దెందులూరు.. ఆధిపత్యపోరు
సాక్షి, దెందులూరు: నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాలతోపాటు ఏలూరు రూరల్ మండంలోని పలు గ్రామాల్లో నియోజకవర్గం విస్తరించింది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి ఉద్దండులైన రాజకీయ నేతలు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఒక్కసారి మాత్రమే దళిత నేత ఎమ్మెల్యేగా చేశారు.
భౌగోళిక స్వరూపం
దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలు న్నాయి. జిల్లా కేంద్రం ఏలూరుకు నాలుగు వైపులా నియోజకవర్గం 280 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఏలూరు రూరల్, దెందులూరు మండలాల్లో 30 కిలోమీటర్ల మేర కొల్లేరుప్రాంతం విస్తరించింది.
ఆనాటి వేంగి నేటి పెదవేగి
పెదవేగికి చారిత్రక నేపథ్యం ఉంది. క్రీస్తుశకం 300 నుంచి 1100 మధ్యలో తూర్పుచాళుక్యుల పాలనలో వేంగిసామ్రాజ్య రాజధానిగా ఈ ప్రాంతం విరా జిల్లింది. దీనికి ఆధారంగా శాసనాలు లభ్యమయ్యాయి. పురావస్తు తవ్వకాల్లోనూ ఆనాటి వస్తువులు కొన్ని లభ్యమయ్యాయి.
ఆధ్యాత్మికంగా ప్రఖ్యాతి
నియోజకవర్గం ఆధ్యాత్మికంగానూ ఖ్యాతిగాంచింది. కొల్లేరు రాట్నాలమ్మ తల్లి ఇక్కడే కొలువైంది. శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. దెందులూరు ఆర్సీఎం చర్చి ప్రసిద్ధిగాంచింది.
జీవన విధానం
నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం. అధిక శాతం వరిసాగవుతోంది. చేపలు, రొయ్యల సాగూ ఉంది. మొక్కజొన్న, ఆయిల్‌పామ్, చెరకు, ఉద్యాన పంటలు, పెసర, మినుము కూడా సాగవుతాయి.
ప్రధాన సమస్య
లక్షా 50వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. సాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కృష్ణాడెల్టాపై ఆధారపడి ఇక్కడ సాగు జరుగుతోంది. ఆరేళ్లుగా కృష్ణా కాలువ ద్వారా నీరు రావడం లేదు. గుర్రపుడెక్క పేరకుపోయింది. ఫలితంగా దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లో 58 వేల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా 58 వేల ఎకరాల్లో రెండో పంటగా అపరాలు సాగు చేస్తున్నారు.
బీసీ, దళిత ఓట్లే కీలకం
నియోజకవర్గ ఓటర్లు రాజకీయంగా చైతన్యవంతులు. అన్ని పార్టీలనూ ఆదరించిన ఘనత వీరి సొంతం. ఇక్కడ దళిత, బీసీ ఓట్లే నిర్ణయాత్మకం. అయినా ఓ వర్గం ఆధిపత్యమే ఇక్కడ కొనసాగుతోంది. దీనిపై నిరంతరం మిగిలిన వర్గాలు పోరాడుతూనే ఉంటాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆరుసార్లు టీడీపీ, మూడుసార్లు కాంగ్రెస్ గెలిచాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఇక్కడ మాగంటిబాబు గెలుపొందారు.
అభివృద్ధికి దూరం
నియోజకవర్గం టీడీపీ హయాంలో అభివృద్ధికి దూరం జరిగింది. అవినీతి, అరాచకాల్లో మాత్రం ముందుంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలు, ఆరాచకాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. టీడీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరాయి. ఫలితంగా చింతమనేనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పుంజుకున్న వైఎస్సార్ సీపీ
గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ పుంజుకుంది. వైఎస్సార్ సీపీ జిల్లా అధికారప్రతినిధి కొఠారు రామచంద్రరావు, ఆయన తనయుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరి నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. దీంతో రాజకీయ, సామాజిక సమీకరణలు మారాయి. దళితులు 80 శాతం మంది, బీసీలు 55 శాతం మంది వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరికే విజయావకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అబ్బయ్య చౌదరి ఉన్నత విద్యావంతుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. పార్టీ కార్యక్రమాలతో నిరంతరం కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలపై అబ్బయ్యచౌదరి ఎప్పటికప్పుడు పోరాడుతున్నారు. దీంతో ప్రజల్లో ఆయనకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. తటస్తులు, స్వచ్ఛంద సేవా సంస్థల నేతలు, సామాజిక కార్యకర్తలూ వైఎస్సార్సీపీకి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
మండలాలు
దెందులూరు, పెదపాడు, పెదవేగి ఏలూరు రూరల్‌లో కొన్ని గ్రామాలు
జనాభా : 2,62,395
పురుషులు 1,31,155
స్త్రీలు 1,31,240
ఓటర్లు : 2,12,258
పురుషులు 1,04,701
స్త్రీలు 1,07,547
ఇతరులు 10
పోలింగ్ కేంద్రాలు : 244
ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు ఇలా..
సంవత్సరం పేరు పార్టీ
1955 ముల్పూరి రంగయ్య సీపీఐ
1962 మొటపర్తి రామ్మోహనరావు కాంగ్రెస్
1967 మొటపర్తి రామ్మోహనరావు కాంగ్రెస్
1972 మొటపర్తి రామ్మోహనరావు కాంగ్రెస్
1978 నీలం చార్లెస్ కాంగ్రెస్
1983 గారపాటి సాంబశివరావు టీడీపీ
1985 గారపాటి సాంబశివరావు టీడీపీ
1989 మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్
1991 మాగంటి వరలక్ష్మి కాంగ్రెస్
1994 గారపాటి సాంబశివరావు టీడీపీ
1999 గారపాటి సాంబశివరావు టీడీపీ
2004 మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్
2009 చింతమనేని ప్రభాకర్ టీడీపీ
2014 చింతమనేని ప్రభాకర్ టీడీపీ