‘డెంగీ’పై ఆందోళన వద్దు
పెదపళ్ల (ఆలమూరు) :
డెంగీ, సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందవద్దని డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య పేర్కొన్నారు. పెదపళ్ల పీహెచ్సీని శనివారం ఆయన సందర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ డెంగీలో తొలిదశను డీఎన్ఎస్, రెండో దశను డీహెచ్ఎస్, మూడో దశను డీఎస్ఎస్గా భావిస్తామని చెప్పారు. తొలి రెండు దశలు అంత ప్రమాదకరమైనవి కావని, సమీప వైద్య కేంద్రాల్లో వీటికి చికిత్స చేస్తారని తెలిపారు. డెంగీ వ్యాధి నిర్థారణ అందుబాటులో ఉన్నందున మూడో దశకు చేరే రోగిని గుర్తించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సను చేయించుకోవాలని వివరించారు. జిల్లాలోని సుమారు 125 పీహెచ్సీల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్టు వెల్లడించారు. పీహెచ్సీల్లో సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ టి.రమేష్ కిషోర్, వైద్యాధికారి ఆర్.సుదర్శన్బాబు ఉన్నారు.