పైన రైలు.. కింద రైమ్‌లు
ఫుట్‌పాత్‌ల మీద సంతలు! సంతల్లో బడి! బడిలో పంచాయతీలు! పంచాయతీల్లో ప్రాథమిక ఆసుపత్రులు! ఇదీ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా! అద్భుతమైన, నమ్మశక్యం కాని భారతదేశం. వ్యంగ్యంగానే అనిపించి ఉండొచ్చు మీకిది. అయితే రాజేష్ శర్మ లాంటి వాళ్లు నిజంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా అనిపించేలా చేస్తున్నారు.
రాజేష్ శర్మ ఢిల్లీలో ఉంటాడు. ఆ మహానగరంలోని వలస జనాభాకు మెట్రో బ్రిడ్జీల కింది ప్రదేశాలు కూడా నివాసాలే. అలా మెట్రో పిల్లర్స్ కింద వీధుల్లో ఉంటున్న పిల్లలను అప్పుడప్పుడూ పలకరిస్తూ వాళ్లకు చాక్లెట్లో, బట్టలో కొనిస్తూ ఉండేవాడు రాజేష్. అతనెప్పుడు వెళ్లినా ఆ పిల్లలంతా చదువూసంధ్య లేక ఆడుకుంటూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కనిపించేవారు. ఆ పిల్లల కోసం ఏదో తెస్తున్నాడు. ‘అయితే అది కరెక్ట్ కాదేమో! ఆ పిల్లల జీవితాలకు ఉపయోగపడేది ఏదైనా చేయాలి. అది కరెక్ట్’ అనుకున్నాడు. ఒకరోజు వెళ్లి వాళ్ల రోజూవారీ కార్యక్రమాల గురించి ఆరా తీశాడు ఆ పిల్లల దగ్గరే. చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. తల్లిదండ్రులకు పని ఉన్న రోజు వాళ్లకు తిండి దొరుకుతుంది.. లేదంటే పస్తులే. అవసరమనుకుంటే ఆ పిల్లలూ చిన్నాచితకా పనులకు వెళ్లి చిల్లర తేవాల్సిందే. అది తెలిసి ఆయనకు బాధ కలిగించింది. ఆ పిల్లలకు చదువు లేదు. చదువు చెబితే జీవితం చక్కబడుతుంది అనిపించింది. ఆ పిల్లల్లో పెద్దగా ఆసక్తి కనపడలేదు. అయినా తెల్లవారి నుంచే తన ప్రయత్నం మొదలుపెట్టాడు.
ఊడ్చుకుని.. తుడ్చుకుని
ఉద్యోగం అయిపోగానే సాయంత్రం సరాసరి ఆ పిల్లలుండే మెట్రో రైల్వే బ్రిడ్జికిందికి వచ్చాడు రాజేశ్. అతను రాగానే పిల్లలందరూ మూగారు.. చాక్లెట్లు, బట్టలకోసం. ఇచ్చాడు. తీసుకొని వెళ్లిపోయారు. అయినా అతను అక్కడే ఉండి.. ఓ చోటు చూసి.. దాన్ని ఊడ్చి, తుడిచి శుభ్రం చేశాడు. రైమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలంతా తమాషా చూస్తున్నట్టుగా నవ్వసాగారు. గేలి చేశారు. పట్టించుకోకుండా ఓ గంట అలాగే ఇంగ్లిష్, హిందీ పద్యాలు చెప్పి వెళ్లిపోయాడు. రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. వారం రోజులకు ఆ పిల్లల్లో ఒకరిద్దరు అమ్మాయిలు వచ్చి బుద్ధిగా కూర్చుని ఆయన చెప్పేది వినడం మొదలుపెట్టారు. తెల్లవారికి ఇంకొంతమంది పిల్లలు చేరారు. రాజేష్‌లో ఉత్సాహం పెరిగింది. ఇంకో వారం గడిచేసరికి ఆ బ్రిడ్జి కిందున్న పిల్లలంతా చేరారు. పుస్తకాలు, నోట్‌బుక్స్ తెచ్చాడు. పెన్సిళ్లు, పెన్నులు, పలకలు, బలపాలూ ఇచ్చాడు. సీరియస్‌గానే చదువు సాగింది.
రైల్వే బోర్డ్.. బ్లాక్ బోర్డ్
రాజేష్ చేస్తున్న పని ఢిల్లీ మెట్రో రైల్వే సిబ్బంది దృష్టికీ వచ్చింది. ముచ్చట పడి.. ఆ బ్రిడ్జి కింద బ్లాక్‌బోర్డ్‌ను అమర్చింది. ఆ సహాయంతో రాజేష్ తన ఇతర స్నేహితులనూ కలుపుకొని లెక్కలు, సైన్స్‌కూడా బోధిస్తున్నాడిప్పుడు. అంతేకాదు.. ఢిల్లీలోని యువతకూ సందేశమిచ్చాడు.. తమ ఖాళీ సమయాల్లో తమకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని మెట్రో బ్రిడ్జీల కింద వీధి బాలలకు చదువు చెప్పాలని. మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ఇది ఓ ఉద్యమంలా మొదలైంది. ‘‘నా ఈ చిన్న ప్రయత్నం ఇంత మంచి కార్యక్రమంగా మారుతుందని కలలలో కూడా ఊహించలేదు. మెట్రో వాళ్లు ఆబ్జెక్షన్ చెప్తారేమోనని చాలా కాలం భయంభయంగానే.. క్లాసులు చెప్పా. కాని బ్లాక్‌బోర్డ్ పెట్టి వాళ్లు నన్ను ప్రోత్సహించారు. థ్యాంక్స్ టు ఢిల్లీ మెట్రో’’ అంటూ కృతజ్ఞతలు చెప్తాడు రాజేష్ శర్మ. ఆయన్నుంచి మనం నేర్చుకోవలసింది నేర్చుకుంటే, మనం నేర్పవలసింది నేర్పుతాం.
– శరాది