దశాబ్దాల దరిద్రం పోవాలె  | Telangana: CM KCR Assures Rs 100 Crore For Nalgonda Development | Sakshi
Sakshi News home page

దశాబ్దాల దరిద్రం పోవాలె 

Published Thu, Dec 30 2021 1:30 AM | Last Updated on Thu, Dec 30 2021 1:30 AM

Telangana: CM KCR Assures Rs 100 Crore For Nalgonda Development - Sakshi

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ తండ్రి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, కిశోర్‌ తదితరులు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని, సరిపడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించారు.

ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులను ఆదేశించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం అణువణువూ పరిశీలించాలని, అందుకు పాదయాత్ర చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి బుధవారం నల్లగొండలో పర్యటించారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ తండ్రి గాదరి మారయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కిశోర్‌తో పాటు ఆయన తల్లి సుజాత, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మారయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో నల్లగొండ అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఎంఏయూడీ నుంచి ప్రత్యేక నిధులు 
‘పట్టణ సమగ్రాభివృద్ధికి మున్సిపల్‌ శాఖ నుంచి (ఎంఏయూడీ) రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు మంజూరు చేస్తాం. ఈ ఏడాది, వచ్చే ఏడాది 2 విడతలుగా నిధులు ఇస్తాం. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల అభివృద్ధికి గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో, నల్లగొండ పట్టణంతో పాటు ఆ మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి..’అని సీఎం ఆదేశించారు. తాను 15 రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పారు.  

31న కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డిల పర్యటన 
‘నల్లగొండ అభివృద్ధి కోసం పట్టణంలో పర్యటించి, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈనెల 31వ తేదీన నల్లగొండలో పర్యటించాలి. పాదయాత్రలు చేపట్టి అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలి. రూ.110 కోట్లతో ఐటీ హబ్‌ వస్తోంది.

రూ.36 కోట్లతో ఎన్‌జీ కాలేజీకి కొత్త భవన నిర్మాణం చేపట్టాలి..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ఉత్తర్వులు రెండురోజుల్లోగా విడుదల చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ‘పట్టణ భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి. రోడ్లు వెడల్పు పనులు చేపట్టాలి. ప్రస్తుత బీట్‌మార్కెట్‌లో మోడల్‌ మార్కెట్‌ నిర్మించాలి..’అని సూచించారు.  

ఉదయ సముద్రం ట్యాంక్‌బండ్‌ అభివృద్ధి చేయాలి 
‘లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు సబ్‌స్టేషన్లు నిర్మించాలి. ఉదయసముద్రం అద్భుతమైన నీటి వసతితో కళకళలాడుతున్న నేపథ్యంలో ట్యాంక్‌ బండ్‌ను అభివృద్ధి చేయాలి. ఆహ్లాదకరమైనరీతిలో అర్బన్‌ పార్కును అందుబాటులోకి తేవాలి. సభలు, సమావేశాలకోసం అధునాతన సౌకర్యాలతో రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన టౌన్‌ హాల్‌ నిర్మించాలి..’అని కేసీఆర్‌ ఆదే శించారు.

ఇందుకోసం నగరం నడిబొడ్డున అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేను, కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ‘ఉప్పల్‌ భగాయత్‌ మాదిరిగా లాండ్‌ పూలింగ్‌ చేపట్టి, కాలనీల నిర్మాణానికి పూనుకోవాలి. నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫుట్‌పాత్‌ లు నిర్మించాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వేర్వేరుగా శ్మశానవాటికల నిర్మాణాన్ని చేపట్టాలి..’అని సూచించారు.  

ప్రాజెక్టు కాలనీల వాసులకు ఇళ్ల పట్టాలు 
‘ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి, దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు క్వార్టర్లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలి. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణప్పుడు అక్కడే నివాసం ఏర్ప ర్చు కున్న కాలనీవాసులతోపాటు, ఖమ్మం, నిజామా బాద్‌ జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలున్నాయి.

అక్కడ కూడా అర్హులైనవారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నవారికి శాశ్వతపట్టాలు కల్పించాలి. ఆ దిశ గా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి’అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఫోన్లో ఆదేశించారు.  

టౌన్‌ హాల్‌ నిర్మాణానికి స్థల పరిశీలన 
సమీక్ష సమావేశం అనంతరం నల్లగొండ క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో ఉన్న ఇరిగేషన్, ఆర్‌ అండ్‌ బీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. ఆ స్థలం టౌన్‌ హాల్‌ నిర్మాణానికి అనువుగా ఉంటుందా అనే విషయాన్ని పరిశీలించారు.

నీటిపారుదల శాఖ కార్యాలయాలను ఒకే చోటకు తరలించి టౌన్‌ హాల్‌ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, వి.శ్రీనివాస్‌ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

నల్లగొండకు సిద్దిపేట కమిషనర్‌ 
నల్లగొండ పట్టణం అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే మున్సిపల్‌ కమిషనర్‌ను వెంటనే నియమిస్తామని సీఎం చెప్పారు. సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా అప్పటికప్పుడు ఫోన్లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ధి చేసేదాకా నిద్రపోవద్దని, సిద్దిపేట మాదిరిగా నల్లగొండనూ తీర్చిదిద్దా లని సూచించారు. ఆరు నెలల ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న ఆయనకు మూడేళ్లు ఎక్స్‌టెన్షన్‌ ఇస్తా మని తెలిపారు. ఆయన్ను వెంటనే పంపించాలని పక్కనే ఉన్న మంత్రి హరీశ్‌రావుకు చెప్పారు.  

ఏం నాయక్‌ బాగున్నావా? 
నల్లగొండ క్రైం: ఎమ్మెల్యే కిశోర్‌ నివాసం వద్ద నల్లగొండ జైలు సూపరింటెండెంట్‌ దేవ్‌లానాయక్‌ను.. ‘ఏం నాయక్‌ బాగున్నావా..’అంటూ సీఎం పలకరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. అప్పుడు దేవ్‌లానాయక్‌ ఆ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఏదైనా అవసర పడితే కలవాలని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement