Dengu
-
స్వలింగ సంపర్కంతో డెంగ్యూ వ్యాప్తి
మాడ్రిడ్: స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందడాన్ని స్పెయిన్ వైద్యులు తొలిసారిగా గుర్తించారు. మాడ్రిడ్ నగరానికి చెందిన 41 ఏండ్ల ఓ స్వలింగ సంపర్కుడు డెంగ్యూ సోకిన తన సహచరుడితో లైంగిక చర్యలో పాల్గొనడంతో అతనికి కూడా డెంగ్యూ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా సదరు వ్యక్తి సహచరుడు క్యూబా పర్యటనలో ఉండగా అతనికి డెంగ్యూ వైరస్ సోకినట్టు మాడ్రిడ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అయితే తొలుత దోమకాటు కారణంగా డెంగ్యూ సోకిందని భావించిన వైద్యులు.. వివిధ రకాల వైద్య పరీక్షల అనంతరం అసలు నిజం వెల్లడైంది. అయితే స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ సోకడం ఇదే తొలిసారి అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా గత కొంతకాలంగా భారత్ పాటు ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ భారీనపడి ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు. -
డెంగీతో నగరాలు విలవిల
చండీఘఢ్: హర్యానా రాష్ర్టంలో అనేక నగరాల్లో డెంగీ వ్యాధి వ్యాపించి ప్రజలను భయకంపితులను చేస్తోంది. కర్నల్, గుర్గావ్, ఫరీదాబాద్ నగరాల్లో ఈ వ్యాధి సోకి ఇప్పటివరకు ఒక చనిపోగా, 291 మంది వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకా 1500కు పైగా వ్యాధి సోకినవారు ఉండొచ్చని అంచనా. వ్యాధిని నిరోధించడంలో ఆరోగ్యశాఖ సరైన రీతిలో స్పందించకపోవడంతో డెంగీ అన్ని నగరాలకు పాకిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్నల్ నగరంలో డెంగీ మృతి కేసు నమోదైంది. వ్యాధి సోకిన వారికి సత్వర చికిత్స అందించేందుకు, ప్లేట్లెట్లను వేరుచేసేందుకు అవసరమైన పరికరాలు ప్రభుత్వ ఆస్పత్రిలో లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారుతోంది. ఒకవేళ ఎవరైనా రోగిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పిస్తే, వారికి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ రోగుల నుంచి అధికమొత్తంలో ఫీజులను వసూలుచేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన 291 డెంగీ కేసుల్లో గుర్గావ్ నుంచి 158, ఫరీదాబాద్ నుంచి 58 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 30 కేసులు కర్నాల్ నగరం నుంచి నమోదు కాగా, వారిలో ఒకరు చనిపోయారు. అనుమానిత కేసుల్లో గుర్గావ్ నుంచి 1000కి పైగా రోగులుండగా, ఫరీదాబాద్‌లో 200మంది, మిగిలినవారు కర్నల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులను మినహాయిస్తే, రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(పీడీఐఎంఎస్)లో మాత్రమే ప్లేట్లెట్లను వేరుచేసే సదుపాయం ఉంది. రోగుల ప్లేట్లెట్ కౌంట్ కోసం పీజీఐఎంఈఆర్, చండీఘఢ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలపైనే హర్యానా ఆధారపడుతోంది. ఇదిలా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధిపై అవగాహన శిబిరాలను నిర్వహించడంలో ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారని, అందువల్లే వ్యాధి త్వరగా వృద్ధి చెందుతోందని నివాస సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. హర్యానా ఆరోగ్య సేవల (మలేరియా) డెరైక్టర్ డాక్టర్ కమలా సింగ్ మాట్లాడుతూ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ను వేరుచేసే పరికరాలు లేని మాట వాస్తవమేనన్నారు. సివిల్ సర్జన్లందరూ గుర్గావ్, ఫరీదాబాద్, కర్నల్లలో డెంగీ వ్యాధి పీడితులకు సరైన చికిత్స అందించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ఘజియాబాద్‌లో మరో ఆరు డెంగీ కేసులు ఘజియాబాద్: నగరంలో గురువారం ఆరు డెంగీ కేసులను గుర్తించినట్లు ఘజియాబాద్ జిల్లా అధికారులు తెలిపారు. ఘజియాబాద్ ముఖ్య ఆరోగ్య అధికారి అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ ఇటీవల 64 మంది డెంగీ అనుమానిత రోగులనుంచి నమూనాలను సేకరించాం.. వారిలో ఆరుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచొద్దు: ఢిల్లీవాసులకు కేంద్ర మంత్రి ఆజాద్ పిలుపు డెంగీ తీవ్రతను తగ్గించేందుకు తమ ఇళ్లల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గురువారం కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ ఢిల్లీవాసులకు సూచించారు. ప్రజల సమష్టి కృషితోనే డెంగీ వ్యాధి నిర్మూలన సాధ్యమని ఆయన అన్నారు. గురువారం ఆయన ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఏకే వాలియా, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిలో దోమల గుడ్ల వృద్ధికి ఆస్కారముంటుంద న్నారు. ఇళ్లల్లోని వాటర్ ట్యాంకులు, కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసినప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. డెంగీ నియంత్రణలో మున్సిపాలిటీల వైఫల్యం: సీఎం షీలా న్యూఢిల్లీ: నగరంలో నానాటికి విజృంభిస్తున్న డెంగీ వ్యాధిని నిరోధించడంలో స్థానిక మున్సిపల్ పాలకవర్గాలు విఫలమయ్యాయని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆరోపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ నగరంలోని మూడు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడంలేదని, దాంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని విమర్శించారు. ఉత్తర ఢిల్లీలోని కంజన్వాలాలో తొమ్మిదో ఈ-సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం డెంగీ కేసుల నిర్వహణలో ఆస్పత్రులకు కావాల్సిన వనరులను కల్పిస్తోందన్నారు. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో 700 డెంగీ బెడ్లను, ప్లేట్లెట్ కొరతను తీర్చేందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది’ అని షీలా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,567 కేసులు నమోదవ్వగా, ఇదే నెలలో గత ఏడాది 52, 2011లో 172 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆమె గుర్తు చేశారు. -
డెంగీ పంజా
సాక్షి, సిటీబ్యూరో : నగరంపై డెంగీ మళ్లీ పంజా విసురుతోంది. సీజనల్ వ్యాధులతో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెంగీ, మలేరియా, డిఫ్తీరియా వంటి వ్యాధులు చాపకింది నీరులా విస్తరిస్తున్నా సంబంధిత అధికారుల్లో ఏమాత్రం చలనం కలగడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 158 మలేరియా కేసులు, 55 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సుమారు 200 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు డిఫ్తీరియాతో మృత్యువాత పడగా, మరో ఐదుగురు డెంగీతో చనిపోయారు. సీజనల్ వ్యాధులతో సిటీజనులు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రుల్లో బాధితులు గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కలుషిత నీటి వల్ల బస్తీలు పడకేశాయి. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. నగరంలోని ఏ ఇంట్లోకి తొంగి చూసినా జలుబు, తలనొప్పి, జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు పొద్దుపొడిచినా ముసుగు తీయడం లేదు. ఉప్పర్‌పల్లికి చెందిన మౌనిక(9) తీవ్రమైన డెంగీ జర్వంతో గాంధీ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. నాలుగు రోజుల కిందట ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్లు మౌనిక తల్లిదండ్రులు తెలిపారు. అదేవిధంగా మేడిపల్లిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన కె.శంకర్ డెంగీ జర్వంతో బాధపడుతుండగా బంధువులు ఆయనను రామంతాపూర్‌లోని ఏడీఆర్ఎం ఆస్పత్రికి తరలించారు. ఇంకా పలువురు బాధితులు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఊసేలేని యాక్షన్‌ప్లాన్..? జీహెచ్ఎంసీ పరిధిలో అధికారికంగా 1470 పైగా మురికివాడలు ఉన్నాయి. సంపన్నులు నివసించే బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫిలింనగర్‌లతో సామాన్యులుండే లంగర్‌హౌస్, మాణికేశ్వరినగర్, గుడిమల్కాపూర్, మూసారంబాగ్, గోల్నాక, భోలక్‌పూర్, చిలకలగూడ, వారసిగూడ, పార్శిగుట్ట, గాంధీనగర్, ఉప్పల్, తదితర బస్తీల్లో డెంగీ, మలేరియా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అయినా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు