departmental stores
-
అమెరికాలో భారత యువకుడి మృతి
న్యూయార్క్ : అమెరికాలోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న పంజాబ్‌కు చెందిన విద్యార్థి బల్జీత్ సింగ్ అలియాస్ ప్రిన్స్ (28)ను దుండుగులు కాల్చిచంపారు. చికాగోలో బుధవారం రాత్రి ఈ ఘటన జరగ్గా గురువారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. డిపార్ట్మెంట్ స్టోర్‌లో తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బల్జీత్‌ను దుండగులు అడ్డగించారు. బల్జీత్ వద్ద ఎలాంటి సొమ్ము, విలువైన వస్తువులు లేకపోవడంతో అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారని బాధితుడి తాత ఫమ్మాన్ సింగ్ చెప్పారు. గాయపడిన స్థితిలో బల్జీత్ అవతార్ సింగ్‌కు ఫోన్ చేయగా, బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బల్జీత్ మరణించినట్టు వైద్యులు ప్రకటించారని సింగ్ తెలిపారు. ముగ్గురు నలుగురు దుండగులు బల్జీత్‌పై కాల్పులు జరిపారని చెప్పారు. -
వాయనం: ‘లేబుల్’ చూసే కొంటున్నారా?
ఒకప్పుడు సరుకులు కొనాలంటే కిరాణా కొట్టుకు వెళ్లి, ఏది ఎంత కావాలో చెబితే... దుకాణదారుడు కాగితపు సంచుల్లో వేసి ఇచ్చేవాడు. తెచ్చి వాడుకునేవాళ్లం. డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చాక ఈ పద్ధతి మారిపోయింది. ఈ స్టోర్స్ లేని పల్లెటూళ్లలో తప్ప ఎక్కడా ‘లూజ్’ కొనుక్కోవడం లేదు. స్టోర్‌కి వెళ్లడం, షాపంతా తిరుగుతూ నచ్చినవాటిని ఏరుకోవడం, అంతా అయ్యాక బిల్లు చెల్లించి వచ్చేయడం! ఈ పద్ధతి అందరికీ బాగా నచ్చింది. ఎందుకంటే... ఉన్న వాటిలో బెస్ట్ ఎంచుకోవచ్చు. మనకు నచ్చిన ధరలోనే తీసుకోవచ్చు. అయితే నచ్చినవి తెచ్చేసుకోవడమేగానీ... అవి సురక్షితమో కాదో గమనిస్తున్నామా? అంటే... అవి ఎప్పుడు తయారయ్యాయి, ఏయే పదార్థాలతో తయారయ్యాయి, ఎంతకాలం నిల్వ ఉంటాయి వంటివన్నీ చెక్ చేసుకుంటున్నామా? లేదు. ఈ అలవాటు ఎనభై ఆరు శాతం మందికి లేనేలేదని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇది చాలా తప్పు, ప్రమాదకరం కూడా! వస్తువులు కొనేటప్పుడు వారంటీ, గ్యారంటీ ఎలా చూస్తామో... తిను బండారాలు, దినుసులు, మందులు కొనేటప్పుడు చూసి తీరాల్సినవి కొన్ని ఉన్నాయి. మొదట చూడాల్సింది ఎక్స్‌పయిరీ డేట్. ఆ తేదీ ఇంకా కనీసం మూడు నాలుగు నెలలు ఉంటేనే కొనాలి. లేదంటే కొనకపోవడమే మంచిది. కొన్నిటికి డేట్ ఇవ్వకుండా... ‘బెస్ట్ బిఫోర్ సిక్స్ మన్త్స్, ఒన్ ఇయర్’ అంటూ రాస్తాడు. అలాంటప్పుడు తయారీ తేదీ (మానుఫ్యాక్చరింగ్ డేట్) చూసుకుని, అక్కడ్నుంచి లెక్కపెట్టుకోవాలి. తర్వాత చూసు కోవాల్సింది... తిను బండారాలను వేటితో తయారు చేశారు అని. డైటింగ్ చేస్తున్న వాళ్లు, చక్కెర వ్యాధిగ్రస్తులు, కొన్ని రకాల అలర్జీలు ఉన్నవాళ్లయితే ఇంగ్రీడియెంట్స్ చూడకుండా అస్సలు కొనకూడదు. ఎందుకంటే వాటిలో మనకు పడనివి ఏవైనా ఉన్నాయి అనుకుంటే... కొనడం మానేయవచ్చు. పైగా పోషకాలు ఏమున్నాయనేది కూడా తెలుసుకోవడం మంచిదే కదా! అందుకే ఏయే పదార్థాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇక మందులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు