాగుతూ ప్రాపంచిక విషయాలు ఎందుకూ కొరగానివని ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పుడు ఆత్మ తన జీవితలక్ష్యం చేరుకోవటానికి మూడో దశలోకి అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. జీవాత్మ చేసే చివరి ప్రయాణం ఇదే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భగవంతుని ప్రత్యక్ష అనుభూతి, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవి తాను వేరు, భగవంతుడు వేరు అనికాక తాను, భగవంతుడు ఒక్కటే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అన్ని బంధనాల నుండి విముక్తుడవుతాడు. అలా విముక్తి చెందినవారిలో నుండి కొందరు సద్గురువులుగా ఉంటూ అజ్ఞానంలో ఉన్న వారికి సరైన తోవ చూపిస్తుంటారు. అధర్మం పెచ్చు మీరినప్పుడు వారు భగవంతుని ఒప్పించి భూమ్మీదకు మానవునిగా అవతరింప జేస్తారు. సంగ్రహంగా గాడ్స్పీక్స్లో ఉన్న విషయం ఇదీ. గ్రంథం పూర్తిగా చదివిన తర్వాత నిజంగానే భగవద్వాణి విన్న అనుభూతి కలుగుతుంది. - దీవి సుబ్బారావు -
ఆత్మ శాశ్వతం
అతిగహనమైన తాత్విక విషయాలను కూడా ఎంతో సుందరంగా కవితాత్మకంగా కథా రూపంలో చెప్పిన ఉపనిషత్తు కఠోపనిషత్. ఆ కథ ఇలా వుంటుంది. వాజస్రవసుడి కొడుకు నచికేతుడు. తండ్రి యజ్ఞంలో వట్టిపోయిన ముసలి ఆవుల్ని దానంగా ఇవ్వటం చూసి నచికేతుడు తండ్రిని నన్నెవరికి ఇస్తావని అడుగుతాడు. దీంతో కోపగించుకున్న తండ్రి ‘నిన్ను మృత్యువుకిస్తాను’ అంటాడు. నచికేతుడు మృత్యుదేవత అయిన యముడు ఇంటికి వెళతాడు. అప్పుడక్కడ యముడు లేడు. మూడు రోజులు ఏమీ తినకుండా నచికేతుడు వేచి వున్నాడు. ఆ తరువాత యముడు వచ్చి మూన్నాళ్ళు నిరాహారంగా వేచి వున్నందుకు పరిహారంగా మూడు వరాలు కోరుకొమ్మంటాడు. మొదటి వరంగా తనను తిరిగి తండ్రి వద్దకు పంపించమంటాడు. యముడు సరే అంటాడు. రెండో వరంగా స్వర్గప్రాప్తిని కలుగజేసే యజ్ఞాన్ని ఉపదేశించమంటాడు నచికేతుడు. యముడు ఉపదేశిస్తాడు. నచికేతుడు ఆ యజ్ఞకర్మను శ్రద్ధగా ఆకళింపు జేసుకొని అలాగే తిరిగి దాన్ని యముడికి ఒప్పజెప్పుతాడు. యముడు సంతోషించి ఆ యజ్ఞం నచికేతుడి పేరు మీద ప్రసిద్ధమవుతుందని అదనంగా వరం ఇస్తాడు. ‘మనిషి చనిపోయాక ఏమవుతాడు? ఆత్మ అనేది వున్నదా?లేదా?’ అంటూ మూడో వరంగా నచికేతుడు అడుగుతాడు. ‘దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వేరే వరం కోరుకో. దీనికి బదులు ధనాన్ని, అధికారాన్ని, అన్ని రకాల సుఖాల్ని ఇస్తాను’ అంటాడు యముడు. ‘ఇవన్నీ క్షణికాలే. అవి నాకొద్దు. నేను అడిగిన మరణం తర్వాత వుండే జీవితం గురించి చెప్పు’ అంటాడు నచికేతుడు. యముడు సంతోషించి నచికేతుడు అడిగిన ఆ మూడో వరాన్ని కూడా తీర్చుతాడు. మృత్యువు తరువాత వుండే పరమ జీవితం, ఆత్మ, పరబ్రహ్మము గురించి యముడు నచికేతుడికి ఉపదేశించటంతో ఉపనిషత్తు ముగుస్తుంది. ఉపనిషత్కథ చిన్నదే అయినా అందులో శాశ్వత సత్యాలైన వేదాంత భావనలను ఎన్నింటినో పరమ రమణీయంగా చెప్పటం జరిగింది. లోకంలో రెండు మార్గాలున్నాయి. ఒకటి శ్రేయో మార్గం. రెండు ప్రేమో మార్గం. వాటి గమ్యాలు వేరు. శ్రేయోమార్గం శ్రేయస్కరమైనది. ప్రేమోమార్గం అంతిమంగా దుఃఖకరమైనది. బుద్ధిమంతుడు శ్రేయోమార్గాన్ని ఎన్నుకొని ముక్తిని పొందుతాడు. బుద్ధిహీనుడు ప్రేమోమార్గాన్ని ఎన్నుకొని పతనమవుతాడు. లోకంలో చాలా మంది ఆత్మ గురించి వినివుం డరు. విన్నవాళ్లకు అది ఏమిటో అర్థం కాదు. అలాం టప్పుడు దానిని గురించి ఉపదేశించే వాడు నిజంగా అద్భుతమైన వాడు అవుతాడు. ఉపదేశం పొందిన శిష్యుడూ అలాంటి అద్భుతమైన వాడే అవుతాడు. ఆత్మజ్ఞానం చర్చల వల్ల, తర్కం వల్ల పొందేది కాదు. ఆత్మ జ్ఞానం కలవాడు మాత్రమే దాన్ని బోధించటానికి అర్హుడు. సత్యనిష్ట కలవాడు మాత్రమే దాన్ని నేర్చుకోవటానికి అర్హుడు. ఆత్మకు చావూ లేదు, పుట్టుకా లేదు. శరీరం నశించినా, ఆత్మ నాశనం కాదు. ఆత్మ నిత్యం, శాశ్వతం, సనాతనం. చెడునడత మానుకోని వారూ, తనను తాను అదుపులో వుంచుకోలేని వారూ, ఏకాగ్రత లేని వారూ, మనస్సులో శాంతి లేని వారూ, ఎంత పాండిత్యం వున్నా ఆత్మజ్ఞానం పొందటానికి అనర్హులు. శరీరం రథం. ఆత్మ యజమాని. బుద్ధి సార థి. మనస్సు కళ్లెం. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియ విషయాలు అవి వెళ్లే మార్గాలు. (అజ్ఞానం అనే నిద్ర నుండి) లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠులైన వారి దగ్గర జేరి ఆత్మజ్ఞానం పొందండి. కఠోపనిషత్తులోని శ్లోకాలు కొన్ని కొద్ది కొద్ది మార్పులతో భగవద్గీతలో ఉండటం గమనించవచ్చు. - దీవి సుబ్బారావు -
ధర్మం, సత్యం శాశ్వతం
‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతాలు. అయితే, ఒక్కోకప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి. పాండవుల వనవాసం, అజ్ఞాతవాసం ముగిసింది. మాట ప్రకారం తమకు రావలసిన అర్ధరాజ్యం తమకు ఎలానూ వస్తుందనే ధైర్యంతో ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. అది సంపాదించుకోవటానికిముందుగా తమకిష్టమైన కృష్ణుణ్ణి కౌరవుల వద్దకు రాయబారం పంపుతారు. ఆ పని నెరవేర్చటం కోసం కృష్ణుడు, ధృతరాష్ట్రుడు కొలువు తీరి ఉన్న సభకు వచ్చి, పాండవులు తనతో ఏమి చెప్పి పంపించారో, దాన్ని మంచి మాటల్తో చెబుతాడు. అలా చెబుతూ మధ్యలో అంటాడు. ‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతా లు. అయితే, ఒక్కొక్కప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి. సమర్థులైనవాళ్లు ఎవరైతే ఉన్నారో, వాళ్లు తమకేమీ పట్టనట్టు ఉంటే, ఆ కీడు వాళ్లకుగాని, ధర్మానికి, సత్యానికి ముప్పు వాటిల్లదు. అవి ఎప్పుడూ దృఢంగా నిలిచే ఉంటాయి. వాటిని ఎవ్వరూ కదల్చలేరు. ఎందుకంటే ఈ రెంటినీ రక్షిస్తూ భగవంతుడున్నాడు. ఎవరు అడ్డుపడినా, ఆ భగవంతుడే ధర్మాన్ని ఒడ్డుకు చేరుస్తాడు. సత్యానికి శుభం కలుగజేస్తాడు! అట్లా శ్రీకృష్ణుడు చెబుతుండగా, కౌరవ పెద్దలందరూ సభలో ఉన్నారు. ముఖ్యంగా భీష్ముడు, ద్రోణుడు వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని కాపాడటంలో సమర్థులు. ఆ కాపాడటమనే బాధ్యతను వాళ్లు తీసుకోవాలి. లేకపోయినట్లయితే, వాళ్లకు చేటు మూడుతుంది గాని, ధర్మానికి, సత్యానికి కాదు. ఇంతటి భావాన్ని ఇముడ్చుకున్న పద్యం, తిక్కన భారతం ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసం లో ఉన్నది. ‘‘సారపు ధర్మమున్ విమల సత్యము...’’తో మొదలవుతుంది. ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. ధర్మం, సత్యం గొప్పదనం గురించి భారతం లో చాలా చోట్ల వినవస్తుంది. ధర్మము, సత్యము అనే ఈ రెండే భారతమనే బండినడవటానికి రెం డుచక్రాలుగా ఉపయోగపడ్డాయని పెద్దలంటారు. - దీవి సుబ్బారావు