అందుబాటులోకి మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
న్యూఢిల్లీ: నగరంలో మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేయనున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఈ ఏడాది నవంబర్ చివరికల్లా ఉత్తర ఢిల్లీలోని బురారీ, దక్షిణఢిల్లీలోని అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.రెండు ఆస్పత్రులూ 200 పడకల సామర్థ్యం కలిగి ఉన్నవేనని వారు చెప్పారు. వీటిలో న్యూరాలజీ, గైనకాలజీ, చిన్నారులకు సంబంధించి ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
కొన్ని కారణాల ఈ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం జరిగినా, ప్రస్తుతం పనులను వేగిరవంతం చేశామన్నారు. మరో మూడు నెలల్లో నిర్మాణ పనులుపూర్తయిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్), సబ్దర్‌జంగ్ ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడిని తగ్గించేందుకు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకాలో రూ. 570 కోట్ల అంచనా వ్యయంతో 700 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు.
ఈ ఆస్పత్రి కూడా మరో ఏడాదిలో రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి భారతరత్న ఇందిరాగాంధీ ఆస్పత్రిగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటుచేయనున్నామన్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ ప్రభుత్వ ం కింద పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా లాల్‌బహదూర్ శాస్త్రి ఆస్పత్రి, లోక్‌నాయక్ ఆస్పత్రులకు చెరో 45 డయాలసిస్ యంత్రాలు మంజూరయ్యాయని ఆయన వివరించారు.