కొన్నిసార్లు కాంబినేషన్స్ చెబుతారు. వాటిని చెక్ చేసుకోవాలి. అలానే... డాక్టర్ ఎంత పవర్ ("mg') చెప్పారో అంతే ఉందా, ఎక్కువ తక్కువ ఉందా అని కూడా చూసుకోవాలి. కాస్మొటిక్స్ కూడా అంతే. ఎక్స్‌పయిరీ డేట్లు చూడకుండా కొనేస్తే... అందం పెరగడం పోయి ఉన్నది కాస్తా పాడవుతుంది. ర్యాషెస్, అలర్జీలు వంటివి వచ్చి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు టైమ్ వేస్ట్ అనుకోకుండా ‘లేబుల్స్’ తప్పక పరిశీలించండి. అయినా ఆరోగ్యం కంటే విలువైనది ఏముంది చెప్పండి! ఆదా + ఆరోగ్యం! దోశె వేస్తాం. రుచి బాగుంటుంది కదా అని చెంచాతో చుట్టూ నూనె పోస్తాం. చపాతీ చేస్తాం. బాగా కాలుతుంది కదా అని కాస్త నూనెను తగిలిస్తాం. అది కాస్త అని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఎక్కువ వేస్తుంటాం. చెంచాతో పోస్తే ఎంత పోస్తున్నామో తెలియదు. దాంతో తినాల్సిన దానికంటే ఎక్కువ నూనెను తినేస్తాం. అంటే... మన ఆరోగ్యాన్ని చేతులారా మనమే పాడు చేసుకుంటున్నామన్నమాట! తెలియకుండా జరిగిపోయే ఈ తప్పును ఆపడానికే ‘కుకింగ్ స్ప్రే’లను కనిపెట్టారు. వేరుశెనగ, సన్‌ఫ్లవర్, ఆలివ్ తదితర నూనెలతో పాటు వెన్న, నెయ్యి లాంటివి కూడా ఇప్పుడు ‘స్ప్రే’ల రూపంలో దొరుకుతున్నాయి. వీటి వల్ల ఉపయోగం ఏంటనే కదా! ఉంది. చాలా ఉంది. అసలు స్ప్రేలను తక్కువ ద్రవాన్ని ఎక్కువ ప్రదేశంలో చల్లేందుకు కనిపెట్టారు. వంట నూనెను కూడా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే... ఒక్కసారి స్ప్రే చేయగానే నూనె దోశె/చపాతీ అంతటా పరచుకుంటుంది... అది కూడా అతి తక్కువ పరిమాణంలో. ఆదాకి ఆదా... ఆరోగ్యానికి ఆరోగ్యం! వీటి ధర 250 రూపాయల నుంచి మొదలువుతుంది. పరిమాణాన్ని బట్టి, నూనెను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఆన్లైన్లో అయితే కాస్త తక్కువలో కొనుక్కోవచ్చు! -
ఉల్లి ఉచితం!!
సాక్షి, ముంబై: ఉల్లి.. వంటింట్లో ఉండే సరుకు కాదిప్పుడు... వినియోగదారులను ఆకట్టుకునే అయస్కాంతం..! డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు ‘ఉల్లి పథకం’ను ప్రవేశపెడుతున్నారు. దాదర్‌లోని కొన్ని డిపార్ట్మెంటల్ స్టోర్లు వెయ్యి రూపాయలకుపైగా కొనుగోలు చేస్తే కిలో ఉల్లి ఉచితమంటూ ఫ్లెక్సీలు, బోర్డులు పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయల దరిదాపునకు చేరుకుంది. దీంతో వినియోగదారులు కూడా దుస్తులు, ఎలక్ట్రిక్, గృహావసరాల కోసం ఎవైనా వస్తువులు కొనాలన్నా ముందుగా ‘ఉల్లి బోర్డు’ ఎక్కడుందో చూస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఉల్లి బోర్డు ఉందంటే పరోక్షంగా పదిశాతం డిస్కౌంటు లభించినట్లే. నెలకు సరిపడా కిరాణా సామగ్రిని కొనాలన్నా ఎంతలేదన్నా కనీసం రెండువేలకు పైగానే అవుతుంది. అలాంటప్పుడు రెండు కేజీల ఉల్లి ఉచితం గా ఇచ్చినా రూ.200 మేర కలిసొచ్చే అవకాశముంది. దీంతో ప్రజలు కూడా ఈ ఆఫర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. జేబులు నింపుకుంటున్న చిల్లర వ్యాపారులు... ఉల్లిపాయలు అమ్మే ఓ చిల్లర వ్యాపారి రోజుకు వంద కిలోల ఉల్లి అమ్మితే ఎంత లాభపడేవాడో ఇప్పుడు 30 కేజీల ఉల్లి అమ్మినా అంతే లాభపడుతున్నాడు. వాషిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో కిలో ఉల్లి ధర రూ. 