అవును .. బోగస్ ఓట్లు ఉన్నాయి...
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఓటరు జాబితాలో బోగస్ ఓటర్లున్నారని, వారిని ఏరివేసేందుకు చర్యలు చేపట్టామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి చంద్రభూషణ్ కుమార్ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. ఢిల్లీలో అనేక వేల మంది బోగస్ ఓటర్లున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు నరేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లు ఎలా చేరారని, వారిని తొలగించేందుకు ఏయే చర్యలు చేపట్టారని ఎన్నికల కమిషన్ను న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్పై తదుపరి విచారణ జనవరి 13న జరపనున్నట్లు కోర్టు ప్రకటించింది.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ సోమవారం ప్రచురించింది, దీనితో నగరంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరపడానికి మార్గం సుగమమైంది. కాగా, ఢిల్లీ విధానసభ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన ఈ వారం వెలువడొచ్చని, నగరంలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. విద్యార్థుల వార్షిక పరీక్షలకు అంతరాయం కలగకుండా ఫిబ్రవరి రెండవ వారంలో జరిగేలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించవచ్చని వారు అంటున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ ఈ నెల 15న పదవీ విరమణ చేస్తారని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే ఆయన ప్రకటించే చివరి ఎన్నికలని అంటున్నారు.
మరోపక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ నగరంలోని మూడు ప్రధాన రాజకీయపార్టీలు తమ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 24 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఈ విషయంలో మిగతా రెండు పార్టీల కన్నా వెనుకబడిఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీద అమర్చిన పోస్టర్లు, హోర్డింగులతో ఆ పార్టీ జోరుగా ప్రచారాన్ని నిర ్వహిస్తోంది. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీకి పోటీనిస్తుండగా కాంగ్రెస్ వెనుకబడిఉంది.
ఢిల్లీలో 1.3 కోట్ల మంది ఓటర్లు
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 1.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కమిషన్ సోమవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. కాగా, ఫిబ్రవరిలో ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికల జరిపే అవకాశముందని తెలిపింది. కాగా కొత్తగా 1,59,854 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరితో మొత్తం ఓటర్ల సంఖ్య 1,30,85,251 కు చేరిందని తెలిపింది. వీరిలో 72,60,633 మంది పురుషులు, 58,24,618 మంది స్త్రీలు ఉన్నారని కమిషన్ పేర్కొంది.