గాని, అటు వైద్యాధికారులు గాని రంగంలోకి దిగి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వ్యాధుల నివారణ కోసం జిల్లా వైద్యాధికారులు ముందస్తుగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. ఆయా బస్తీల్లో పర్యటించి, వ్యాధులపై ముం దే ఓ అంచనాకు రావాల్సి ఉంది. కానీ వైద్యాధికారులు ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఆరోగ్య కేంద్రాల్లో విలువైన మందులే కాదు దగ్గు, జలుబుతో బాధపడుతున్న చిన్నారులకు కనీసం సిరఫ్‌లు కూడా దొరకడం లేదు. వైద్యులు రాకపోవడంతో నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు, ఆయాలే బాధితులకు పెద్దదిక్కు అవుతున్నారు. నిబంధనలు పట్టని ప్రైవేటు ఆస్పత్రులు నగరంలో ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల తో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు, 85 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లోనే డెంగీకి చికిత్స చేస్తున్నారు. డెంగీ, మలేరియాతో బాధపడుతున్న వారి నుంచి రక్తపు నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపాలి. కానీ పలు ప్రైవే టు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. సాధారణ జర్వంతో బాధపడుతున్న వారికీ డెంగీని బూచీగా చూపుతున్నాయి. ప్లేట్లెట్స్ తగ్గాయని, వెంటనే వాటిని ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని రోగులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వైద్యం పేరుతో వారి నుంచి రూ.50 వేల నుంచి రూ. 70వేల వరకు గుంజుతూ దోపిడీకి పాల్పడుతున్నాయి. రక్తంలో ప్లేట్లెట్స్ ఎలా ఉండాలంటే.... శరీరంలో ఉండాల్సిన ప్లేట్లెట్స్ : 1.50 లక్షల నుంచి 2 లక్షలు కనీసం 40 వేలకు పైగా ఉండాలి. వీరికి వెంటనే రక్తం ఎక్కించాలి,. లే దంటే మృతి చెందే ప్రమాదం ఉంది 40 వేల కంటే తక్కువ ఉంటే కష్టమే ప్రభుత్వ ఉచిత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), నారాయణగూడ వెంటెరీనరీ బయలాజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వీబీఆర్ఐ), మెహిదీపట్నం లక్షణాలివీ.. తీవ్రమైన జ్వరం భరించలేని ఒంటి నొప్పులు శరీరంపై దద్దుర్లు కళ్లు ఎరుపెక్కడం రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం జాగ్రత్తలివీ... డెంగీ, మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంట్లోని నీటి ట్యాంకులను, కుండలను, క్యాన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్త కుండీలు పెట్టకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు గదుల్లో గాలి వెలుతురు ఉండేలా చూడాలి. పిల్లలకు విధిగా పగటిపూట కూడా దోమతెరలు వాడాలి. ఇంట్లోకి దోమలు జొరబడకుండా కిటికీలకు సన్నటి జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లపై మూతలు ఉంచాలి. మూడు రోజులకు మించి నిల్వ ఉన్న మంచినీటిని తాగరాదు. - డాక్టర్ రంగనాథ్, అడిషనల్ సూపరింటిండెంట్, ఉస్మానియా యాక్షన్ ప్లాన్ అందలేదు మలేరియా, డెంగీ వ్యాధుల నివారణ కోసం జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. అది మాకింకా అందలేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు హైరిస్క్ జోన్లలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం. అయితే గత ఏడాదితో పోలిస్తే డెంగీ, మలేరియా కేసులు తక్కువే నమోదవుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డాక్టర్ శ్రీహర్ష, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి, హైదరాబాద్ -