40-50 మధ్య ఉండగా చిల్లర వ్యాపారులు కిలోకు రూ.20-30 పెంచి రూ.70-80లకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉల్లి ధర ఒకలా, దూరమున్న ప్రాంతాల్లో ఉల్లి ధర మరోలా ఉంటుంది. నిజానికి ఈ తేడా ఎప్పుడూ ఉండేదే అయినా ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు చిల్లర వ్యాపారులు భారీ వ్యత్యాసంతో ఉల్లిని విక్రయిస్తున్నారు. క్యాబేజీ ముక్కలే దిక్కు... బార్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఉల్లితో తయారయ్యే వంటకాలను లిస్టులోనుంచి తొలగిస్తున్నా యి. రెస్టారెంట్లలో ప్రత్యేకంగా ఉల్లి ముక్కలను వడ్డించే పరిస్థితి లేదు. ఒకవేళ కావాలని ఎవరైనా డిమాండ్ చేస్తే క్యాబేజీ ముక్కలను కలిపి వడ్డిస్తున్నారు. కొందరైతే నేరుగానే లేదని చెప్పేస్తుండగా మరికొందరు ‘ప్రత్యేకంగా ఉల్లి వడ్డించబడదు’ అని మెనూలో గమనికలు పెడుతున్నాయి. ఇక టిఫిన్ సెంటర్లలో ఉల్లి పకోడి, ఉతప్పా, ఉల్లి దోసె మాయమైంది. అమ్మో... ఎంత మాయో? నిజానికి రాష్ట్రంలో ఉల్లి ఇంతగా ధరలు పెరగాల్సినంత కొరత లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొందరు కావాలనే ఉల్లికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉల్లి ధరలను తగ్గించేందుకు నానా అవస్థలు పడుతున్న ప్రభుత్వం మరి ఇలా కృత్రిమంగా కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకోవచ్చు కదా? అనే అనుమానం కలగడం సహజమే. అయితే కృత్రిమంగా కొరత సృష్టించేవారు ఇప్పడు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఈ విషయమై ఎన్హెచ్ఆర్డీఎఫ్సీ డెరైక్టర్ ఆర్.పి.గుప్తా మాట్లాడుతూ...‘మార్చి నుంచి మే వరకు పుణే, నగర్, షోలాపూర్, నాసిక్ తదితర జిల్లాల్లోని రైతుల నుంచి వ్యాపారులు నేరుగానే కోట్ల రూపాయల విలువ చేసే ఉల్లిని కొనుగోలు చేస్తారు. అయితే వాటిని గోదాముల్లోకి తరలించకుండా రైతుల వద్దే ఉంచుతారు. అందుకు రైతులకు కొంతమొత్తం అద్దె కూడా చెల్లిస్తారు. ఇలా మార్కెట్లోకి సరుకు రాకుండా చేసి కృత్రిమంగా కొరత సృష్టిస్తారు. సరుకు రైతుల వద్దే ఉండడంతో వ్యాపారులపై చర్య తీసుకునేందుకు మార్కెట్శాఖకు వీలుపడదు. సరుకు ధర ఆకాశన్నంటుతున్న తరుణంలో రైతుల వద్ద నిల్వ ఉంచిన ఉల్లిని భారీ ధరకు మార్కెట్‌కు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు ఎప్పుడు వచ్చే లాభం కంటే దాదాపు పదింత లాభం ఎక్కువగా వస్తుంద’న్నారు. త్వరలో చైనా ఉల్లి పెరిగిన ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేం దుకు చైనా నుంచి భారీగా ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి చైనా నుంచి భారత్‌కు రవాణా అయ్యేందుకు సిద్ధంగా ఉందని మార్కెట్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25 వరకు అవి ముంబైకి చేరుకునే అవకాశముందన్నారు. వీటి ధర టన్నుకు 400 డాల ర్లు(అంటే రూ.27,639) ఉండవచ్చని అంచనవేశారు. అంటే కిలో ఉల్లి ధర దాదాపు రూ.28 ఉంటుంది. చైనా సరుకు మార్కెట్లోకి వస్తే ఉల్లి ధర బాగా తగ్గుతుందని చెబుతున్నారు.