డెంగీతో నగరాలు విలవిల
Published Fri, Sep 27 2013 12:24 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
చండీఘఢ్: హర్యానా రాష్ర్టంలో అనేక నగరాల్లో డెంగీ వ్యాధి వ్యాపించి ప్రజలను భయకంపితులను చేస్తోంది. కర్నల్, గుర్గావ్, ఫరీదాబాద్ నగరాల్లో ఈ వ్యాధి సోకి ఇప్పటివరకు ఒక చనిపోగా, 291 మంది వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకా 1500కు పైగా వ్యాధి సోకినవారు ఉండొచ్చని అంచనా. వ్యాధిని నిరోధించడంలో ఆరోగ్యశాఖ సరైన రీతిలో స్పందించకపోవడంతో డెంగీ అన్ని నగరాలకు పాకిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్నల్ నగరంలో డెంగీ మృతి కేసు నమోదైంది. వ్యాధి సోకిన వారికి సత్వర చికిత్స అందించేందుకు, ప్లేట్‌లెట్‌లను వేరుచేసేందుకు అవసరమైన పరికరాలు ప్రభుత్వ ఆస్పత్రిలో లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారుతోంది.
ఒకవేళ ఎవరైనా రోగిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పిస్తే, వారికి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ రోగుల నుంచి అధికమొత్తంలో ఫీజులను వసూలుచేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన 291 డెంగీ కేసుల్లో గుర్గావ్ నుంచి 158, ఫరీదాబాద్ నుంచి 58 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 30 కేసులు కర్నాల్ నగరం నుంచి నమోదు కాగా, వారిలో ఒకరు చనిపోయారు. అనుమానిత కేసుల్లో గుర్గావ్ నుంచి 1000కి పైగా రోగులుండగా, ఫరీదాబాద్‌లో 200మంది, మిగిలినవారు కర్నల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులను మినహాయిస్తే, రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(పీడీఐఎంఎస్)లో మాత్రమే ప్లేట్‌లెట్‌లను వేరుచేసే సదుపాయం ఉంది.
రోగుల ప్లేట్‌లెట్ కౌంట్ కోసం పీజీఐఎంఈఆర్, చండీఘఢ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలపైనే హర్యానా ఆధారపడుతోంది. ఇదిలా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధిపై అవగాహన శిబిరాలను నిర్వహించడంలో ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారని, అందువల్లే వ్యాధి త్వరగా వృద్ధి చెందుతోందని నివాస సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. హర్యానా ఆరోగ్య సేవల (మలేరియా) డెరైక్టర్ డాక్టర్ కమలా సింగ్ మాట్లాడుతూ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ను వేరుచేసే పరికరాలు లేని మాట వాస్తవమేనన్నారు. సివిల్ సర్జన్లందరూ గుర్గావ్, ఫరీదాబాద్, కర్నల్‌లలో డెంగీ వ్యాధి పీడితులకు సరైన చికిత్స అందించేందుకు కృషిచేయాలని ఆదేశించారు.
ఘజియాబాద్‌లో మరో ఆరు డెంగీ కేసులు
ఘజియాబాద్: నగరంలో గురువారం ఆరు డెంగీ కేసులను గుర్తించినట్లు ఘజియాబాద్ జిల్లా అధికారులు తెలిపారు. ఘజియాబాద్ ముఖ్య ఆరోగ్య అధికారి అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ ఇటీవల 64 మంది డెంగీ అనుమానిత రోగులనుంచి నమూనాలను సేకరించాం.. వారిలో ఆరుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు.
ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచొద్దు: ఢిల్లీవాసులకు కేంద్ర మంత్రి ఆజాద్ పిలుపు
డెంగీ తీవ్రతను తగ్గించేందుకు తమ ఇళ్లల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గురువారం కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ ఢిల్లీవాసులకు సూచించారు. ప్రజల సమష్టి కృషితోనే డెంగీ వ్యాధి నిర్మూలన సాధ్యమని ఆయన అన్నారు. గురువారం ఆయన ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఏకే వాలియా, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిలో దోమల గుడ్ల వృద్ధికి ఆస్కారముంటుంద న్నారు. ఇళ్లల్లోని వాటర్ ట్యాంకులు, కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసినప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు.
డెంగీ నియంత్రణలో మున్సిపాలిటీల వైఫల్యం: సీఎం షీలా
న్యూఢిల్లీ: నగరంలో నానాటికి విజృంభిస్తున్న డెంగీ వ్యాధిని నిరోధించడంలో స్థానిక మున్సిపల్ పాలకవర్గాలు విఫలమయ్యాయని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆరోపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ నగరంలోని మూడు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడంలేదని, దాంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని విమర్శించారు. ఉత్తర ఢిల్లీలోని కంజన్‌వాలాలో తొమ్మిదో ఈ-సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం డెంగీ కేసుల నిర్వహణలో ఆస్పత్రులకు కావాల్సిన వనరులను కల్పిస్తోందన్నారు. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో 700 డెంగీ బెడ్‌లను, ప్లేట్‌లెట్ కొరతను తీర్చేందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది’ అని షీలా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,567 కేసులు నమోదవ్వగా, ఇదే నెలలో గత ఏడాది 52, 2011లో 172 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆమె గుర్తు చేశారు.
Advertisement