‘సహకార’ పద్ధతి సరికాదు
ఎంపీ కవిత వ్యాఖ్యలు అర్థరహితం
బోధన్:
నిజాంషుగర్స్‌ను సహకార పద్ధతిలో నడపాలనే ఆలోచనును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఫ్యాక్టరీ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నడుపుతుందని, పూర్వవైభవం తెస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రక్షణ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ భవిష్యత్‌పై ఎంపీ కవిత ఇటీవల చేసిన ప్రకటన అర్థరహితమన్నారు. రైతులు ముందుకు వస్తే సహకారపద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుతామని ఎంపీ ప్రకటించడం సమస్యను పక్కదారిపట్టించే విధంగా ఉందన్నారు. సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడపలేమని రైతులు, ప్రజాసంఘాలు, రక్షణ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా మళ్లీ పాతపాటపాడటం సరికాదన్నారు. ప్రైవేట్ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించినా ప్రజాప్రతినిధులు మౌనం వహించారన్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను ఇంటికి పంపిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని, మొండివైఖరితో వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పీ వరదయ్య, బీ మల్లేశ్, ఎన్ హన్మంత్‌రావు, శంకర్‌గౌ పాల్గొన్నారు.
హామీ ఏమైంది..?
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని నడుపుతామని ఇచ్చిన వాగ్ధానం ఏమైందని ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ జీ నడ్పిభూమయ్య అన్నారు. పట్టణంలోని నీటిపారుదలశాఖ విశ్రాంతిభవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడపాలని ఎంపీ కవిత ప్రకటించడం వెనుక ప్రభుత్వానిది మరో ఆలోచన అని, ఫ్యాక్టరీని సహకారంగంలోకి నెట్టి చేతులు దులుపుకుందామని యోచిస్తోందన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సహకార రంగంలో కొనసాగుతున్న ఫ్యాక్టరీలు నష్టాలో కూరుకుపోయాయన్నారు. మన జిల్లాలోని సారంగాపూర్ ఫ్యాక్టరీ మూతపడిందని, వీటి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రకటనలు చేయడం తగదన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ ఎల్ చిన్న పర్వయ్య, ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.