విప్పు.. నిప్పు
చింతమనేనికి పైలట్ బందోబస్తుతో పోలీసు అధికారుల మధ్య అంతరం
రోజుకో ఎస్సై ఎస్కార్ట్‌తో
ఏలూరు పోలీసుల అవస్థలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు గత కొద్దిరోజులుగా పోలీసు ఉన్నతాధికారులు కల్పిస్తున్న పైలట్ బందోబస్తు పోలీసువర్గాల్లోనే చర్చనీయాంశమైంది. ఏలూరు నగరంలోని ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి రోజుకో ఎస్సై చొప్పున, ఒకరిద్దరు కానిస్టేబుళ్లు జీపుతో ఆయన వాహనానికి ముందు సైరన్ మోతతో
ఎస్కార్ట్‌గా వెళుతున్న వ్యవహారం ఇప్పుడు ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ప్రభుత్వ విప్‌కు కూడా ఎమ్మెల్యే మాదిరిగానే ఇద్దరు గన్మన్లను ప్రభుత్వం బందోబస్తుగా నియమిస్తుంది. వివిధ కారణాల రీత్యా ఎవరైనా సెక్యూరిటీ కోరిన పక్షంలో ఉన్నతస్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) సమీక్షించి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఆర్నెల్లకోసారి జరిగే ఎస్ఆర్సీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అత్యవసర సందర్భాల్లో పోలీస్ ఉన్నతాధికారులు తమ విచక్షణాధికారం మేరకు అర్హులైన వారికి బందోబస్తు సౌకర్యం కల్పిస్తుంటారు. ఇప్పుడు హఠాత్తుగా చింతమనేనికి ఇంతటి బందోబస్తు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఒకవేళ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన సెక్యూరిటీ కోరినా, ఆ మేరకు ఎస్ఆర్సీ సిఫార్సు చేసినా ఏఆర్ పోలీసులనే ఎక్కువగా బందోబస్తు విధులకు పంపాలి. కానీ ఇప్పుడు చింతమనేనికి రోజుకో లా అండ్ ఆర్డర్ ఎస్సైను పైల టింగ్‌కు పంపడం పోలీసువర్గాల్లో చర్చకు తెరలేపింది.
ఎనిమిది నెలల కిందట ఇలాగే..
వాస్తవానికి చింతమనేని ప్రభుత్వ విప్ అయిన కొత్తలో సబ్ డివిజనల్‌స్థాయి అధికారులు ఇదేవిధంగా పైలట్ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకే బందోబస్తు ఇవ్వండి అని అప్పటి పోలీస్ ఉన్నతాధికారులు సూచించడంతో వెంటనే ఎస్కార్ట్‌ను తొలగించారు. మళ్లీ గత కొద్దిరోజులుగా చింతమనేనికి పైలట్ ఎస్కార్ట్ కేటాయించడం కిందిస్థాయి పోలీసువర్గాలనే ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీస్‌స్టేషన్‌పై దాడి, ఎస్సైపై దాడి వంటి కేసులతో సహా 34 కేసులు చింతమనేనిపై పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఎక్కడైతే చింతమనేనిపై రౌడీషీట్ ఉందో అదే పోలీస్‌స్టేషన్ ఎస్సై ఇప్పుడు ఆయన వెంట ఎస్కార్ట్‌గా వెళుతుండటం గమనార్హం. వాస్తవానికి ఓ పోలీస్ పెద్దాయన్ను మొహమాటపెట్టి పెలైట్ ఎస్కార్ట్ సౌకర్యం పొందారని, అయితే ఇదే విషయమై మరో పోలీస్ అధికారి ఒకింత అసంతృప్తిగా ఉన్నారని పోలీసువర్గాల నుంచే వచ్చిన విశ్వసనీయ సమాచారం.
జూనియర్ అసిస్టెంట్‌గా ఆ కానిస్టేబులే
ఇక అనుచరుడిలా తన వెంటే నిత్యం తిరిగే ఓ కానిస్టేబుల్‌ను ఆయన ఆఫీస్ సబ్ఆర్టినేట్గా నియమించుకోవడం కూడా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశ మైంది. మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఎప్పుడు చూసినా విధులకు గైర్హాజరై చింతమనేని వెంటే తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే కానిస్టేబుల్‌ను తన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రజాప్రతినిధులకు పోలీసేతర రెవెన్యూ విభాగాల్లోని సిబ్బందినే ఆఫీస్ సబ్‌ఆర్డినేట్లుగా నియమిస్తుంటారు. కానీ తొలిసారి చింతమనేని ఓ పోలీసు ఉద్యోగిని తన కార్యాలయ సబ్ఆర్టినేట్గా నియమించుకోవడం పోలీసు వర్గాల్లోనే ఆసక్తిని రేపుతోంది.