చర్చలు విఫలం: సమ్మెలోనే జీహెచ్ఎంసీ కార్మికులు
హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. బుధవారం రాత్రి కార్మిక సంఘాల ప్రతినిధులతో కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి.
గురువారం నుంచి సమ్మెను మరింత ఉదృతం చేయనున్నట్లు కార్మిక నాయకులు చెప్పారు. గురువారం రాత్రి నుంచి వీధిలైట్ల కార్మికులు.. శుక్రవారం నుంచి జలమండలి కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. డిమాండ్లు ఎప్పటిలోగా నెరవేరుస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని, పైగా కఠిన చర్యలకు దిగుతామని బెదిరింపులకు గురిచేస్తున్నదని కార్మిక సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో చర్చలు జరపాలన్న తమ అభ్యర్థనను కూడా మంత్రులు, అధికారులు పట్టించుకోవడంలేదంది.