ఎల్జీతో కేజ్రీవాల్ భేటీ
ఢిల్లీ ఏసీబీ పనితీరుపై చర్చ
* అసెంబ్లీ ప్రత్యేక భేటీ అజెండాపై వివరణ
* కేంద్రం నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో సమావేశమయ్యారు. 20 నిమిషాలపాటు సాగిన వీరి భేటీలో.. ఢిల్లీ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) పనితీరుపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఢిల్లీ పోలీసు సిబ్బందిపై దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకి ఉంటుందంటూ ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చిన మరుసటి రోజే వీరి భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ఆప్ సర్కారుకు మధ్య వివాదం మొదలైన తర్వాత కేజ్రీవాల్.. ఎల్జీతో సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేకే శర్మ పాల్గొన్నారు. రెండ్రోజుల అసెంబ్లీ సమావేశాల ఎజెండాను సీఎం ల్జీకి వివరించినట్లు తెలిసింది. సమర్థ పాలన అందించేందుకు కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఎల్జీ.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శకుంతల గామ్లిన్‌ను నియమించడం, దాన్ని సీఎం తీవ్రంగా వ్యతిరేకించడం, ఇద్దరి మధ్య లేఖల యుద్ధం కొనసాగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ఎల్జీయే సర్వాధికారి అంటూ ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
అధికారాలను హరించేందుకే నోటిఫికేషన్
కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ రెండ్రోజుల ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం సిసోడియా.. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నోటిఫికేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇది ప్రజలు గెలిపించిన ప్రభుత్వ అధికారాలను హరించే ప్రయత్నమని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం లేనందు వల్ల అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదనడాన్ని తప్పుపట్టారు. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్‌ను అభిశంసించే అధికారాన్ని ఢిల్లీ అసెంబ్లీకి కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలంటూ ఆప్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.