Delhi Test
-
క్రికెట్ చరిత్రలో ఇద్దరే ఇద్దరు, అందులో మన వాడు.. ఆ చారిత్రక ఘట్టానికి 24 ఏళ్లు
Anil Kumble 10 Wickets Haul Vs Pakistan: క్రికెట్ చరిత్రలో ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1999వ సంవత్సరంలో ఈ తేదీన ఢిల్లీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (10/74) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. 1956లో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత (10/53) సాధించగా, ఆ ఘనతను తిరిగి 43 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే రెండో సారి నమోదు చేశాడు. కుంబ్లే సాధించిన ఈ ఘనతకు నేటితో 23 పూర్తై 24 ఏళ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కుంబ్లే చారిత్రక ప్రదర్శనను నేటి దినాన క్రికెట్ అభిమానులు స్మరించుకుంటున్నారు. కుంబ్లే నమోదు చేసిన గణాంకాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ జనరేషన్ అభిమానులైతే 10కి 10 వికెట్లు తీయడం ఎలా సాధ్యపడిందని చర్చించుకుంటున్నారు. 2⃣6⃣.3⃣ Overs 9⃣ Maidens 7⃣4⃣ Runs 1⃣0⃣ Wickets 🗓️ #OnThisDay in 1999, #TeamIndia legend @anilkumble1074 etched his name in record books, becoming the first Indian cricketer to scalp 1⃣0⃣ wickets in a Test innings 🔝 👏 Revisit that special feat 🔽 pic.twitter.com/wAPK7YBRyi — BCCI (@BCCI) February 7, 2023 నాటి మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. సదగోపన్ రమేశ్ (60), మహ్మద్ అజహారుద్దీన్ (67) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే (4/75), హర్భజన్ సింగ్ (3/30) ధాటికి 172 పరుగులకే ఆలౌటైంది. షాహిద్ అఫ్రిది (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటై పాక్‌కు 420 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. ఈ ఇన్నింగ్స్‌లోనే కుంబ్లే మ్యాజిక్ చేశాడు. 101 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోని పాక్‌ను కుంబ్లే ఒక్కడే 207 పరుగులకు ఆలౌట్ చేశాడు. ఈ చారిత్రక ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. -
శభాష్ డిసిల్వా.. లంక క్రికెటర్‌కు కోహ్లీ, రోహిత్ కంగ్రాట్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వా శతకం సాధించాడు. షమీ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి 188 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో సెంచరీ మార్కు చేరుకున్నాడు. ధనంజయ కెరీర్లో ఇది మూడో టెస్ట్ శతకం. 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కాగా, కష్ట సమయంలో జట్టును ఆదుకున్న డిసిల్వాను లంకేయులతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అభినందించారు. టెస్ట్ చివరిరోజు తొలి సెషన్, లేక రెండో సెషన్లోనే టీమిండియా బౌలర్లు లంకను చాప చుట్టేస్తారనుకుంటే లంక కెప్టెన్ చండిమాల్ (36) సాయంతో డిసిల్వా స్కోరు బోర్డుకు పరుగులు జోడించాడు. చండిమాల్ ఔటయ్యాక రోషన్ డిసిల్వా వికెట్ పడకుండా సహకరించడంతో ధనంజయ అజేయ శతకంతో మెరిశాడు. సెంచరీ అనంతరం 110 పరుగుల వద్ద ధనంజయకు లైఫ్ లభించడంతో లంకేయులు ఊపిరి పీల్చుకున్నారు. 69వ ఓవర్ రెండో బంతిని ధనంజయ ఆడగా.. గాల్లోకి లేచిన బంతి అశ్విన్ చేతుల్లో పడినట్లే అనిపించినా క్యాచ్ చేజారింది. ధనంజయ డిసిల్వా (210 బంతుల్లో 119 రిటైర్డ్ హర్ట్: 15 ఫోర్లు, 1 సిక్స్). ప్రస్తుతం రోషన్ డిసిల్వా (25), డిక్వెల్లా(0) క్రీజులో ఉన్నారు. 74 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌లో లంక స్కోరు 206/5. భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 246/5 డిక్లేర్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 ఆలౌట్ -
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. లంక కెప్టెన్ చండిమాల్ (36) అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరో వైపు డిసిల్వా(90) సెంచరీ చెరువలో ఉన్నాడు. క్రీజులోకి వచ్చిన రోషన్ సిల్వాతో డిసిల్వా ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత లంక స్కోర్ 147/5. -
చండిమాల్‌కు లైఫ్..డిసిల్వా హాఫ్ సెంచరీ..
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ డిసిల్వా అర్ధశతకం చేయగా.. చండిమాల్‌కు లైఫ్ దొరికింది. జడేజా వేసిన 43 ఓవర్ మూడో బంతికి చండిమాల్ క్లీన్‌బౌల్డ్ కాగా రిప్లయ్‌లో నోబాల్ కావడంతో లంకకు అదృష్టం కలిసొచ్చింది. ఇక అంతకు ముందు డిసిల్వా 92 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సుతో కెరీర్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించేందుకు డిసిల్వా(72) కెప్టెన్ చండిమాల్(27)లు పోరాడుతున్నారు.45 ఓవర్లలో శ్రీలంక స్కోర్ 119/4. -
నాలుగో వికెట్ పడగొట్టిన బర్త్‌డేబాయ్
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 31/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన లంకను ఆరంభంలోనే బర్త్‌డే బాయ్ రవీంద్ర జడేజా దెబ్బ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన ఏంజెలో మాథ్యూస్(1)ను అద్భుత బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. మాథ్యూస్ బ్యాట్‌కు తగిలిన బంతి స్లిప్ వైపు దూసుకురాగా రహానే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ చండిమాల్‌తో డిసిల్వా(24) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇక (డిసెంబర్ 6) నేడు 29వ బర్త్‌డే జరుపుకుంటున్న జడేజా.. నాలుగో రోజు చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. -
షాకింగ్: ఢిల్లీ టెస్టును నిలిపేయాలని కోరిన లంక క్రికెటర్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు దేశ రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేసిన కాలుష్యం తాజాగా ఢిల్లీ టెస్టుపై కూడా ప్రభావం చూపుతోంది. కాలుష్యం కారణంగా శ్రీలంక ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అయినట్టు కనిపించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ఇద్దరు లంక ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దీంతో రెండోరోజు కొనసాగుతున్న ఆటను అంపైర్లు కాసేపు నిలిపివేశారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులోనూ భారత్ ధాటిగా ఆడుతోంది. భారత్ ధాటిగా ఆడుతున్న సమయంలోనే లంక ఆటగాళ్లు.. కాలుష్య ప్రభావం గురించి అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా లంచ్ తరువాత పలువురు లంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఫీల్డ్‌లోకి దిగారు. కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని, మ్యాచ్‌ను నిలిపివేయాలని పదేపదే అంపైర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో ఇరుజట్ల కోచ్‌లు జోక్యం చేసుకోవడంతో మ్యాచ్ కొంతసేపు కొనసాగింది. ఈ క్రమంలో కొంతసేపు ఆట కొనసాగిన అనంతరం మరోసారి మ్యాచ్ కొనసాగింపుపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తో పాటు అంపైర్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో మ్యాచ్ కాసేపు ఆగింది. అదే సమయంలో కోహ్లి స్టేడియం నుంచి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి వచ్చేయాలంటూ ఫీల్డ్‌లో ఉన్న జడేజా, సాహాలకు సంకేతాలిచ్చాడు. దాంతో భారత్ జట్టు స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు కోహ్లి(243) డబుల్ సెంచరీ సాధించిన తరువాత ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. మబ్బులతో తేమగా వాతావరణం! దేశ రాజధాని ఢిల్లీలో గత నెల తీవ్ర కాలుష్య సమస్య నెలకొన్న సంగతి తెలిసిందే. గత నెలతో పోలిస్తే.. ఈ నెలలో కాలుష్యం తక్కువగానే ఉంది. గత ఏడాదితో పోల్చుకున్నా నగరంలో వాతావరణం మెరుగ్గా ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే, ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మబ్బులుపట్టి.. వాతావరణం కొంత స్తబ్దుగా ఉంది. గాలిలో వేగం కూడా లేకపోవడంతో ఆ ప్రభావం మ్యాచ్‌పై పడి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్ ఎయిర్ క్వాలిటీ ఉందంటూ లంక ఆటగాళ్ల ఫిర్యాదుపై ప్రస్తుతం అంపైర్లు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై ఇన్నింగ్స్ ఆరంభించిన లంక జట్టు తొలి బంతికి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మొహ్మద్ షమీ వేసిన బంతికి కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. -
ఢిల్లీ టెస్టు మ్యాచ్ పై నివేదిక సిద్ధం!
న్యూఢిల్లీ: గత ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అనేక వివాదాల నడుమ జరిగిన టెస్టు మ్యాచ్ కు సంబంధించి నివేదిక సిద్ధమైంది. దీనిపై ఏర్పాటైన రిటైర్డ్ జస్టిస్ ముద్గల్ నేతృత్వంలోని పరిశీలన కమిటీ తన పూర్తి నివేదికను త్వరలో హైకోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ టెస్టు మ్యాచ్ నిర్వహణపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈనెల 18వ తేదీన కోర్టుకు ఇవ్వనున్నట్లు ముద్గల్ మీడియాకు తెలిపారు. గతంలో ఢిల్లీ టెస్టు మ్యాచ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి-డీడీసీఏల మధ్య చోటు చేసుకోవడంతో ఆ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు చేరిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీసీఏ వినోదపు పన్ను చెల్లించని కారణంగా దానిపై దర్యాప్తుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.24.45 కోట్లు చెల్లించాలని వివాదానికి తెరలేపారు. ఒకవేళ కానిపక్షంలో ఢిల్లీలో జరగాల్సిన టెస్టు మ్యాచ్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వబోమని హెచ్చరించారు. దీంతో డీడీసీఏ హైకోర్టుకు వెళ్లడంతో మ్యాచ్ నిర్వహణను అడ్డుకోవద్దని ప్రభుత్వానికి సృష్టం చేసింది. అందుకు హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలిన హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీనికి డీడీసీఏ అంగీకారం తెలపడంతో టెస్టు మ్యాచ్ కు క్లియరెన్స్ లభించింది. కాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ జస్జిస్ ముద్గల్ నేతృత్వంలో పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ వివాదానికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
నిరుపేద విద్యార్థులకు ఉచిత ప్రవేశం
ఢిల్లీ టెస్టుపై హైకోర్టు న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టును చూసేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ అభ్యర్థనను విచారించిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. అంతకుముందు రోజుకు రూ.10 టిక్కెట్‌తో విద్యార్థులను అనుమతిస్తామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే వారి టిక్కెట్ల ఖరీదును డీడీసీఏనే భరించాలని కోర్టు తెలిపింది. అలాగే కాంప్లిమెంటరీ పాసులను కూడా స్వల్ప మొత్తంలోనే అందించాలని సూచించింది. మ్యాచ్‌ను చూసేందుకు డబ్బులు పెట్టి రాలేని పరిస్థితి ఉందని, పిల్లలతో పాటు వారి టీచర్లను కూడా అనుమతించాలని కోర్టు తెలిపింది. ఈ విషయంలో డీడీసీఏ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయవాది సునీల్ మిట్టల్ తెలిపారు.