శ్రీకాంత్ ఓటమి
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లోని చివరి రౌండ్లో శ్రీకాంత్ 19-21, 21-10, 17-21తో కెంటో మొమొత (జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు.
అంతకుముందు జరిగిన తొలి రౌండ్ పోరులో ఈ గుంటూరు జిల్లా కుర్రాడు 21-13, 21-8తో క్రిస్టియాన్ లిండ్ థామ్సన్ (డెన్మార్క్)పై అలవోక విజయం సాధించాడు. భారత ఆటగాళ్లు సౌరభ్ వర్మ, ప్రణయ్‌లు కూడా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. అయితే మరో అగ్రశ్రేణి ఆటగాడు ఆనంద్ పవార్ మాత్రం మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. ఇతను రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 21-7, 21-17తో దితెర్ డామ్కీ (జర్మనీ)పై గెలిచాడు.
బుధవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ పోటీల్లో భారత స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, సింధు, కశ్యప్, గురుసాయిదత్, అజయ్ జయరామ్ బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో స్టెఫానీ (బల్గేరియా)తో; ఎరికో హిరోస్ (జపాన్)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో డారెన్ లూ (మలేసియా)తో కశ్యప్; హూ యున్ (హాంకాంగ్)తో గురుసాయిదత్; బూన్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో అజయ్ జయరామ్; చెన్ లాంగ్ (చైనా)తో ఆనంద్ పవార్ పోటీపడతారు.