Delhi metropolitan court
-
రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. అతని కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. -
పోలీసు కస్టడీకి సింగ్ సోదరులు
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)ను రూ. 2,397 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. ‘ఈ కేసులో పెద్ద ఎత్తున నగదును పక్కదోవ పట్టింది. స్వభావరీత్యా ఈ నేరం చాలా తీవ్రమైనది’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పక్కదోవ పట్టిన నిధుల ఆచూకీ తెలుసుకోవడానికి, ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన వారిని పట్టుకోవడానికి నిందితుల పోలీసు కస్టడీ అవసరమని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ పేర్కొన్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ శివీందర్ సింగ్ ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై పోలీసులు, కేంద్రానికి నోటీసులు ఇచ్చే విషయంపై ఉత్తర్వులను కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. -
‘ఆప్’ ఎమ్మెల్యేకు జైలుశిక్ష
న్యూఢిల్లీ : ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌దత్‌కు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ. రెండు లక్షల జరిమానా విధించింది. సోమ్‌దత్ ప్రస్తుతం పాత ఢిల్లీలోని సదర్ బజార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వారంలోనే మరో ఆప్ ఎమ్మెల్యే జైలుకి వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినందుకు కొండ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నెల జూన్ 29న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్.. సోమ్దత్ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. శిక్షను సవాల్ చేయడానికి సోమ్‌దత్‌కు మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు జనవరి 2015 నాటిది. అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సోమ్‌దత్ తనపై దాడి చేసినట్లు సంజీవ్ రానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రానా తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్‌దత్ తన అనుచరులు 50-60 మందితో కలిసి తన ఫ్లాట్‌కు వచ్చి పదే పదే బెల్ కొట్టారని ఆరోపించారు. ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించినందుకు తనను బయటకి లాగి బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సునీల్ ఎమ్మెల్యే సోమ్‌దత్ బేస్‌బాల్ బ్యాట్‌తో రానాపై దాడి చేయడం నిజమేనని కోర్టుకు తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్ దక్కకుండా దెబ్బ తీసేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతుందని, అందుకు రానాను పావులా వాడుకున్నారని సోమ్‌దత్ కోర్టుకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సోమ్‌దత్ ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో ఆయన జైలు శిక్ష విధించినట్టు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. -
పచౌరీపై అభియోగాలు మోపండి
న్యూఢిల్లీ: టెరీ (భారత్‌లో విద్యుత్, పర్యావరణం, సహజ వనరులపై పరిశోధనలు చేసే సంస్థ) మాజీ చీఫ్ ఆర్కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అభియోగాలు మోపాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యంగా వ్యవహరించడం), 354 (ఏ) (శారీరకంగా తాకేందుకు ప్రయత్నించడం), 509 (వేధించడం, అసభ్య పదజాలం, అసభ్య చేష్టలకు పాల్పడటం) కింద అభియోగాలు నమోదు చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చారు గుప్తా ఆదేశించారు. 2015, ఫిబ్రవరి 13న టెరీ మాజీ ఉద్యోగి ఒకరు తనతో పచౌరీ అసభ్యంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మార్చి 21న పచౌరీకి ముందస్తు బెయిల్ మంజూరైంది. 2016 మార్చి 1న ఢిల్లీ పోలీసులు 1,400 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. -
శశిథరూర్‌పై చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై చార్జిషీట్ నమోదైంది. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్యకు థరూర్ ప్రేరేపించారని అందులో ఆరోపించారు. ఈ మేరకు 3 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో శశిథరూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని చార్జ్‌షీట్‌లో కోర్టుకు తెలిపారు. కేసులో థరూర్‌ను ఏకైక నిందితుడిగా పేర్కొంటూ.. అతనిపై చట్టపరంగా ముందుకెళ్లేందుకు తగిన ఆధారాలున్నాయన్నారు. తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతున్న శశి థరూర్‌కు సమన్లు జారీచేయాలని కోర్టును పోలీసులు కోరారు. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ ముందు దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌పై మే 24న విచారణ జరగనుంది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో సునంద శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐపీసీ 498 ఏ(గృహ హింస), 306(ఆత్మహత్యకు పురికొల్పడం)సెక్షన్ల కింద శశిథరూర్‌పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ అర్థరహితమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని శశిథరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. -
స్మృతి డిగ్రీ రికార్డులు తీసుకురండి: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులు తీసుకురావాలంటూ.. ఎన్నికల సంఘం, ఢిల్లీ యూనివర్సిటీలను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. మంత్రి తన విద్యాభ్యాసంపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ.. దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. -
కేజ్రీవాల్‌పై కేసు ఏప్రిల్ 9కి వాయిదా
న్యూఢిల్లీ: ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నమోదైన కేసు తీర్పును ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ‘బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం ఆప్కే వేయండి’ అని జనవరి 18న ఉత్తమ్ నగర్, జనవరి 22న కృష్ణా నగర్ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే కేసుపై మరో అడ్వకేట్ ఇక్రాంత్ శర్మ పెట్టిన కేసుపై నమోదు చేసిన వివరాలను సమర్పించాలని కోర్టు ఢిల్లీ పోలీసుల్ని కోరింది. ఆప్ చీఫ్‌ను తనవ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చింది.