Department of Municipal
-
పద్ధతిగా పట్టణాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసే ప్రక్రియ రూపుదిద్దుకుంటోంది. పట్టణాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తోంది. వానలు, వరదలు వచ్చినా నష్టం కలగకుండా పట్టణాల్లో నాలాల అభివృద్ధి, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొదలు పన్ను వసూళ్లకు శాస్త్రీయ విధానాన్ని రూపొందించడం వరకు మాస్టర్ ప్లాన్‌లో పొందుపరుస్తోంది. జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాలతోపాటు వరంగల్ కార్పొరేషన్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ప్రజలు పడుతున్న కష్టాలు పునరావృతం కాకుండా మాస్టర్ప్లాన్లు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాస్టర్ప్లాన్లను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రెసిడెన్షియల్, వాణిజ్య, గ్రీన్ జోన్లుగా.. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్ లేదా గ్రీన్ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. బెంగళూరు, చండీగఢ్ నగరాల తరహాలో నివాస, నివాసేతర ప్రాంతాలను జోన్లుగా విభజించనుంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో జోన్ల వారీగా విభజించి రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయనుంది. క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతోపాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి అభివృద్ధి చేపట్టనుంది. ఈ జోన్లను జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)తో అనుసంధానించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలికవసతులు అభివృద్ధి చేయనుంది. ప్రయోగాత్మకంగా 17 మున్సిపా లిటీల్లో ఇప్పటికే జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్లు తయారు చేసి అమలు తీరును పరీక్షించింది. మాస్టర్ ప్లాన్‌లో రోడ్ నెట్వర్క్, జనాభా, భౌగోళిక అంశాల వంటి 40 అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. పట్టణ ప్రగతి కింద ఇప్పటికే.. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే ప్రభుత్వం మున్సిపాలిటీలకు రూ. 2,062 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 858 కోట్ల వ్యయంతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కి.మీ. మేర రహదారుల వెంట మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్మెంట్ మాస్టర్ ప్లాన్ కోసం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్‌లో వ్యర్థాల బయో మైనింగ్ ప్రాజెక్టుతోపాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్‌ఎస్‌ఏపీలను సిద్ధం చేయనుంది. 38 పట్టణాల్లో రూ. 1,433 కోట్లతో నీటిసరఫరా పథకాలు, రూ. 700 కోట్లతో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లు, రూ. 61 కోట్లతో మెహదీపట్నం, ఉప్పల్‌లో స్కై వాక్ నిర్మాణాలతోపాటు కొత్వాల్‌గూడ దగ్గర్లో 85 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు వంటివన్నీ మాస్టర్ ప్లాన్‌లో భాగమే. 70 పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు రెడీ... రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ తదితర కార్పొరేషన్లలో ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేశారు. మొత్తంగా 70 నగరాలు, పట్టణాల్లో మాస్టర్ ప్లాన్లు సిద్ధమయ్యాయని, మరో 37 మున్సిపాలిటీలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లను నెల రోజుల్లో సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. -
దశాబ్దాల దరిద్రం పోవాలె
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని, సరిపడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ సహా ఉన్నతాధికారులను ఆదేశించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం అణువణువూ పరిశీలించాలని, అందుకు పాదయాత్ర చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి బుధవారం నల్లగొండలో పర్యటించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి గాదరి మారయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కిశోర్‌తో పాటు ఆయన తల్లి సుజాత, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మారయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో నల్లగొండ అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంఏయూడీ నుంచి ప్రత్యేక నిధులు ‘పట్టణ సమగ్రాభివృద్ధికి మున్సిపల్ శాఖ నుంచి (ఎంఏయూడీ) రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు మంజూరు చేస్తాం. ఈ ఏడాది, వచ్చే ఏడాది 2 విడతలుగా నిధులు ఇస్తాం. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల అభివృద్ధికి గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో, నల్లగొండ పట్టణంతో పాటు ఆ మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి..’అని సీఎం ఆదేశించారు. తాను 15 రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పారు. 31న కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డిల పర్యటన ‘నల్లగొండ అభివృద్ధి కోసం పట్టణంలో పర్యటించి, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈనెల 31వ తేదీన నల్లగొండలో పర్యటించాలి. పాదయాత్రలు చేపట్టి అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలి. రూ.110 కోట్లతో ఐటీ హబ్ వస్తోంది. రూ.36 కోట్లతో ఎన్జీ కాలేజీకి కొత్త భవన నిర్మాణం చేపట్టాలి..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ఉత్తర్వులు రెండురోజుల్లోగా విడుదల చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ‘పట్టణ భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి. రోడ్లు వెడల్పు పనులు చేపట్టాలి. ప్రస్తుత బీట్మార్కెట్లో మోడల్ మార్కెట్ నిర్మించాలి..’అని సూచించారు. ఉదయ సముద్రం ట్యాంక్‌బండ్ అభివృద్ధి చేయాలి ‘లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు సబ్స్టేషన్లు నిర్మించాలి. ఉదయసముద్రం అద్భుతమైన నీటి వసతితో కళకళలాడుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్‌ను అభివృద్ధి చేయాలి. ఆహ్లాదకరమైనరీతిలో అర్బన్ పార్కును అందుబాటులోకి తేవాలి. సభలు, సమావేశాలకోసం అధునాతన సౌకర్యాలతో రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన టౌన్ హాల్ నిర్మించాలి..’అని కేసీఆర్ ఆదే శించారు. ఇందుకోసం నగరం నడిబొడ్డున అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేను, కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ‘ఉప్పల్ భగాయత్ మాదిరిగా లాండ్ పూలింగ్ చేపట్టి, కాలనీల నిర్మాణానికి పూనుకోవాలి. నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫుట్‌పాత్ లు నిర్మించాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వేర్వేరుగా శ్మశానవాటికల నిర్మాణాన్ని చేపట్టాలి..’అని సూచించారు. ప్రాజెక్టు కాలనీల వాసులకు ఇళ్ల పట్టాలు ‘ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి, దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు క్వార్టర్లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణప్పుడు అక్కడే నివాసం ఏర్ప ర్చు కున్న కాలనీవాసులతోపాటు, ఖమ్మం, నిజామా బాద్ జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలున్నాయి. అక్కడ కూడా అర్హులైనవారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నవారికి శాశ్వతపట్టాలు కల్పించాలి. ఆ దిశ గా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి’అని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఫోన్లో ఆదేశించారు. టౌన్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన సమీక్ష సమావేశం అనంతరం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న ఇరిగేషన్, ఆర్ అండ్ బీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆ స్థలం టౌన్ హాల్ నిర్మాణానికి అనువుగా ఉంటుందా అనే విషయాన్ని పరిశీలించారు. నీటిపారుదల శాఖ కార్యాలయాలను ఒకే చోటకు తరలించి టౌన్ హాల్ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండకు సిద్దిపేట కమిషనర్ నల్లగొండ పట్టణం అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే నియమిస్తామని సీఎం చెప్పారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా అప్పటికప్పుడు ఫోన్లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ధి చేసేదాకా నిద్రపోవద్దని, సిద్దిపేట మాదిరిగా నల్లగొండనూ తీర్చిదిద్దా లని సూచించారు. ఆరు నెలల ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న ఆయనకు మూడేళ్లు ఎక్స్టెన్షన్ ఇస్తా మని తెలిపారు. ఆయన్ను వెంటనే పంపించాలని పక్కనే ఉన్న మంత్రి హరీశ్‌రావుకు చెప్పారు. ఏం నాయక్ బాగున్నావా? నల్లగొండ క్రైం: ఎమ్మెల్యే కిశోర్ నివాసం వద్ద నల్లగొండ జైలు సూపరింటెండెంట్ దేవ్లానాయక్ను.. ‘ఏం నాయక్ బాగున్నావా..’అంటూ సీఎం పలకరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. అప్పుడు దేవ్లానాయక్ ఆ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఏదైనా అవసర పడితే కలవాలని సూచించారు. -
నిర్మాణ అనుమతుల్లో జాప్యమేల?
