నిర్మాణ అనుమతుల్లో జాప్యమేల?
♦ అన్నీ సక్రమంగా ఉన్నా మంజూరు కావటం లేదంటున్న బిల్డర్లు
♦ అధికారులు, ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తున్నట్లు వెల్లడి
♦ ఓసీ జారీలోనూ అధికారులది అలసత్వమే
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న దిక్కుమాలిన నిబంధనల్ని తొలగిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ రంగం ఎదుర్కొనే సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కూడా పదే పదే చెబుతున్నారు. కానీ, సంబంధిత మంత్రిత్వ శాఖలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయనేది నిర్మాణ సంస్థల ఆరోపణ. ఫీజుల రూపంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చే స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించడం మానేసి రకరకాల కారణాలతో వేధిస్తున్నారని నగరంలో పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్న ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’ ప్రతినిధితో వాపోయారు.
గతంలో చేతివాటం ప్రదర్శించైనా సరే అనుమతులను జారీ చేసేవారని... ఇప్పుడైతే జేబు ఖాళీ అవుతోంది తప్ప పని మాత్రం జరగటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆన్‌లైన్ ద్వారా అనుమతులివ్వటమనేది పెద్ద ప్రహసనంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా అనుమతులు మాత్రం రావటంలేదు. అధికారులు లేకపోవటం, సిబ్బంది కొరత వంటి రకరకాల కారణాలను సాకుగా చూపుతున్నారు. వేగంగా అనుమతులు వస్తేనే కదా మేం మరిన్ని ప్రాజెక్టులు చేపట్టగలిగేది?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఓసీ జారీలోనూ అంతే..
నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే కొనుగోలుదారులు ఇంట్లోకి అడుగుపెట్టలేకపోతున్నారు. ఇందుకు కారణం స్థానిక సంస్థలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయటంలో జాప్యం చేస్తుండటమే. నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయిన 15 రోజుల్లోనే ఓసీని జారీ చేయాలి. కానీ, అధికారులు ఇందుకు అనుగుణంగా నడుచుకోవటంలేదు.
♦ డెవలపర్లు నిర్మాణ సమయంలో తనఖా కింద 10 శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు సమర్పించాలి. దీన్ని విడుదల చేయడానికి, అనుసరించాల్సిన విధివిధానాల్ని జీవో నంబర్ 168లో పేర్కొన్నారు. దీని ప్రకారం డెవలపర్ అనుమతి ప్రకారం నిర్మాణం చేపట్టారా? నాలుగువైపులా ఖాళీలను సరిగ్గా వదిలారా? నిబంధనల ప్రకారమే భవన వినియోగం ఉందా? పార్కింగ్ కోసం స్థలాన్ని సక్రమంగా వదిలి పెట్టారా? తదితర అంశాల్ని పరిశీలించి స్థానిక సంస్థలు తనఖాను విడుదల చేయాలి.
♦ కానీ, జరుగుతున్నదేంటంటే.. నిర్మాణం పూర్తయి.. చివరి పనులు జరుగుతున్నప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను జారీ చేయటంలేదు. పైగా అగ్నిమాపక నిరోధక శాఖ నుంచి నిరంభ్యంతర ధృవీకరణ పత్రం తెచ్చారా? మంచినీటి లభ్యతను పరిశీలించారా? వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్ని పరిశీలించాలని జీవోలో ఎక్కడా పేర్కొనలేదు. అయినప్పటికీ కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓసీ జారీలో ఆలస్యం ప్రభావం డెవలపర్ల మీద కాకుండా కొనుగోలుదారుల మీద పడుతోంది. సమయానికి గృహ ప్రవేశం చేయలేక అటు బ్యాంకు నెలసరి వాయిదాలు కట్టలేక, ఇటు అద్దెలూ చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.