సోనీకి వినియోగదారుల ఫోరం మొట్టికాయ
ఢిల్లీ : సోనీ ఇండియాకు ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల ఫోరం మొట్టికాయ వేసింది. సోనీ ఇచ్చిన ప్రకటనల్లో వాటర్ ప్రూఫ్‌గా పేర్కొంటూ విడుదల చేసిన ఓ ఖరీదైన ఫోన్‌ను వినియోగదారుడు కొనుగోలు చేశాడు. తీరా ఆ ఫోన్ వర్షపు నీటిలో తడిచి పాడవ్వడంతో స్థానిక సర్వీసింగ్ సెంటర్‌కి వెళితే డబ్బు చెల్లిస్తేనే రిపేర్ చేస్తామంటూ తెలపడంతో సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. విచారణ అనంతరం సోనీ ఇండియా, సర్వీసింగ్ సెంటర్ వినియోగదారుడికి సేవలు అందిచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వినియోగదారుల ఫోరం పేర్కొంది.
వివరాలు.. పశ్చిమ ఢిల్లీకి చెందిన ధన్‌రాజ్ సోనీ ఇచ్చిన వాటర్ ప్రూఫ్ మొబైల్ ప్రకటనను చూసి రూ.35,000తో ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే వర్షం నీటిలో తడవడంతో ఫోన్ పని చేయడం ఆగిపోయింది. దీంతో దగ్గర్లోని షోరూంకు వెళ్లి సర్వీస్ చేయవలసిందిగా కోరగా, సోనీ నియమ నిబంధనల ప్రకారం ఫ్రీ సర్వీస్ వారంటీలోకి సంబంధిత రిపేర్ రాదని, రిపేర్ చేయాంటే డబ్బు చెల్లించాలని స్పష్టం చేశారు. కంగుతిన్న ధన్‌రాజ్ వినియోగ దారుల ఫోరంను ఆశ్రయించాడు.
తప్పుడు ప్రకటనలతో సోనీ కంపెనీ తనను మోసం చేసిందని ధన్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ధన్ రాజ్ సోనీ ఇచ్చిన వాటర్ ప్రూఫ్ ప్రకటనను కూడా ఫిర్యాదులో జత చేశాడు. ఆ వీడియో ప్రకటనలో ఫోన్‌కు సంబంధించి అన్ని భాగాలు సవ్యంగా మూసి ఉంటే 1.5 మీటర్ల లొతున్న నీటిలో పడి దాదాపు 30 నిమిషాలపాటూ ఉన్నా కూడా మొబైల్ ఫోన్‌కు ఏమీకాదు అని ఉంది.
అయితే వినియోగదారుడు నిర్లక్ష్యంగా మొబైల్‌ను వాడటం వల్లే పాడైందని సోనీ, సర్వీస్ సెంటర్ వివరణ ఇచ్చాయి. కస్టమర్‌కు తగిన సేవలను అందిచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వినియోగ దారుల ఫోరం తెలిపింది. పూర్తి మొబైల్ ధర(రూ.35000)తో పాటూ, నష్టపరిహారం కింద మరో వేయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలని సోనీ కంపెనీ, సర్సీస్ సెంటర్‌ను ఆదేశించింది.