♦ అన్నీ సక్రమంగా ఉన్నా మంజూరు కావటం లేదంటున్న బిల్డర్లు ♦ అధికారులు, ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తున్నట్లు వెల్లడి ♦ ఓసీ జారీలోనూ అధికారులది అలసత్వమే సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న దిక్కుమాలిన నిబంధనల్ని తొలగిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ రంగం ఎదుర్కొనే సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కూడా పదే పదే చెబుతున్నారు. కానీ, సంబంధిత మంత్రిత్వ శాఖలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయనేది నిర్మాణ సంస్థల ఆరోపణ. ఫీజుల రూపంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చే స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించడం మానేసి రకరకాల కారణాలతో వేధిస్తున్నారని నగరంలో పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్న ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’ ప్రతినిధితో వాపోయారు. గతంలో చేతివాటం ప్రదర్శించైనా సరే అనుమతులను జారీ చేసేవారని... ఇప్పుడైతే జేబు ఖాళీ అవుతోంది తప్ప పని మాత్రం జరగటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆన్లైన్ ద్వారా అనుమతులివ్వటమనేది పెద్ద ప్రహసనంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా అనుమతులు మాత్రం రావటంలేదు. అధికారులు లేకపోవటం, సిబ్బంది కొరత వంటి రకరకాల కారణాలను సాకుగా చూపుతున్నారు. వేగంగా అనుమతులు వస్తేనే కదా మేం మరిన్ని ప్రాజెక్టులు చేపట్టగలిగేది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఓసీ జారీలోనూ అంతే.. నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే కొనుగోలుదారులు ఇంట్లోకి అడుగుపెట్టలేకపోతున్నారు. ఇందుకు కారణం స్థానిక సంస్థలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయటంలో జాప్యం చేస్తుండటమే. నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయిన 15 రోజుల్లోనే ఓసీని జారీ చేయాలి. కానీ, అధికారులు ఇందుకు అనుగుణంగా నడుచుకోవటంలేదు. ♦ డెవలపర్లు నిర్మాణ సమయంలో తనఖా కింద 10 శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు సమర్పించాలి. దీన్ని విడుదల చేయడానికి, అనుసరించాల్సిన విధివిధానాల్ని జీవో నంబర్ 168లో పేర్కొన్నారు. దీని ప్రకారం డెవలపర్ అనుమతి ప్రకారం నిర్మాణం చేపట్టారా? నాలుగువైపులా ఖాళీలను సరిగ్గా వదిలారా? నిబంధనల ప్రకారమే భవన వినియోగం ఉందా? పార్కింగ్ కోసం స్థలాన్ని సక్రమంగా వదిలి పెట్టారా? తదితర అంశాల్ని పరిశీలించి స్థానిక సంస్థలు తనఖాను విడుదల చేయాలి. ♦ కానీ, జరుగుతున్నదేంటంటే.. నిర్మాణం పూర్తయి.. చివరి పనులు జరుగుతున్నప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను జారీ చేయటంలేదు. పైగా అగ్నిమాపక నిరోధక శాఖ నుంచి నిరంభ్యంతర ధృవీకరణ పత్రం తెచ్చారా? మంచినీటి లభ్యతను పరిశీలించారా? వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్ని పరిశీలించాలని జీవోలో ఎక్కడా పేర్కొనలేదు. అయినప్పటికీ కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓసీ జారీలో ఆలస్యం ప్రభావం డెవలపర్ల మీద కాకుండా కొనుగోలుదారుల మీద పడుతోంది. సమయానికి గృహ ప్రవేశం చేయలేక అటు బ్యాంకు నెలసరి వాయిదాలు కట్టలేక, ఇటు అద్దెలూ చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.