ఢిల్లీలో డెంగీ వ్యాధితో ఐదుగురి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: డెంగీ రక్కసి మరోసారి దాడి మొదలుపెట్టింది. ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 912 మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడగా, ఐదుగురు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 14 నుంచే వ్యాధి తీవ్రత ఏకంగా 95 శాతం పెరిగిందని ఆస్పత్రులు చెబుతున్నాయి. ఎంసీడీ మాత్రం ఈ ఏడాది ఇద్దరు మాత్రమే డెంగీ వ్యాధి తో మరణించారని ప్రకటించింది. ఈ నెల ఐదున మరణించిన అశోక్నగర్వాసిని ఫూల్సింగ్గా (47), తొమ్మిదిన మరణించిన ప్రతాప్నగర్వాసిని ప్రియాంకగా గుర్తించారు. ఎంసీడీ దోమల నిరోధక విభాగంలో పనిచేసే తరుణ్ ఇందూరియా ఈ నెల ఒకటిన డెంగీతో మరణించినట్టు వార్తలు వచ్చినా ఎంసీడీ మాత్రం ధ్రువీకరించలేదు. సుజన్‌సింగ్ పార్కువాసి సునీతా, డాక్టర్ రామన్ అరోరా అనే ఇద్దరు కూడా డెంగీతో మరణించిన ట్టు డాక్టర్లు తెలి పారు. వీరిద్దరూ ఈ నెల తొమ్మిదిన మూల్‌చంద్ ఆస్పత్రిలో మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి 888 డెంగీ కేసులు నమోదు కాగా, మిగతా కేసులు హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చాయని వైద్యశాఖ తెలిపింది. ఇక ఉత్తరఢిల్లీలో అత్యధికంగా 477 మంది ఈ వ్యాధి బారినపడినట్టు ఎంసీడీ వెల్లడించింది. జోన్ల వారీగా పరిశీలిస్తే రోహిణిలో అత్యధికంగా 192 మంది, నరేలాలో 109 మందికి డెంగీ సోకింది. ప్లేట్లెట్లకు పెరిగిన డిమాండ్ డెంగీ విజృంభణ ఎంతమాత్రమూ తగ్గకపోవడం తో ఈ వ్యాధి చికిత్సకు అవసరమయ్యే ప్లేట్‌లెట్స్‌కు (రక్తకణాలు) డిమాండ్ పెరిగింది. డెంగీ బారిన పడినవారిలో ప్లేట్లెట్స్ సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతుంది. దీంతో రోగులకు ప్లేట్లెట్స్ ఎక్కించడం అనివార్యమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో సాధారణంగా ప్లేట్లెట్స్ సంఖ్య లక్షన్నర నుంచి నాలుగు లక్షలు ఉంటుంది. డెంగీ రోగుల్లో మాత్రం ఇవి వేగంగా తగ్గిపోతాయి. ప్లేట్లెట్స్ తయారయ్యే ప్రక్రియ మందగించడమే ఈ పరిస్థితికి కారణం. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేల కన్నా తగ్గితే రక్తస్రావం కావడంతో పాటు ఒంటిపై దద్దు ర్లు వస్తాయి. రక్తస్రావాన్ని నిరోధించడానికి వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. ఢిల్లీలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 912 డెంగీ కేసులు నమోదయ్యాయి. రోగుల సంఖ్య పెరగడంతో గత రెండు వారాలుగా రోజుకు 100 యూనిట్లకుపైగా ప్లేట్‌లెట్స్‌ను సరఫరా చేస్తున్నట్లు ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. గత నెలలో రోజుకు దాదాపు 10 యూనిట్ల వరకు ప్లేట్లెట్స్ జారీ చేశామని, ఈ నెల ఇది 100 యూనిట్లను దాటిందని పేర్కొంది. కొన్నిసార్లు రోజుకు 200 యూనిట్లు కూడా ఇస్తున్నామని రెడ్‌క్రాస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఎస్పీ అగర్వాల్ చెప్పారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి ప్లేట్‌లెట్స్‌కు డిమాండ్ బాగా ఉందన్నారు. బొప్పాయికి పెరిగిన గిరాకీ న్యూఢిల్లీ: బొప్పాయికి డెంగీని నయం చేసే శక్తి ఉన్నదీ లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ చాలా మంది బాధితులు మాత్రం వీటి ఆకులను చికిత్సకు వినియోగిస్తున్నారు. బొప్పాయి ఆకులకు ప్లేట్లెట్స్ పెంచే గుణం ఉంటుందని చెబుతారు. దీంతో వీటి ఆకుల కోసం చాలా మంది నర్సరీలకు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు చాలా మంది ఇళ్లలోని బొప్పాయి చెట్ల ఆకులు అదృశ్యమయ్యాయి. బొప్పాయి మొక్కలు కావాలంటూ చాలా మంది సంప్రదిస్తున్నారని, తమ దగ్గర తగినన్ని మొక్కలు ఉన్నాయని పండారారోడ్డులోని మసీద్ నర్సరీ డెరైక్టర్ విక్రమ్ సైనీ చెప్పారు. వారంలో కనీసం 25 మంది వరకు బొప్పాయి కోసం వస్తున్నారని లాడోసరాయిలోని గ్రీన్వే నర్సరీకి చెందిన వైసీ సింగ్ అన్నారు. విత్తనాలను రూ.20 చొప్పున, మొక్కలను రూ.25 చొప్పున అమ్ముతున్నామని తెలిపారు. వీటి ఆకులు ప్లేట్లెట్లను పెంచుతాయని నిరూపించే ఆధార మేదీ లేదని డాక్టర్లు అంటున్నారు. బొప్పా యి వల్ల వ్యాధి నయమయిందని పలువురు రోగులు తనతో అన్నారని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యుడు సురోం జిత్ చటర్జీ చెప్పారు. అయితే డెంగీ దానికదే తగ్గుతుంది కాబట్టి, 95 శాతం మంది చికిత్స లేకుండానే కోలుకునే అవకాశముంటుందని సర్గంగారామ్ ఆస్పత్రి డాక్టర్ బియోత్రా అన్నారు. డెంగీ బాధితులు మాత్రం బొప్పాయి ఆకులను ఉడకబెట్టాక రసం తీసి తాగితే తప్పకుండా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.